ఈపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ ప‌రిమితులు, ప‌న్నులు

ఈపీఎఫ్ ఖాతాను ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కు కొన‌సాగిస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంది.

ఈపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ ప‌రిమితులు, ప‌న్నులు

ఈపీఎఫ్ఓ ఉప‌సంహ‌ర‌ణ‌ల నిబంధ‌న‌లను ఖాతాదారుల సౌక‌ర్యం మేర‌కు నిరంత‌రం స‌వ‌రిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈపీఎఫ్ డ‌బ్బు ఆన్‌లైన్ ద్వారా విత్‌డ్రా చేసుకుంటే నేరుగా త‌మ ఖాతాలో జ‌మ‌వుతుంది. అయితే ఈపీఎఫ్ ఖాతాను ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కు కొన‌సాగించాల‌ని ఆర్థిక నిపుణుల సూచ‌న‌. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ముందే విత్‌డ్రా చేసుకోకుండా నియంత్రించేందుకు ప్ర‌భుత్వం ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై ప‌న్ను వ‌ర్తింప‌జేస్తోంది. ఉద్యోగం మానేసిన ఒక నెల త‌ర్వాత 75 శాతం, రెండు నెల‌ల త‌ర్వాత మ‌రో 25 శాతం ఈపీఎఫ్ మొత్తాన్ని తీసుకునే విధంగా ఇటీవ‌ల స‌వ‌ర‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ పై ప‌న్ను:

  1. క‌నీసం ఐదేళ్లు ఉద్యోగంలో కొన‌సాగ‌క‌పోతే ఈపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో ప‌న్ను వర్తిస్తుంది.

  2. ఉద్యోగం మారాల‌నుకుంటున్న‌ప్పుడు ఈపీఎఫ్ ఖాతాను మ‌రో సంస్థ‌కు బ‌దిలీ చేస్తే రెండు సంస్థ‌ల్లో కలిపి ఎంత కాలం కొన‌సాగార‌న్నది ప‌రిగ‌ణిస్తారు.

  3. మొత్తం ఐదేళ్ల కంటే త‌క్కువ కాలం ఖాతాను కొన‌సాగిస్తే ఈపీఎప్ విత్‌డ్రాపై ప‌న్ను ఉంటుంది.

  4. ఈపీఎఫ్ ఖాతాలో న‌గ‌దు మొత్తం నాలుగు ర‌కాలుగా జ‌మ‌వుతుంది. అది సంస్థ వాటా, ఉద్యోగి వాటా, సంస్థ‌ చేసిన డిపాజిట్‌పై వ‌డ్డీ, ఉద్యోగి చేసిన డిపాజిట్‌పై వ‌డ్డీ.

  5. ఐదేళ్ల కంటే త‌క్కువ‌గా ఖాతాను కొన‌సాగిస్తే సంస్థ డిపాజిట్ చేసిన మొత్తంతో పాటు వ‌డ్డీపై కూడా ప‌న్ను ప‌డుతుంది.

  6. ఉద్యోగి వాటాపై ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో ప‌న్ను ఉండ‌దు. అయితే ఉప‌సంహ‌ర‌ణ‌కు ముందు సంవ‌త్స‌రాల్లో ఎప్పుడైనా సెక్ష‌న్ 80సీ కింద ఈపీఎఫ్‌పై క్లెయిమ్ చేసుకుంటే విత్‌డ్రా స‌మ‌యంలో ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం ఈపీఎఫ్‌పై సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

  7. ఉద్యోగి చేసిన డిపాజిట్‌పై వ‌చ్చిన వ‌డ్డీని ఇత‌ర ఆదాయంగా ప‌రిగ‌ణించి ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు.

  8. ఐదేళ్ల కంటే ముందు విత్‌డ్రా చేసుకుంటే టీడీఎస్ 10 శాతం ఉంటుంది.

  9. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఖాతాలో మొత్తం రూ.50 వేల కంటే త‌క్కువ‌గా ఉన్నా లేదా సంస్థ మూసివేసినా టీడీఎస్ ఉండ‌దు.

  10. రూ.50 వేల కంటే ఎక్కువగా ఉండి, ఐదేళ్ల కంటే త‌క్కువ కాలం ఉద్యోగంలో కొన‌సాగితే ఖాతాదారుడు ఫారం 15జీ/15హెచ్ స‌మ‌ర్పిస్తే టీడీఎస్ మిన‌హాయింపు ఉంటుంది. అయితే మొత్తం ఆదాయం ఆ సంవ‌త్స‌రానికి ప‌న్ను ప‌రిమితికి త‌క్కువ‌గా ఉండాలి. ఫారం 15 హెచ్ సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం కాగా, ఫారం 15 జీ 60 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారికి వ‌ర్తిస్తుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly