ఎల్‌టీఏ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

ప్ర‌యాణం చేసిన‌ట్టుగా టికెట్లు, బోర్డింగ్ పాసులు, బిల్లులు లాంటివి మ‌నం ప‌నిచేసే సంస్థ‌కు స‌మ‌ర్పించాలి.

ఎల్‌టీఏ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

సంస్థ‌లు, ఉద్యోగ‌లకు అందించే ప్ర‌యోజ‌నాల్లో భాగంగా సెల‌వు ప్ర‌యాణ భ‌త్యం (ఎల్‌టీఏ)ను ఇస్తుంటాయి. దీంతో ఉద్యోగి వేత‌నం నుంచి ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. ఎల్‌టీఏను, లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ) అని కూడా అంటారు. దీనిని ప్ర‌తీ సంవ‌త్స‌రం క్లెయిమ్ చేసుకొనేందుకు గానీ, పూర్తి మొత్తంపై క్లెయిమ్ చేసుకొనేందుకు గానీ వీలుండ‌దు. ఎల్‌టీఏ అనేది ఉద్యోగి వేత‌న‌ ప్యాకీజీలో ఒక భాగమే, అయిన‌ప్ప‌టికీ ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 10(5) ప్ర‌కారం దీనిని ప‌న్ను ర‌హిత‌ ఆదాయంగా ప‌రిగ‌ణించ‌కూడ‌దు.

ఎల్‌టీఏపై ఎంత మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు?

ఈ ప్ర‌యాణ భ‌త్యం భార‌త‌దేశంలో ప్ర‌యాణించినందుకు మాత్ర‌మే ఇస్తారు. ఉద్యోగి ప్ర‌యాణ భ‌త్యం క్లెయిం చేసిన కాలానికి త‌ప్ప‌నిస‌రిగా సెల‌వులో ఉండాలి. సంస్థ నుంచి ఎల్‌టీఏ రూపంలో ఎంతైతే ఆదాయం వ‌స్తుందో అంత మేర‌కు ప‌న్ను మిన‌హాయింపు కోర‌వ‌చ్చు. ఎల్‌టీఏకి మించి చేసిన ఖ‌ర్చుకు ప‌న్ను క్లెయిమ్ చేసుకోలేము.

మీరు చేసే ప్ర‌యాణం, వాస్త‌వ వ్య‌యంపై ఎల్‌టీఏ ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక‌వేళ ప్ర‌యాణం చేయ‌క‌పోతే మిన‌హాయింపు రాదు. ప్ర‌యాణం చేసిన‌ట్టుగా టికెట్లు, బోర్డింగ్ పాసులు, బిల్లులు లాంటివి మ‌నం ప‌నిచేసే సంస్థ‌కు స‌మ‌ర్పించాలి. రైల్వే, విమాన‌, ఇత‌ర ప్ర‌జా ర‌వాణా ప్ర‌యాణ ఖ‌ర్చుల‌కు ఎల్‌టీఏ క్లెయిం చేసుకోవ‌చ్చు.

ఎల్‌టీఏలో ప‌న్ను మిన‌హాయింపు కోసం ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు?

నాలుగు సంవ‌త్స‌రాల‌లో రెండు సార్లు చేసే ప్ర‌యాణాల‌కే ఈ భ‌త్యం వ‌ర్తిస్తుంది. ప్ర‌స్తుతం 2018-2021 సంవ‌త్స‌రాలవి న‌డుస్తున్నాయి. ఒక ప్ర‌యాణ భ‌త్యాన్ని వ‌చ్చే ఏడాదికి బ‌దిలీ చేసుకునే వీలుంది. ఉదాహ‌ర‌ణ‌కు 2014-17 మ‌ధ్య‌లో దీన్ని ఉప‌యోగించ‌క‌పోతే 2018 ప్ర‌యాణ భ‌త్యంలో వాడుకునే వీలుంది. ఈ విధానం ద్వారా నాలుగు సంవ‌త్స‌రాల‌లో గ‌రిష్టంగా మూడు ఎల్‌టీఏ ప‌న్ను మిన‌హాయింపును పొంద‌వ‌చ్చు. అయితే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్ట ప్ర‌కారం బ‌దిలీ చేసిన దానిని మొద‌టి సంవ‌త్స‌రంలో క్లెయిమ్ చేస్తేనే అనుమ‌తిస్తారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ త‌మ త‌మ సంస్థ‌లు అందించే ఎల్‌టీఏల‌ను క్లెయిం చేసుకోవ‌చ్చు. అయితే ఇద్ద‌రూ ఒకే ప్ర‌యాణానికి క్లెయిం చేసుకునే వీలులేదు.

ఎల్‌టీసీ క్లెయిమ్ చేసుకునేముందు కొన్ని విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకోవాలి. ఎల్‌టీసీ కేవ‌లం ప్ర‌యాణం ఎందులో చేస్తున్నారో రైలు, రోడ్డు లేదా విమాన ప్ర‌యాణం అది కూడా దేశీయ ప్ర‌యాణాల‌కే క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. విదేశీ ప్ర‌యాణాల‌కు ఇది వ‌ర్తించ‌దు. ఇంకా బోజ‌నం, ట్యాక్సీ, ఆటో వంటివి ఇందులోకి రావు. అయితే ప్ర‌యాణ ఖ‌ర్చులు కూడా ప‌రిమితిలోపు ఉంటేనే క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటే ప‌న్ను ప‌డుతుంది.

ఎల్‌టీఏ లెక్కించేప్పుడు జీవిత భాగ‌స్వామి, పిల్ల‌లు, ఉద్యోగిపై ఆధార‌ప‌డిన త‌ల్లిదండ్రుల‌తో పాటు తోబుట్టువుల ప్ర‌యాణ ఖ‌ర్చుల కూడా అనుమ‌తిస్తారు. అక్టోబ‌ర్ 1, 1998 నుంచి ఈ మిన‌హాయింపు ఉద్యోగి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మాత్ర‌మే ఇస్తున్నారు. అయితే ఎలాంటి ప్ర‌యాణం చేయ‌కుండా ఎల్‌టీసీ క్లెయిమ్ చేసుకునేందుకు వీల్లేదు. ప్ర‌యాణానికి వెళ్లిన‌ప్పుడు సెల‌వు పెట్టి ఉండాలి. ఒక‌వేళ టిక్కెట్ బుక్ చేసిన త‌ర్వాత ప్ర‌యాణం చేయ‌క‌పోయానా ఎల్‌టీసీ వ‌ర్తించ‌దు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly