పోర్ట‌ల్ ద్వారా 59 నిమిషాల‌లోనే గృహ‌, వాహ‌న రుణాలు..

రుణ ఆమోద లేఖ అందిన తర్వాత.. 7-8 పని దినాల్లో రుణ మొతాన్ని మంజూరు చేస్తారు

పోర్ట‌ల్ ద్వారా 59 నిమిషాల‌లోనే గృహ‌, వాహ‌న రుణాలు..

ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ రిటైల్ రుణ వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశ్యంతో గృహ, వాహ‌న‌ రుణాలతో పాటు ఇత‌ర‌ రిటైల్ రుణాల‌ను ‘psbloansin59minutes’ పోర్టల్‌లో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్నాయి.

ప్ర‌స్తుతం ఈ పోర్ట‌ల్ ద్వారా రూ.1కోటి వ‌ర‌కు రుణాల‌ను సూక్ష్మ, చిన్న, మధ్య శ్రేణి సంస్థల (ఎంఎస్‌ఎంఈలు)కు 59 నిమిషాలు లేదా ఒక గంట లోపే సూత్రప్రాయ ఆమోదం ఇస్తున్నారు. అయితే ఈ పోర్ట‌ల్ ద్వారా మంజూరు చేసే మొత్తాన్ని రూ.5 కోట్ల‌కు పెంచాల‌ని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), యూనియన్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ సహా మరికొన్ని పీఎస్‌బీలు నిర్ణయించాయి.

కొన్ని రీటైల్ రుణాల‌ను పోర్ట‌ల్ ద్వారా సులభంగా మంజూరు చేసేందుకు, రిటైల్ రుణాల‌ను ఆన్‌బోర్డ్ చేసే యోచ‌న‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ప్ర‌స్తుతం ఉన్న పోర్ట‌లో గృహ‌, వాహ‌న రుణాల‌ను ఆన్‌బోర్డ్‌డ్ చేసే దిశగా ప‌నిచేస్తున్నామ‌ని బ్యాంక్ ఆఫ్ ఇండియా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ సలీల్ కుమార్ స్వైన్ తెలిపారు.

అదేవిధంగా ఇండియ‌న్ ఓవ‌ర్‌సీస్ బ్యాంకు(ఐఓబీ) కూడా రిటైల్ రుణాల‌ను పోర్ట‌ల్‌లో ఆఫ‌ర్ చేస్తుంది. ఎమ్ఎస్ఎమ్ఈ ల‌కు పోర్ట‌ల్ ద్వారా రుణాల‌ను మంజూరు చేయ‌డంలో ఐఓబీ చురుకుగా పాల్గోంటోంది. రుణాలు మంజూరు చేయ‌డంలో బ్యాంకు అభివృద్ధిని సాధించింద‌ని, రుణాలు మంజూరు చేయ‌డం ప్రారంభ‌మైన నాటితో పోలిస్తే, ప్ర‌స్తుతం రుణాలు తీసుకున్న వారి సంఖ్య‌, మంజూరు చేసిన మొత్తం అనేక రెట్లు పెరిగింద‌ని గ‌త వారం చేసిన ప్ర‌క‌ట‌న‌లో బ్యాంకు తెలిపింది.

ఈ ప‌థ‌కానికి రుణ‌గ్ర‌హీత‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. అందువ‌ల్ల ఎమ్ఎస్ఎమ్ఈ కింద రూ.5 కోట్ల వ‌ర‌కు రుణాల‌ను సూత్ర‌ప్రాయంగా మంజూరు చేసే ప్ర‌క్రియ‌లో బ్యాంక్ ఉంది. అంతేకాకుండా నిర్ణీత స‌మ‌యంలో బ్యాంక్ ప్లాట్‌ఫామ్ ద్వారా గృహ‌, వ్య‌క్తిగ‌త రుణాలు వంటి రీటైల్ రుణాల‌ను అందిస్తుంది.

రుణ పంపిణీ వేగవంతం చేసేందుకు, బ్యాంకర్లు, వినియోగ‌దారుల‌ సమయాన్ని ఆదా చేసేందుకు ఈ వేదిక స‌హాయ‌ప‌డుతుంది. ఈ ప్లాట్‌ఫాంపై ఇత‌ర ప్రాడెక్టుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా బ్యాంక్ రిటైల్ వ్యాపారాన్ని విస్త‌రించ‌డంతోపాటు లావాదేవీల వ్యయాన్ని తగ్గించవ‌చ్చ‌ని బ్యాంకు అధికారి ఒక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు.

పోర్టల్‌లో సూత్రప్రాయ ఆమోదం లభించాక, నచ్చిన బ్యాంక్‌ను ఎంచుకునే సౌలభ్యం రుణగ్రహీతకు ఉంది. రుణ ఆమోద లేఖ అందిన తర్వాత… 7-8 పని దినాల్లో రుణ మొతాన్ని మంజూరు చేస్తున్నారు. ప్రారంభించిన నాలుగు నెలల్లోపు రూ .35వేల కోట్లకు పైగా రుణాలను పోర్టల్ ద్వారా మంజూరు చేశారు. మార్చి 31,2019 నాటికి 50,706కి పైగా ప్రతిపాదన‌ల‌కు సూత్రప్రాయ ఆమోదం లభించిగా, అందులో 27,893 ప్రతిపాదనలు మంజూరు చేశారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly