2020 ఆర్థిక సంవ‌త్స‌రానికి ప‌న్నుఆదా పెట్టుబ‌డులు ప్రారంభించారా?

ఆర్థిక సంవ‌త్సరం మొద‌టి నుంచే ప‌న్ను ఆదా చేసే పెట్టుడుల‌ను ప్రారంభించ‌డం మంచిది

2020 ఆర్థిక సంవ‌త్స‌రానికి ప‌న్నుఆదా పెట్టుబ‌డులు ప్రారంభించారా?

2019 ఆర్థిక సంవ‌త్స‌రం ప‌న్ను ఆదా పెట్టుబ‌డుల‌కు గ‌డువు ముగిసింద‌ని మ‌న‌లో చాలా మంది రిలేక్స్ అయిపోతుంటారు. కానీ 2020 ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి నుంచే ప‌న్ను ప్ర‌ణాళిక ప్రారంభించాలి. చివ‌రి వ‌ర‌కు వాయిదా వేసి, ఆఖ‌రి నిమిషంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఆచ‌ర‌ణీయాత్మ‌కం కాదు. ఎందుకంటే చివ‌రి నిమిషంలో మీరు ఎంచుకునే పెట్టుబ‌డులు, పెట్టుబ‌డిగా పెట్టిన మొత్తాన్ని లాక్ చేయోచ్చు లేదా ఆశించిన రాబ‌డిని అందిచ‌లేక పోవ‌చ్చు. అందువ‌ల్ల ఈ ఆర్థిక సంత్స‌రం ప‌న్ను ఆదా పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌కు ఇదే స‌రైన స‌మయం.

సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం ఎంత మిన‌హాయింపు పొంద‌చ్చు?
ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్‌ 80సీ చాలా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఈ సెక్ష‌న్ ద్వారా రూ. 1.5 లక్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్‌), నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్‌(ఎన్‌పీఎస్‌), ఉద్యోగి భ‌విష్య నిధి(ఈపీఎఫ్‌), జీవిత బీమా ప్రీమియం, ఈక్వీటి- లింకెడ్ పొదుపు ప‌థ‌కం(ఈఎల్ఎస్ఎస్‌), పిల్ల‌ల విద్య కోసం చెల్లించే ట్యూష‌న్ ఫీజులు, గృహ రుణ అస‌లు చెల్లింపులు వంటి వాటిలో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా సెక్ష‌న్ 80 సీ కింద మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

మీకు ఉన్న మిన‌హాయింపు ప‌రిధి, ఇప్ప‌టి వ‌ర‌కు మీరు పెట్టుబ‌డి పెట్టిన మొత్తాల ద్వారా పొందే మిన‌హాయింపును లెక్కించి, మిగిలిన మొత్తానికి మీకు త‌గిన పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం ద్వారా మెరుగైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కి, ఒక ఉద్యోగి, ఇంటి రుణ అస‌లు చెల్లింపుల‌కు రూ.70 వేలు, పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజులకు రూ. 20 వేలు చెల్లిస్తుంటే ఈ రెండింటి అయ్యే వ్య‌యం రూ. 90 వేలు. సెక్ష‌న్‌ 80 సీ ప్ర‌కారం ల‌భించే మిన‌హాయింపు ప‌రిధి రూ. 1.5 ల‌క్ష‌లు. వేత‌న‌దారులు ప్ర‌తీ నెల ఈపీఎఫ్ చెల్లిస్తుంటారు కాబ‌ట్టి, 2020 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.20 వేలు ఈపీఎఫ్ చెల్లించారు అనుకుంటే, సెక్ష‌న్ 80సీ కింద ల‌భించే పూర్తి ప‌న్ను మిన‌హాయిపు కోసం మార్చి 31,2020కి ఇంకా రూ.40 వేలు పెట్టుబ‌డి చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప‌లు ర‌కాలుగా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఈ విధంగా చేసి ఒక ఉద్యోగి ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.46,800 వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌చ్చు.

ప‌రిగ‌ణించ‌వ‌ల‌సిన అంశాలు:
ప‌న్ను చెల్లింపుదారులు ముఖ్యంగా జాగ్ర‌త్త తీసుకోవ‌ల‌సిన అంశం ద్ర‌వ్య‌త‌. ప‌న్ను ఆదా కోసం మాత్ర‌మే పెట్టుబ‌డిని ఎంచుకోకూడ‌దు. మీరు ఎంచుకునే ప్ర‌తి పెట్టుబ‌డి భ‌విష్య‌త్తులో మీకు ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో అర్థంచేసుకోవాలి. ప‌న్ను ఆదా పెట్టుబ‌డుల‌ను ఎంచుకునే ముందు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ల‌సిన కొన్ని ముఖ్య అంశాల‌ను ఇప్పుడు చూద్దాం.

రిస్క్‌:
ఈఎల్ఎస్ఎస్‌, యులిప్స్ వంటి పెట్టుబ‌డులు ఈక్వీటి ఆధారంగా ప‌నిచేయ‌డం వ‌ల్ల‌ అదిక రిస్క్‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటాయి. రాబ‌డి స్టాక్ మాక్కెట్ల‌కు లింక్ అయ్యి ఉంటుంది. వీటిలో పెట్టుబ‌డి పెట్టే ముందు మీరు ఎంత వ‌ర‌కు రిస్క్ తీసుకోగ‌ల‌రు అని నిర్ధారించుకుని మ‌దుపు చేయాలి. అయితే సెక్ష‌న్ 80 సీ ద్వారా ప‌న్ను ఆదా చేసుకునే ఇత‌ర‌ పెట్టుబ‌డి మార్గాల కంటే ఈఎల్ఎస్ఎస్‌లు ఎక్కువ రాబ‌డులను ఇస్తాయి.
సాంప్ర‌దాయ బీమా పాల‌సీలు, పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ, ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎన్‌పీఎస్ వంటి వాటిలో రిస్క్ ఫ్యాక్ట‌ర్ త‌క్కువ‌గా లేదా నామ‌మాత్రంగా ఉంటుంది.

రాబ‌డి అంచ‌నా:
రాబ‌డి విష‌యానికి వ‌చ్చే స‌రికి, సాంప్ర‌దాయ బీమా పాల‌సీలు, పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ, ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎన్‌పీఎస్ వంటి వాటిలో రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది. యులిప్స్‌ డెట్ ఫండ్లు, యులిప్స్‌, ఎన్‌పీఎస్‌లు కొంత వ‌ర‌కు మంచి రాబ‌డుల‌ను ఇస్తాయి. ఈఎల్ఎస్ఎస్‌లలో రిస్క్ ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ రాబ‌డి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. రిస్క్ శాతాన్ని త‌గ్గించుకునేందుకు సిస్ట‌మేటిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ప్లాన్‌(సిప్‌) ద్వారా మ‌దుపు చేయ‌చ్చు.

ఆదాయంపై ప‌న్ను:
మీ పెట్టుబ‌డుల నుంచి వ‌చ్చిన ఆదాయం వ‌ర్తించే ప‌న్ను విష‌యానికి వ‌స్తే - పీపీఎఫ్‌, జీవిత బీమా పాల‌సీ, యులిప్స్, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న వంటి ప‌థ‌కాల‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్‌, పెన్ష‌న్ ప్లాన్లు, ఎన్‌పీఎస్‌, వంటి వాటిపై పాక్షికంగా ప‌న్ను వ‌ర్తిస్తుంది. 5 సంవ‌త్స‌రాల ఎఫ్‌డీ, ఎన్ఎస్‌సీ, పెద్ద‌ల పొదుపు ఖాతాల‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

లిక్వీడిటీ:
ప‌న్ను ఆదా పెట్టుబ‌డి ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్టేప్పుడు, లాక్‌-ఇన్‌-పిరియ‌డ్ వంటి ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకోవాలి. మంచి ఫోర్ట్‌ఫోలియో, లిక్వీడిటీ, పొదుపు, రాబ‌డి, ర‌క్ష‌ణ‌ల క‌ల‌యిక‌గా ఉండాలి. ప‌న్ను ఆదా కోసం మొత్తం పెట్టుబ‌డుల‌ను లాక్‌-ఇన్-పిరియ‌డ్ ఎక్క‌వ కాలం ఉన్న లేదా ఎక్కువ కాలం పెట్టుబ‌డి పెట్టాల్సిన ఉత్ప‌త్తుల‌లో ఉంచితే అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో లిక్వీడిటీ స‌మ‌స్య రావ‌చ్చు. అందువ‌ల్ల ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే స‌రైన రీతిలో ప‌న్ను ఆదా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకుని మ‌దుపు చేయాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly