మీ ఆరోగ్య బీమా కంపెనీ అందిస్తున్న సేవలతో సంతృప్తిగాలేరా? అయితే ఇది మీకోస‌మే

ఆరోగ్య బీమా కంపెనీ మెరుగైన సేవలు అందించకుంటే పాలసీ దారుడు వేరే కంపెనీకి మారే అవకాశమే పాలసీ పోర్టబిలిటీ..

మీ ఆరోగ్య బీమా కంపెనీ అందిస్తున్న సేవలతో సంతృప్తిగాలేరా? అయితే ఇది మీకోస‌మే

ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు చేసిన త‌రువాత చాలా మంది వారు తీసుకున్న పాల‌సీల‌లో లోపాలు చూస్తుంటారు. ఒక‌వేళ బీమా సంస్థ అందించే సేవ‌లు మీకు సంతృప్తిగా లేక‌పోతే మ‌రిన్ని మెరుగైన సేవ‌లు, అద‌న‌పు సౌక‌ర్యాలు అందించే మ‌రొక సంస్థ‌కు బ‌దిలీ కావ‌చ్చ‌ని మీకు తెలుసా? మ‌న‌లో చాలామంది పాల‌సీ కొనుగోలు చేసేప్పుడు, వివిధ ఆరోగ్య‌బీమా సంస్థ‌ల ప్రీమియంల‌ను మాత్ర‌మే పోల్చిచూస్తారు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ శాతం, నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రులు వంటి ఇత‌ర అంశాల గురించి అంత‌గా ప‌ట్టించుకోరు. అయితే పాల‌సీ క్లెయిమ్ చేసుకునే స‌మ‌యంలో తిర‌స్క‌ర‌ణ‌కు గురైనా లేదా ఆక‌స్మికంగా ప్రీమ‌యం పెర‌గ‌టం వంటివి జ‌రిగిన‌ సంద‌ర్భాల‌లో చాలా మంది పాల‌సీదారులు వారి ఆరోగ్య బీమాను బ‌దిలీ చేస్తున్నారు. ప‌రిశ్ర‌మ నిపుణుల ప్ర‌కారం ఆరోగ్య బీమా పాల‌సీల‌ను పార్ట‌బిలీటీ చేసుకునే వారి సంఖ్య దాదాపు 10 నుంచి 18 శాతానికి పెరిగింది.

పాల‌సీని ఒక సంస్థ నుంచి వేరొక సంస్థ‌కు బ‌దిలీ చేసేప్పుడు ప్ర‌స్తుతం ఉన్న పాల‌సీనే కొత్త సంస్థ‌లో కూడా తీసుకోవ‌ల‌సి ఉంటుంది. ఉదాహరణకు, మనం తీసుకున్న పాలసీ మెడిక్లెయిందై ఉంటే వేరే కంపెనీకి మారేటప్పుడు కేవలం మెడిక్లెయిం పాలసీకి మాత్రమే మారగలం. వెయిటింగ్ పిరియ‌డ్‌, నోక్లెయిమ్ బోన‌స్‌లు కొత్త సంస్థ అందించే పాల‌సీకి బ‌దిలీ చేస్తారు. అయితే ఇంతకు ముందు మనం బీమా ద్వారా పొందిన ప్రయోజనాలను కొత్త కంపెనీకి బదిలీ చేయించుకునే అవకాశమున్నా కొన్ని మాత్రం యథాతథంగా పొందేందుకు వీలుండదు. మ‌రికొన్ని కొత్త బీమా సంస్థ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉంటాయి.

ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీజెస్‌కు సంబంధించి ఇంతకు ముందున్న కంపెనీతో వెయిటింగ్‌ పీరియడ్‌ పూర్తయితే దాన్ని పరిగణిస్తారు. లేదా వెయిటింగ్‌ పీరియడ్‌లో కొంత పూర్తయినా అక్కడి నుంచి మిగిలిన సమయాన్ని లెక్కిస్తారు. పాత బీమా కంపెనీ వ‌ద్ద క్రమానుసారంగా పాల‌సీని పున‌రుద్ధ‌రించుకున్న‌ట్ల‌యితేనే కొత్త కంపెనీ పాల‌సీని బ‌దిలీ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తుంది. నో క్లెయిం బోనస్‌ను బీమా హామీ సొమ్ముతో కలిపి అందుకు వర్తించే ప్రీమియంను వసూలు చేస్తారు.

పార్ట‌బిలిటీ విధానంలో పాత పాల‌సీలో ఉన్నఅదే మొత్తానికి కొత్త బీమా సంస్థ హామీ అందిస్తుంది. బీమా అందించే సంస్థ‌పై ఆధార‌ప‌డి హామీ మొత్తాన్ని పెంచుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. అయితే నో క్లెయిమ్ బోన‌స్ వంటి పార్ట‌బిలిటీ ప్ర‌యోజ‌నాలు పాత బీమా పాల‌సీలో ఉన్న హామీ మొత్తానికి మాత్ర‌మే వ‌ర్తిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కి, మీరు రూ.7 ల‌క్ష‌లకు పాల‌సీ తీసుకుని పార్ట‌బిలిటీ విధానం ద్వారా వేరే బీమా సంస్థ‌కు మారిన‌ప్పుడు హామీ మొత్తాన్ని రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచార‌నుకుందాం. అయితే కొత్త ప్ర‌యోజ‌నాలు రూ.7 ల‌క్ష‌ల‌కు మాత్ర‌మే అమ‌ల‌వుతాయి.

ప్రీమియం ఒక్క‌టే ప్రామాణికంగా చేసుకుని పాల‌సీని బ‌దిలీచేసుకోకూడ‌దు. ఒక‌వేళ మీరు ప్రీమియం త‌క్కువ‌గా ఉంద‌ని వేరే బీమా సంస్థ‌కు పాల‌సీ బ‌దిలీ చేస్తుంటే హామీ మొత్తం త‌క్కువ‌కాకుండా చూసుకోవాలి. అధిక హామీ ఇచ్చే పాల‌సీని ఎంచుకుంటే పెంచిన హామీ మొత్తానికి వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. పార్ట‌బిలిటీ విధానం ద్వారా కొత్త బీమా సంస్థ అధిక ప్ర‌యోజ‌నాలతో పాటు ప్రీమియం మొత్తాన్ని పెంచుతుంది. అందువ‌ల్ల కొత్త బీమా సంస్థకి పాల‌సీ బ‌దిలీ చేసేప్పుడు పాత సంస్థ అందించే ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోకుండా చూసుకోవాలి.

బీమా పునరుద్ధరించుకునే ముందు మాత్ర‌మే పార్ట‌బిలిటీకి అవ‌కాశం ఉంటుంది. పాలసీ బదిలీ నిర్ణయాన్ని కొత్త బీమా కంపెనీ తప్పనిసరిగా అంగీకరించాలని లేదు. ప్రీమియంలు సరిగ్గా చెల్లించకపోయినా, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విజ్ఞప్తిని తిరస్కరించే అవకాశము బీమా కంపెనీకి ఉంటుంది. అటువంట‌ప్పుడు బీమా చేసిన వ్య‌క్తి త‌మ పాత కంపెనీకి ప‌రిమితం కావ‌ల్సి వ‌స్తుంది. సాధార‌ణంగా బీమా సంస్థ‌లు, పాల‌సీ తీసుకునే వ్య‌క్తి వ‌య‌సు, ఆరోగ్య ప‌రిస్థితుల ఆధారంగా పార్ట‌బిలీటీని అంగీక‌రిస్తాయి. ఎక్కువ వ‌య‌సు, ముందుగా నిర్ధారించిన వ్యాధులు ఉన్న‌వారు, త‌రుచుగా అనారోగ్యానికి గుర‌య్యే వారి పార్ట‌బిలీటీని తిర‌స్క‌రించ‌వ‌చ్చు. ఒక‌వేళ అంగీక‌రించినా అనేక నిబంధ‌న‌లు విధిస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly