పింఛన్ అందించే యాన్యూటీలు
పదవీ విరమణ తర్వాత పింఛను పొందాలనుకునే వారి కోసం రూపొందించినవే రిటైర్మెంట్ పెన్షన్(యాన్యుటీ) పాలసీలు.
పదవీ విరమణ ప్రణాళికలో భాగంగా మదుపర్లు తమ పెట్టుబడిలో కొంత భాగాన్ని యాన్యూటీల్లో పెట్టుబడిగా పెట్టాలి. పదవీవిరమణ వయసు వచ్చాక పింఛను పొందేలా రూపొందించిన పాలసీలను బీమా కంపెనీలు అందిస్తున్నాయి. మన అవసరాన్ని బట్టి నెలకు లేదా సంవత్సరానికి ఒకసారి పింఛనుపొందే వీలుంది. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే తగినంత నిధిని సమకూర్చుకునేందుకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి.
బీమా కంపెనీలు రెండు రకాల పింఛను పాలసీలను అందిస్తున్నాయి. ఇమ్మిడీయట్ పింఛను ప్లాన్స్, డిఫర్డ్ పింఛను ప్లాన్స్కనిష్ఠ వయసు 18 సంవత్సరాలనుంచి గరిష్ఠ వయసు 85 వరకూ తీసుకోవచ్చు.
ప్రీమియం: నెలవారీ అయితే రూ. 200 నుంచి మొదలుకొని రూ. 2500 వరకూ, ఏడాదికి ఒకసారి అయితే కనిష్ఠంగా రూ. 2400, గరిష్ఠంగా రూ. 50,000 వరకూ ప్రీమియం చెల్లించాల్సిన పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం మొత్తం ఒక్కసారిగా లేదా నెల, మూడు నెలలు, ఏడాదికి ఒక్కసారి చెల్లించే వీలుంది.
పింఛను పొందేందుకు ఉన్న వ్యవధి (డిఫర్మెంట్ పీరియడ్):మనం పెట్టుబడి చేయాల్సిన నిర్ణీత కాలాన్ని డిఫర్మెంట్ పీరియడ్ అంటారు. పరిమిత కాలంలో పెట్టుబడి పెట్టిన డబ్బును కాలపరిమితి ముగిసిన తర్వాత పింఛనుగా చెల్లిస్తారు. 10 నుంచి మొదలుకొని 40 ఏళ్ల వరకూ డిఫర్మెంట్ పీరియడ్ ఉంటుంది. అయితే 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మొదలుపెట్టే పింఛను పాలసీల్లో మనం చెల్లించే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
పాలసీ కాలపరిమితి: 10,15,20,25,30,35,40 ఏళ్ల కాలపరిమితి కలిగిన పాలసీలను కంపెనీలు రూపొందిస్తున్నాయి. ఈ సమయంలో పాలసీదారుడికి బీమా కవరేజీ ఉంటుంది.
బీమా హామీ మొత్తం: రూ. 25,000 మొదలుకొని రూ. 50,00,000 వరకూ బీమా హామీ మొత్తం ఉన్న పాలసీలు ఉన్నాయి. ఆదాయం, అవసరాలకు అనుగుణంగా పాలసీని ఎంచుకోవాలి.
పింఛను చెల్లింపు: మనం ఎంచుకున్న పాలసీని బట్టి పింఛను చెల్లింపు ఉంటుంది. నెలవారీ రూ. 200 నుంచి రూ. 10,000 వరకూ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి తీసుకునే యాన్యూటీ రూ. 1000 నుంచి రూ. 50,000 వరకూ ఉంటుంది.
పరిమిత కాలానికి పింఛను: మొత్తం జీవిత కాలానికి కాకుండా ముందుగా నిర్దేశించుకున్న కాలానికి పింఛను అందే విధంగా ఎంచుకోవచ్చు. ఇందులో కాలపరిమితి తర్వాత పాలసీదారుడు జీవించి ఉన్నా పింఛను రాదు. అలాకాకుండా ఎంచుకున్న కాలపరిమితి లోపే పాలసీదారుడు మరణిస్తే కాలపరిమితి ముగిసే వరకూ నామినీకి పింఛను లభిస్తుంది.
జీవిత కాలం పింఛను: పాలసీదారుడు జీవించినంత కాలం పింఛను వస్తుంది. మరణానంతరం ఆగిపోతుంది. తర్వాత నామినీలకు ఎటువంటి ప్రయోజనాలు దక్కవు. అందుకే ఈ ఆప్షన్లో మిగిలిన వాటి కంటే పింఛను ఎక్కువగా అందే అవకాశం ఉంది.
నామినీకి పింఛను: పెట్టుబడి మొత్తం ప్రయోజనాలు పాలసీదారుడితో పాటు నామినీకి సైతం అందేలా ఎంచుకునే వీలుంది. దీన్ని ఎంచుకునే పాలసీదారుడు మరణించే వరకూ పింఛను లభిస్తుంది. పాలసీదారుడు మరణించిన తర్వాత నామినీకి బీమా హామీ మొత్తాన్ని అందజేస్తారు. అయితే జీవిత కాలం పింఛనుతో పోలిస్తే ఇందులో అందే పింఛను మొత్తం తక్కువగా ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80(సీ) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. పాలసీదారులు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు సిద్దం కావాలంటే యాన్యుటీ పాలసీలు ఒక విధంగా ఉపయోగపడతాయి. అయితే వీటిలో అధిక రాబడిని ఆశించలేము. ఇప్పటికే ఎన్‌పీఎస్‌లో లేదా పీపీఎఫ్‌లో పొదుపు చేసే వారికి ఇవి చెప్పుకోదగ్గ విధంగా ప్రయోజనం కలిగించవు. యాన్యుటీ పాలసీల కన్నా ఏదో పింఛను పథకంలో ఉంటూ, బ్యాలెన్స్డ్ డెట్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Comments
0