ఇత‌రుల‌కు ఓటీపీ చెప్తున్నారా?

నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవడం దగ్గర నుంచి మీ బిల్లులను చెల్లించే వరకు ప్రతి దానికి ఓటీపీ లు అవసరం అవుతుంటాయి

ఇత‌రుల‌కు ఓటీపీ చెప్తున్నారా?

ఇటీవల బెంగళూరులో వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఒక మోసగాడు క్రెడిట్ కార్డు వినియోగదారునికి ఫోన్ చేసి తాను బ్యాంక్ ఉద్యోగిని అని చెప్పి, మీ క్రెడిట్ / డెబిట్ కార్డు వివరాలను అప్ డేట్ చేయడానికి మీ మొబైల్ ఫోన్ కి వచ్చిన ఓటిపిని చెప్పాల్సిందిగా అడిగాడు. కార్డు వినియోగదారుడు ఓటిపిని చెప్పిన వెంటనే అతని ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు మాయమైంది. ఇలాంటి ఘటనలు కేవలం బెంగళూరులోనే కాకుండా దేశంలోని ఇతర నగరాలైన ముంబై, జార్ఖండ్, కోజ్హికోడే లలో తరచూ జరుగుతూ ఉన్నాయి. బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించే వినియోగదారులు, మొదటిసారి ఆన్ లైన్ బ్యాంకింగ్ ను వినియోగించేవారు, సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఇలాంటి వాటిలో చిక్కుకుంటారని చాలా మంది భావిస్తుంటారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే సుమారు 10 మంది వినియోగదారులు తమ మొబైల్స్ కు వచ్చిన ఓటీపి లను గుర్తుతెలియని కాలర్స్ తో పంచుకుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును పోగొట్టుకున్నారు. అలాగే ముంబైకి చెందిన ఒక మహిళ గుర్తుతెలియని వ్యక్తులకు 28 సార్లు ఓటీపిని తెలియచేసింది. తద్వారా ఆమె ఖాతాలోని సుమారు రూ. 7 లక్షలు దొంగతనానికి గురయ్యాయి.

దాదాపు అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు భద్రత కల్పించడానికి ఓటీపీ లు సహాయపడుతుంటాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవడం దగ్గర నుంచి మీ బిల్లులను చెల్లించే వరకు ప్రతి దానికి ఓటీపీ లు అవసరం అవుతుంటాయి.

ఓటీపీ దొంగతనం ఎలా జరుగుతుంది?

సాధారణంగా ఓటీపీ దొంగతనాలు రెండు విధాలుగా జరుగుతాయి. ఒకటి, మీ ఫోన్ లోకి మాల్వేర్ ను పంపడం ద్వారా ఓటీపీ కలిగి ఉన్న ఎస్ఎంఎస్ లను ట్యాప్ చేయవచ్చు. రెండు, మీ ఓటీపీని గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్ కాల్ ద్వారా బహిర్గతం చేయడం.

ఆన్ లైన్ మోసగాళ్లు చిత్రమైన నెంబర్ ల నుంచి మీ ఫోన్ కు లింకులను పంపుతారు. అలాంటి లింక్స్ పై క్లిక్ చేయడం వలన మోసగాళ్లకు మీ ఫోన్ పై యాక్సెస్ లభిస్తుంది, అప్పుడు మీ ఓటీపీలను పొందడం వారికి సులభం అవుతుంది. ఒకసారి ఓటీపీ ను సేకరించిన తర్వాత, మోసగాళ్ళు మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును వారి ఖాతాకు బదిలీ చేసుకుంటారు.

మీరు ఏమి చేయాలి?

మీ కార్డు వివరాలను ధ్రువీకరించడం లేదా పునరుద్ధరించడం కోసం ఫోన్ ద్వారా బ్యాంకులు మిమ్మల్ని సంప్రదించవనే విషయాన్ని గుర్తుంచుకోండి. బ్యాంకు నిబంధనల ప్రకారం మీ కార్డ్ నంబర్, సీవీవీ లేదా ఓటీపీని ఎవరితో పంచుకోకూడదు. ఒకవేళ ఎవరితోనైనా మీ కార్డు వివరాలను పంచుకున్నట్లైతే, మీ క్రెడిట్ కార్డులో లేదా పొదుపు ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు ఖాళీ అయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ మీరు మొబైల్ కు విభిన్నంగా ఉన్న వివిధ నంబర్ల నుంచి ఎస్ఎంఎస్ లు వచ్చినట్లైతే, వాటిపై క్లిక్ చేయకుండా ఉండడం మంచిది. లేదంటే మీ ఫోనును హ్యాక్ చేసి దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. తెలియని నెంబర్ల నుంచి వచ్చిన లింక్లపై క్లిక్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఓటీపీ కలిగి ఉన్న సందేశాలను ఫార్వార్డ్ చేయమని మిమల్ని ఎవరైనా అడిగితే, కచ్చితంగా అలా చేయకండి. ఎందుకంటే మీరు చేసే నగదు లావాదేవీలను భద్రపరచడానికి ఓటీపీ సహాయపడుతుంది. వేరొకరికి ఓటీపీని పంపించడం ద్వారా వారికి మీరే సహాయం చేసినట్లు అవుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly