డెబిట్, క్రెడిట్ కార్డుల‌తో చెల్లింపులు ఇక‌ మ‌రింత సుల‌భం

సెప్టెంబ‌ర్ 1 నుంచి ఈ-మాండేట్ స‌దుపాయం అందుబాటులోకి రానుంది. ఇది మర్చంట్లతో పాటు వినియోగదారులకు మేలు చేస్తుంది.

డెబిట్, క్రెడిట్ కార్డుల‌తో చెల్లింపులు ఇక‌ మ‌రింత సుల‌భం

చిన్న లావాదేవీలు చేసేందుకు క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ప్రీపెయిడ్ కార్డులతో సుల‌భంగా చెల్లించే స‌దుపాయాన్ని తీసుకొచ్చింది. డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసేవారికి ఈ-మాండేట్ స‌దుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీంతో వ్యాపారుల‌తో పాటు వినియోగ‌దారుల‌కు ఊర‌ట ల‌భిస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతా నుంచి చెల్లించాల్సిన మొత్తం డెబిట్ అవుతుంది. సెప్టెంబ‌ర్ 1 నుంచి ఈ స‌దుపాయం అందుబాటులోకి రానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల‌తో పాటు పీపీఐ, వాలెట్ చెల్లింపుల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది. . కార్డులపై ఇ-మాండేట్‌ను ఉపయోగించడం కోసం పరిశ్రమ వర్గాల నుంచి విజ్ఞప్తులు అందడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విధానం ప్రకారం కార్డుల ద్వారా చిన్న మొత్తాలు చెల్లించినా కూడా ప్రత్యేకంగా వన్ టైమ్ పాస్ వర్డ్ వంటివి ఉపయోగించవలసి వస్తోంది. దీంతో ట్రాన్సాక్షన్స్‌కు ఎక్కువ సమయం తీసుకుంటోంది. తాజా వెసులుబాటుతో తరుచూ చెల్లించే చిన్నమొత్తాల చెల్లింపు సులభం అవుతుంది. ఈ సదుపాయాన్ని సమీక్షించిన అనంతరం ఇతర డిజిటల్ మోడ్‌లకు కూడా విస్తరింపచేసే ఆలోచన ఉన్నట్లు తెలిపింది.

ఉదాహరణకు ఏదైనా టీవీ బిల్లు బిల్లు, బీమా ప్రీమియం వంటివి కట్టాలనుకుంటే… మొదటి సారి ఆన్‌లైన్‌లో కట్టే సమయంలో ఇ-మాండేట్‌ను ఎంచుకుంటే ప్రతిసారీ బిల్లు ఎపుడు కట్టాలి అన్నది చూసుకోనవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా స‌మ‌యానికి బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అవుతుంది.

ఈ-మాండేట్‌తో డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో వ‌చ్చే మార్పులు

  1. క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా తరచూ చేసే లావాదేవీల (రికరింగ్‌ ట్రాన్సాక్షన్స్‌)పై ఇ-మాండేట్‌ ప్రక్రియకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అనుమతులు ఇచ్చింది. అయితే రూ.2000ను గరిష్ఠ పరిమితిగా నిర్ణయించింది. అదే సమయంలో కార్డుదారు నుంచి ఈ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరాదని కూడా స్పష్టం చేసింది. అన్ని కార్డులు(డెబిట్‌, క్రెడిట్‌), వాలెట్లతో పాటు ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌(పీపీఐలు)లకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
  2. ఈ-మాండేట్ విధానం కేవ‌లం రిక‌రింగ్ లావాదేవీల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఒక్క‌సారి చెల్లించే వాటికి ఉండ‌దు. ఈ-మాండేట్‌ను సెట్‌ చేసుకునేందుకు కార్డు హోల్డర్లు వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా నిర్ణయించే స్థిర విలువకు లేదా మారే విలువకూ ఆటోమెటిక్‌ చెల్లింపు మాండేట్‌ను సెట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.
  3. లావాదేవీ జరినప్పుడల్లా రెండంచెల (కస్టమరు జనరేట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌తోపాటు వన్‌ టైం పాస్‌వర్డ్‌) ధ్రువీకరణ వంటివి లేకుండా చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయవచ్చన్నమాట.
  4. కార్డు హోల్డర్లు ఏ సమయంలోనైనా ఈ-మాండేట్‌ను ఉపసంహరించుకోవచ్చు. దీనికోసం ఆన్‌లైన్ స‌దుపాయాన్ని క‌ల్పించాలని ఆర్‌బీఐ చెప్పింది.
  5. కార్డ్ జారీచేసేవారు “కార్డుదారునికి ఫిర్యాదులను సమర్పించడానికి తగిన పరిష్కార వ్యవస్థను ఉంచాలి. కార్డ్ నెట్‌వర్క్‌లు ఈ వివాదాలను త‌గిన‌ సమయంలో పరిష్కరించడానికి వివాద పరిష్కార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని" ఆర్‌బిఐ తెలిపింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly