క‌డ‌ప‌లో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

క‌డ‌ప‌లో  ఈనాడు సిరి  మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు
  • పెట్టుబ‌డుల్లో వైవిధ్యం ఉండాలి
  • చిన్న మొత్త‌మైనా మ‌దుపు చేయాలి
    -సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు

‘ఈరోజు సంపాదించిన డ‌బ్బును రేప‌టి అవ‌స‌రాల కోసం కొంత దాచుకోవాలి. అప్పుడే భ‌విష్య‌త్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ రావు’ అని ఆర్థిక నిపుణులు సూచించారు. శ‌నివారం క‌డ‌ప‌లో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఆదిత్య బిర్లా స‌న్ లైప్ మ్యూచువ‌ల్ ఫండ్ , జెన్ మ‌నీ’ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది.
KADAPA-POST-2.png
ఈ కార్య‌క్ర‌మంలో జెన్ మ‌నీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వేణుగోపాల్ మాట్లాడుతూ…సంపాద‌న‌లో ముందుగా పోదుపు చేసి, ఆ త‌ర్వాతే ఖ‌ర్చు చేయ‌డం ఒక అల‌వాటుగా మారాల‌ని సూచించారు. ‘ప్ర‌స్తుత మంద‌గ‌మ‌నంలో ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ ముందుకెళ్లాలంటే …ప్ర‌భుత్వ పెట్టుబ‌డుల‌కు తోడు, ప్రైవేటు భాగ‌స్వామ్య‌మూ అవ‌స‌రం. ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధిలో మ‌నమూ పాల్గొనాలి. అందుకు స్టాక్ మార్కెట్‌ను మించిన మార్గం లేదు. ఒక్కో స‌మ‌యంలో ఒక్కో పెట్టుబ‌డి మంచి లాభాల‌ను అందిస్తుంది. వాటిని గుర్తించి, వైవిధ్యంగా మదుపు చేసిన‌ప్పుడే మంచి లాభాలు ఆర్జించ‌గ‌లం. యాజ‌మాన్యం స‌రిగా లేని, అధిక రుణ భారంతో ఉన్న సంస్థ‌ల‌కు దూరంగా ఉండాలి. నిరాశావాదం ఎక్కువగా ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డులు పెట్టాలి. ఆశావాదం అధికంగా ఉన్న సమ‌యంలో లాభాల‌ను స్వీక‌రించాలి. ఒకే సంస్థ‌లో లేదా ఒకే రంగంలో మొత్తం డ‌బ్బును పెట్ట‌కూడ‌దు. వ‌దంతుల‌ను న‌మ్మి,అప్పు చేసి, భావోద్వేగాల‌తో మ‌దుపు చేయ‌కూడ‌దు. మంచి సంస్థ‌ల్లో దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు కొన‌సాగించాలి’ అని సూచించారు.
KADAPA-POST-3.png
ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ రీజ‌న‌ల్ మేనేజ‌ర్ బి.రాజేంద్ర మాట్లాడుతూ…చిన్న మొత్తంతోనే కాల‌గ‌మ‌నంలో పెద్ద నిధిని సృష్టించ‌డం వీల‌వుతుంద‌న్నారు. ‘ఉద్యోగంలో చేరిన‌ప్పుడే ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత అవ‌స‌రాల‌కోసం మ‌దుపు చేయాలి. దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డినిచ్చే ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను వీటికోసం ప‌రిశీలించాలి. న‌ష్ట‌భ‌యం ప్ర‌తిచోటా ఉంటుంది. అధిక న‌ష్ట‌భ‌యం ఉన్న చోటే రాబ‌డీ ఎక్కువ‌గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే భ‌య‌ప‌డ‌కూడ‌దు. అవ‌గాహ‌న పెంచుకుంటూ…అవ‌స‌ర‌మైన‌ప్పుడు నిపుణుల స‌ల‌హా తీసుకుంటూ…మ‌దుపు చేయాలి’ అని తెలిపారు. వీటితోపాటు బీమా, ఆర్థిక ప్ర‌ణాళిక‌ల అవ‌స‌రం లాంటి అంశాల పైనా నిపుణులు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చారు. మదుప‌రుల సందేహాల‌ను నివృత్తి చేశారు. కార్య‌క్ర‌మానికి ‘ఈనాడు’ క‌డ‌ప యూనిట్ ఇన్‌ఛార్జి చంద్ర‌శేఖ‌ర్ హాజ‌ర‌య్యారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly