నిజామాబాద్‌లో జ‌రిగిన మ‌దుపరుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

నిజామాబాద్‌లో జ‌రిగిన మ‌దుపరుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు
  • ఆర్థిక ప్ర‌ణాళిక‌తో బంగారు భ‌విష్య‌త్తు
  • దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌తోనే లాభాలు
  • ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్’ స‌ద‌స్సులో నిపుణులు

NZB-3.png
‘భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం ఇప్ప‌టి నుంచే ప‌క్కా ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళ్లాలి. అవ‌స‌రాల‌ను గుర్తించి, అందుకు అనువైన‌, పొదుపు, మ‌దుపు ప‌థ‌కాల‌ను జాగ్ర‌త్త‌గా ఎంచుకోవాలి’ అని ఆర్థిక నిపుణులు సూచించారు. ఆదివారం నిజామామాద్‌లో ‘ఈనాడు-సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ’ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు చ‌క్క‌టి స్పంద‌న ల‌భించింది.

NZB-4.png

స‌ద‌స్సులో జెన్‌మ‌నీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వేణుగోపాల్ మాట్లాడుతూ … ‘ప్ర‌తి కుటుంబానికి రెండో ఆదాయ మార్గం ఉండాలంటే త‌ప్ప‌నిస‌రిగా పెట్టుబ‌డుల వైపు కొంత మిగులును మ‌ళ్లించాలి. షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్లు, స్థిరాస్తి వంటి వృద్ధి ఆధారిత ప‌థ‌కాల్లో కొంత మొత్తాన్ని పెట్టుబ‌డిగా పెట్టాలి. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా, ప్ర‌త్యేక పింఛ‌ను ప‌థ‌కాల‌ను తీసుకోవ‌డం ద్వారా భ‌విష్య‌త్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. అవ‌గాహ‌న లేకుండా పెట్టుబ‌డులు పెట్టొద్దు. అదిక రుణభారం క‌లిగి, స‌రైన యాజ‌మాన్యం లేని కంపెనీలకు దూరంగా ఉండ‌టం మంచిది. ఓకే రంగంలో మొత్తంగా పెట్టుబ‌డి పెట్ట‌డం, భావోద్వేగాల‌తో తీసుకునే నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌వు. నాలుగైదు రంగాల్లో ప‌ది కంపెనీల‌ను ఎంచుకొని దీర్ఘ‌కాలికంగా మ‌దుపు చేస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంది. న‌ష్టాల భ‌యం లేకుండా కొత్త మ‌దుపరులు ఇండెక్స్, బ్యాలెన్స్ ఈక్విటీ, డైవ‌ర్సిఫైడ్ ఫండ్ల‌లో ద‌శ‌ల వారీగా పెట్టుబ‌డి పెట్టాల‌ని’ సూచించారు.

NZB-2.png

ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ ఛాన‌ల్ మేనేజ‌ర్ జీవీవీ రంగాధ‌ర్ మాట్లాడుతూ… ‘ప్ర‌తి వ్య‌క్తికి ఆర్థిక ల‌క్ష్యాలుంటాయి. వాటిని అంచ‌నా వేసుకొని మ్యూచువ‌ల్ ఫండ్‌ల‌లో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానం సిప్ ద్వారా మ‌దుపు చేసిన‌ప్పుడు మార్కెట్ హెచ్చుత్గుల్లోనూ స‌గ‌టు ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. ఈక్విటీ, డెట్ ప‌థ‌కాలు ఎంచుకోవ‌డం ద్వారా వైవిధ్యంగా మ‌దుపు చేసేందుకు వీలుంటుంది. సంపాదిస్తున్న వ‌య‌సును దృష్టిలో పెట్టుకొని ప‌థ‌కాలు ఎంచుకోవాలి. అది ఎంత త్వ‌ర‌గా ప్రారంభిస్తే…మంచి ఫ‌లితాలు అందుకోవ‌టానికి అవ‌కాశాలు ఉంటాయి’ అని చెప్పారు. స‌ద‌స్సులో 'ఈనాడు 'నిజామాబాద్ యూనిట్ ఇన్‌ఛార్జి ఏఎస్ చ‌క్ర‌వ‌ర్తి పాల్గొన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly