ఈ బీమా రైడర్ల గురించి తప్పక తెలుసుకోండి

తీవ్ర వ్యాధులలో పాలసీలో పేర్కొన్న నిర్ణీత మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తుంది

ఈ బీమా రైడర్ల గురించి తప్పక తెలుసుకోండి

అనుకోని దురదృష్టం వెన్నాడినప్పుడు… ఆధారపడిన కుటుంబానికి అండగా నిలిచేది జీవిత బీమా. పాలసీదారుడు మరణించినప్పుడే… వాటి నుంచి పరిహారం లభిస్తుంది. ప్రమాదం లేదా ఇతర సంఘటనల వల్ల ఒక వ్యక్తి ఆర్జించే శక్తిని కోల్పోయినప్పుడు ఈ పాలసీలు ఎలాంటి పరిహారాన్నీ ఇవ్వవు. ఇలాంటి పరిస్థితుల్లోనూ… ఆర్థికంగా ఆదుకోవాలంటే… కొన్ని అనుబంధ పాలసీలను తీసుకోవాలి.

అర్జున్‌ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని కుడికాలు విరిగిపోయింది. కనీసం మూడు నెలలు ఇంటి నుంచి కదలడానికి లేదు. అతనికి ఆరోగ్య బీమా పాలసీ ఉండటంతో చికిత్స ఖర్చులకు ఇబ్బంది కాలేదు. కానీ… మూడు నెలలపాటు ఉద్యోగానికి వెళ్లకపోవడంతో రావాల్సిన వేతనం ఆగిపోయింది. ఇంటి ఖర్చులకూ ఇబ్బందులు ఎదురయ్యాయి. గృహరుణం వాయిదాలు, ఇతర నిత్యావసర ఖర్చులకు అప్పు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అర్జున్‌ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తీసుకున్నాడనుకుందాం… ఆసుపత్రి ఖర్చులను వైద్య బీమా… ఇంట్లో ఉన్నప్పుడు ఆదాయాన్ని భర్తీ చేసేందుకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉపయోగపడేవి.

కుటుంబంలో ఆర్జించే వ్యక్తి… తనకేమైనా అయితే… ఆ కుటుంబానికి ఏ ఇబ్బందీ లేకుండా చూడాల్సిన బాధ్యతా తీసుకోవాలి. అందుకోసం తన వార్షికాదాయాన్ని బట్టి, జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. తాను లేనప్పుడు ఆ కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చేలా ఆ పాలసీ ఉండాలి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీలను దీనికోసం పరిశీలించవచ్చు. అయితే, ఈ పాలసీలు… పాలసీదారుడు మరణించిన సందర్భంలోనే పరిహారం ఇస్తాయి. మరి, గాయాలపాలై, తాత్కాలికంగా ఆదాయం ఆగిపోయిన సందర్భాలు ఎదురైనప్పుడు… ఏం చేయాలి… అందుకోసమే అనుబంధ పాలసీలను ఎంచుకోవాలి.

ఆర్థిక అవసరాలు వ్యక్తులను బట్టి మారుతుంటాయి. బీమా పాలసీల విషయంలోనూ అంతే… ఒక వ్యక్తి తనకు సరిపోయే మొత్తం ఎంత అనేది నిర్ణయించుకున్నాకే పాలసీ విలువను నిర్ణయించుకోవాలి. దీనికి తోడుగా అనుబంధ పాలసీలను ఎంచుకోవడం వల్ల అదనపు భరోసా లభిస్తుంది. టర్మ్‌ బీమా పాలసీ తీసుకున్నప్పుడు పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యమైన అనుబంధ పాలసీలు (రైడర్లు) ఏమిటో చూద్దాం.

ప్రీమియం రద్దయ్యేలా…

బీమా పాలసీ తీసుకున్నప్పుడు వ్యవధి పూర్తయ్యే వరకూ దానికి ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. కానీ, ఆదాయం ఆగిపోయినప్పుడు ప్రీమియం చెల్లించడం కష్టమవుతుంది. ఇలాంటప్పుడు పాలసీ రద్దు కాకుండా చూసేదే వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం రైడర్‌. ప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల శాశ్వత వైకల్యం సంభవించిన సందర్భంలో… జీవిత బీమా పాలసీకి భవిష్యత్తు ప్రీమియాలను చెల్లించనవసరం లేకుండా ఈ రైడర్‌ తోడ్పడుతుంది. టర్మ్‌ పాలసీకి ఈ రైడర్‌ను జోడించుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ బీమా రక్షణ దూరం కాకుండా చూసుకునే అవకాశం ఉంది.

తీవ్ర వ్యాధులు వచ్చినా…

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుండె జబ్బులు, క్యాన్సర్లు, మూత్ర పిండాల జబ్బులు, పక్షవాతంలాంటి తీవ్ర వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు అధికమవుతోంది. ఈ వ్యాధులు సోకినప్పుడు ఆర్థిక రక్షణ లభించేలా ఉపయోగపడేది క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌. తీవ్ర వ్యాధులు గుర్తించినప్పుడు పాలసీలో పేర్కొన్న నిర్ణీత మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తుంది. ఆ డబ్బుతో ఆ వ్యాధులకు చికిత్స చేయించుకునేందుకు వీలవుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

ప్రమాదాల్లో…

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్యను చూస్తుంటే ఆందోళన కల్గిస్తోంది. ఎప్పుడు ఏ రూపంలో మృత్యువు ముంచుకొస్తుందో తెలియని రోజులివి. నమ్ముకున్న కుటుంబానికి ఆర్థికంగా మరింత భరోసా కల్పించేందుకు ప్రయత్నించాలనుకునే వారు యాక్సిడెంటల్‌ డెత్‌ రైడర్‌ను తీసుకోవాలి. ప్రమాదంలో మరణించిన పాలసీదారుడికి టర్మ్‌ పాలసీకి మించి ఆర్థిక అండ కల్పిస్తుంది ఇది. తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ కల్పించే రైడరిది.

పాక్షిక వైకల్యం ఏర్పడితే…

ప్రమాదాల వల్ల పాక్షికంగా లేదా శాశ్వత వైకల్యం సంభవించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి సందర్భాల్లో కొన్నాళ్లపాటు ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడేది పార్షియల్‌ అండ్‌ పర్మినెంట్‌ డిజేబిలిటీ రైడర్‌. దీనిలో ఎంపిక చేసుకున్న ఐచ్ఛికాలను బట్టి, ప్రమాదం బారిన పడిన 5-10 ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఆదాయం అందేలా చూస్తుంటాయి. దీనివల్ల ఆదాయంలో క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోవచ్చు. పూర్తి వైకల్యం ఏర్పడినప్పుడు పాలసీ మొత్తాన్ని పరిహారంగా ఇస్తుంది. పాక్షిక వైకల్యం ఏర్పడినప్పుడు నిబంధనల మేరకు పాక్షిక పరిహారాన్ని అందిస్తుంది. అనుకోని సంఘటనల వల్ల ఆదాయం ఆగిపోకుండా ఈ రైడర్‌ తోడ్పడుతుంది.

క్రమం తప్పని ఆదాయం…

పాలసీదారుడు మరణించిన సందర్భంలో అతని కుటుంబానికి అతని తరఫున ఆదాయాన్ని అందించేందుకు తోడ్పడే రైడర్‌ ఇది. దీని ద్వారా పాలసీ మొత్తంలో నిర్ణీత శాతం చొప్పున నెలనెలా అతని నామినీలకు అందుతుంది. పాలసీదారుడు ఈ ఇన్‌కం బెనిఫిట్‌ రైడర్‌ను ఎంచుకున్నప్పుడు… అతనికి ఏదైనా జరిగిన సందర్భంలో ప్రాథమిక జీవిత బీమా పాలసీ మొత్తం అందుతుంది. ఆ తర్వాత ఈ రైడర్‌ ద్వారా 5-10 ఏళ్లపాటు క్రమం తప్పని ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు ఈ రైడర్‌ మొత్తంలో ఏడాదికి 10శాతం అందే విధంగా ఎంచుకున్నారనుకోండి. ఇలా 10 ఏళ్లపాటు ఆ పరిహారం అందుతుందన్నమాట.

టర్మ్‌ పాలసీలను ఎంచుకునేప్పుడు… దానికి అనుబంధంగా ఈ ప్రధాన రైడర్లను జోడించుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా… ఆర్థిక కష్టాలు రాకుండా చూసుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly