బ్యాంకు పొదుపు ఖాతాలో ఎంత డ‌బ్బు ఉంచ‌వ‌చ్చు?

సిప్ లేదా రిక‌రింగ్ డిపాజిట్ ప్రారంభిస్తే మీకు తెలియ‌కుండానే సంప‌ద పెరుగుతుంది.

బ్యాంకు పొదుపు ఖాతాలో ఎంత డ‌బ్బు ఉంచ‌వ‌చ్చు?

పొదుపు ఖాతాలో ఎక్కువ డ‌బ్బు ఉంటే అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఏటీఎంకి వెళ్లి డ‌బ్బు విత్‌డ్రా చేసుకుంటాం. ఆ క్ష‌ణంలో డ‌బ్బు చేతిలోకి రాగానే సంతోషంగా ఉంటుంది. అయితే పొదుపు ఖాతాలో అవ‌స‌రానికి మించి దీంతో కొన్ని ప్ర‌తికూల అంశాలు కూడా ఉన్నాయి. పొదుపు ఖాతాలో ఎక్కువ డ‌బ్బు ఉంటే సమ‌స్య ఏంటి అని అనుకుంటున్నారా అయితే అవి ఏంటో తెలుసుకోండి.

రాబ‌డి త‌క్కువ:

పొదుపు ఖాతాలో ఎక్కువ డ‌బ్బు ఉంటే వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా అంటే ఏడాదికి దాదాపుగా 3.5 శాతం వ‌ర‌కే ఉంటుంది. ద్ర‌వ్యోల్బ‌ణం చూస్తే స‌గ‌టుగా 7.8 శాతంగా ఉంటుంది. అంటే ఖాతాలో డ‌బ్బు ఉండ‌టంతో లాభం లేక‌పోగా న‌ష్ట‌మే అని చెప్పుకోవ‌చ్చు.

నిజ‌మైన రాబ‌డి = రాబ‌డి-ప‌న్నులు- ద్ర‌వ్యోల్బ‌ణం:

దీంతో భ‌విష్య‌త్తులో కొనుగోలు చేసే సామ‌ర్థ్యం త‌గ్గుతుంది. ఖాతాలో అత్య‌వ‌స‌ర నిధి వ‌ర‌కు ఉంచుకోవ‌చ్చు కానీ, అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటేనే స‌మ‌స్య‌.

కొంత‌మంది చాలా ఎక్కువ మొత్తాన్ని పొదుపు ఖాతాలో ఎక్కువ కాలం ఉంచుతారు ఉదాహ‌ర‌ణ‌కు అజ‌య్ అనే వ్య‌క్తి రూ.90 ల‌క్ష‌లు బ్యాంకు పొదుపు ఖాతాలో గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ఉంచాడు. పాత ఇంటిని అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుతో కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆ డ‌బ్బును ఖాతాలో వేశాడు. అయితే కొత్త ఇంటిపై నిర్ణ‌యం తీసుకోలేదు, దాంతో పాటు ఆ డ‌బ్బును ఎందులోనూ పెట్టుబ‌డులు పెట్ట‌లేదు. నాలుగు సంవ‌త్స‌రాలు రూ.90 ల‌క్ష‌ల మీద కేవ‌లం సంవ‌త్స‌రానికి 3.5 శాతం చొప్పిన వ‌డ్డీని పొందాడు. ప‌న్నుతో క‌లిపి ఇది రూ.13.2 ల‌క్ష‌లు. అదే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోని లిక్విడ్ ఫండ్ల‌లో ఈ డ‌బ్బును పెట్టుబ‌డిగా లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే రూ.26.2 ల‌క్ష‌ల వ‌డ్డీ వ‌చ్చేది. కేవ‌లం పొదుపు ఖాతాలో డ‌బ్బును ఉంచి నిర్ల‌క్ష్యం చేయ‌డం కార‌ణంగా రూ.13 ల‌క్ష‌ల‌ను కోల్పోయాడు.

మ‌రీ అంత ఎక్కువ‌గా పొదుపు ఖాతాల్లో బ్బును డిపాజిట్ చేయ‌క‌పోయినా సాధార‌ణంగా రూ.3 ల‌క్ష‌ల నుంచి 8 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖాతాలో ఉంచ‌డం చూస్తుంటాం. ఖాతాలో డ‌బ్బు ఉండ‌టం గొప్ప అనుకుంటారు కానీ వారు ఏం కోల్పోతున్నారో అర్థం చేసుకోరు.

మ‌రి ఈ స‌మ‌స్య రాకూడ‌దంటే …

దీనికి సుల‌భ‌మైన ప‌రిష్కారం 4 నుంచి 6 నెల‌ల‌కు స‌రిపడా డ‌బ్బును అత్య‌వ‌స‌ర నిధిగా మీ పొదుపు ఖాతాలో ఉంచి మిగ‌తాది క‌నీసం స్వ‌ల్ప‌కాలిక డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెడితే సంవ‌త్స‌రానికి 8 శాతం వ‌ర‌కు రాబ‌డి పొంద‌వ‌చ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఇందులో ప‌న్నులు త‌క్కువ‌గా ఉంటాయి. మ‌రింత డ‌బ్బును మీ ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఇత‌ర పెట్టుబ‌డి సాధ‌నాల‌ను ఎంచుకోవాలి.

6 నెల‌ల‌కు స‌రిప‌డా అత్య‌వ‌స‌ర నిధిని 2 భాగాలుగా విభ‌జించి కొంత పొదుపు ఖాతాలో మ‌రింత లిక్విడ్ ఫండ్ల‌లో పెడితే 6.5-7 శాతం రాబ‌డితో పాటు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వెంట‌నే తీసుకోవ‌చ్చు. మొత్తం డ‌బ్బు పొదుపు ఖాతాలో ఉంచ‌డం కంటే ఇది మంచి ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు.

డ‌బ్బు ఎక్కువ‌గా క‌నిపిస్తే ఖ‌ర్చు ఎక్కువ అవుతుంది?

డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డానికి ఒక విధానం ఉంటుంది. ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఖ‌ర్చు చేస్తేనే ఆర్థిక ప‌రిస్థితి బాగుంటుంది. డ‌బ్బు నీరు వంటివి. దానికి ఒక‌రూపం ఇవ్వ‌క‌పోతే ఇష్ట‌మొచ్చిన రీతిలో ఖ‌ర్చు అవుతుంది.

డ‌బ్బు మ‌న‌కు ఎక్కువ క‌నిపిస్తే ఆలోచ‌న‌లు ఎక్కువ‌గా మెదులుతాయి. స‌ర‌ఫ‌రాకు త‌గిన‌ట్లుగా డిమాండ్ ఉండాల‌నేది ఆర్థిక పాఠాల‌లో ముఖ్య‌మైన‌ది. ఇది డ‌బ్బు విష‌యంలో కూడా వ‌ర్తిస్తుంది. పొదుపు ఖాతాలో ఎక్కువ‌గా డ‌బ్బు ఉంటే ఖ‌ర్చు చేసేందుకు చాలా ఆలోచ‌న‌లు వస్తాయి.

మీ పొదుపు ఖాతాలో ఎక్కువ డ‌బ్బు ఉంటే జ‌రిగే అన‌ర్థాలు:

 • మీ ఇంట్లో టీవీ పాత‌దైపోయిందా కొత్త టీవిని తెచ్చుకుందాం అనిపిస్తుంది.
 • ఆన్‌లైన్‌లో అత్య‌వ‌స‌రం లేని వ‌స్తువులు కూడా కొనాల‌నిపిస్తుంది.
 • ఏదైనా పెళ్లిళ్లు, ఇత‌రర శుభ‌కార్యాలకు వెళ్లేట‌ప్పుడు ఎక్కువ ఖ‌ర్చు పెట్టి బ‌హుమ‌తి ఇవ్వాల‌నిపిస్తుంది.
 • ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డ్ చేసుకోవాల‌నిపిస్తుంది
 • విహార‌యాత్ర‌ల‌కు వెళ్లాల‌నిపిస్తుంది
 • బ‌య‌ట రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌లో భోజ‌నం చేయాల‌నిపిస్తుంది.

సుల‌భంగా చెప్పాలంటే అనుకోకుండానే ఖ‌ర్చులు పెరిగిపోతాయి. మాన‌వ మెద‌డు చాలా ఆస‌క్తిక‌ర‌మైన‌ది. ఖ‌ర్చులు మీ చేతిలోనే ఉన్నాయ‌ని అనుకుంటారు కాని అవి నియంత్ర‌ణ దాటి పోయేంత‌వ‌ర‌కు తెలీదు. అవ‌స‌రానికి మించి డ‌బ్బు ఉన్న‌ప్పుడు ఖ‌ర్చుల విష‌యంలో హేతుబ‌ద్ద‌త వ‌హించ‌డం అనేది చాలా క‌ష్టం. మీరు ఉన్న ప‌రిస్థితులు, చుట్టూ ఉన్న‌వారు కూడా ఖ‌ర్చుల‌కు కార‌ణ‌మ‌వుతారు.

అందుకే వీలైనంత‌గా పొదుపు ఖాతా నుంచి డ‌బ్బును త‌గ్గించాల్సిందిగా ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తారు. సిప్ లేదా రిక‌రింగ్ డిపాజిట్ ప్ర‌తి నెల మీ ఖాతా నుంచి కొంత డ‌బ్బును డెబిట్ చేసి మీ ఖాతాలో డ‌బ్బు త‌క్కువగా ఉండేలా చేస్తుంది. ఆటోమేటిక్‌గా ప్ర పొదుపు ఖాతా నుంచి డ‌బ్బు డెబిట్ అవుతుంది అందులో మీరు చేయ‌వ‌ల్సింది ఏమి ఉండ‌దు. ప్ర‌తి నెల దీని గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అప్పుడు పొదుపు ఖాతాలో డ‌బ్బు త‌గ్గి ఇత‌ర సాధ‌నాల‌లో పెరుగుతుంది.
అంద‌రికీ ప్ర‌తి నెల పొదుపు చేసేందుకు క‌ష్టంగా అనిపిస్తుంది. ఈ నెల నుంచి త‌ప్ప‌కుండా పొదుపు ప్రారంభిస్తాను అని ప్ర‌తి నెల అనుకుంటారు కాని అది సాధ్యం కాదు. కానీ, సిప్ ప్రారంభించిన‌వారు 2-3 సంవ‌త్స‌రాల‌లోపే వారికి వ‌చ్చిన లాభాల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతుంటారు. త‌మ ప్ర‌మేయం లేకుండానే అంత డ‌బ్బు పొదుపు కావ‌డం సంతోషించాల్సిన విష‌యంగా భావిస్తుంటారు. దీంతో ఆటోమేటిక్‌గా సంప‌ద పెరుగుతుంది. ఆర్థిక లక్ష్యాల‌ను సాధించేందుకు తోడ్ప‌డుతుంది.

ఖ‌ర్చుల‌ను నియంత్రించేందుకు…

 1. ప్ర‌తి నెల వేత‌నం వ‌చ్చిన త‌ర్వాత ఖాతాలో నుంచి డెబిట్ అయ్యే విధంగా సిప్ లేదా రిక‌రింగ్ డిపాజిట్ ప్రారంభించాలి.
 2. మ‌రికొన్ని రోజుల్లో అవ‌స‌రం అనుకుంటే త‌ప్ప పొదుపు ఖాతాలో ఎక్కువ డ‌బ్బును ఉంచ‌కూడ‌దు.
 3. లిక్విడ్ మ్యూచువ‌ల్ ఫండ్ ఫోలియోను ప్రారంభించాలి. డ‌బ్బు ఎక్కువ ఉన్న‌ప్పుడు ఇందులోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌చ్చు. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు 24 గంట‌ల్లోపు తీసుకోవ‌చ్చు.
 4. లిక్విడ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో కూడా మీ ఆరు నెల‌ల‌కు స‌రిప‌డా ఖ‌ర్చుల కంటే ఎక్కువ డ‌బ్బును ఉంచ‌కూడ‌దు.
 5. న‌గ‌దు రూపంలో ఖ‌ర్చు చేసేందుకు ప్ర‌య‌త్నించండి. ఆన్‌లైన్ వాలెట్ల‌లో త‌క్కువ డ‌బ్బును యాడ్ చేసుకోండి
 6. ఆర్థిక ల‌క్ష్యాల జాబితాను త‌యారు చేసుకొని వాటికి అనుగుణంగా కృషి చేయండి.
 7. స్వీయ నియంత్ర‌ణ లేక‌పోతే బ‌లవంతంగానైనా ఆర్థిక సాద‌నాల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly