ఆర్థిక భ‌ద్ర‌త‌కు పాటించాల్సిన విష‌యాలు

ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగంగా మ‌దుప‌ర్లు బీమా, పొదుపు వంటి విష‌యాలకు ప్రాముఖ్య‌త ఇవ్వాలి

ఆర్థిక భ‌ద్ర‌త‌కు పాటించాల్సిన విష‌యాలు

ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగంగా మ‌దుప‌ర్లు ఎక్కువ‌గా ప్రాముఖ్య‌త ఇవ్వాల్సిన వాటిలో బీమా ఒక‌టి. వ్య‌క్తులు త‌మ కుటుంబ‌ భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలి. దీని కోసం మీరు టర్మ్ బీమా పథకాన్ని కొనుగోలు చేయచ్చు. ఒకవేళ మీకు జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు మీ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోడానికి టర్మ్ బీమా సహాయపడుతుంది. టర్మ్ బీమా మొత్తం అనేది మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 15 రెట్లుగా ఉంటే మంచిది. నిత్యం పెరుగుతున్న వైద్య ఖర్చులు మీకు, మీ కుటుంబం స‌భ్యుల కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాల్సిన‌ అవసరం ఉంది. ఒకవేళ మీకు ఆరోగ్య బీమా లేనట్లయితే ఒక్క సంఘటన మీ ఆర్ధిక ప‌రిస్థితిని ప్ర‌భావితం చేయగలదు.కుటుంబం అంత‌టికీ వ‌ర్తించే విధంగా ఆరోగ్య బీమాలో ఫ్యామిలీఫ్లోట‌ర్ కవర్ ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. అదేవిధంగా వైకల్యం సంభవించినప్పుడు లేదా ఏదైనా ప్రమాదం సంబంధించినప్పుడు వైద్య ఖర్చులు కవర్ అవడానికి అదనంగా ఒక టాప్ అప్ ను కొనుగోలు చేయడం మంచిది. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుని దానిని పొదుపు ఖాతాలో ఉంచుకోవాలి. చాలా బ్యాంకులు తమ పొదుపు ఖాతాదారులకు 7 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి, మీ నెలవారీ వ్యయాలను కనీసం 4 నుంచి 6 రెట్లు కేటాయించి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిని ఉపయోగించుకోవాలి. పొదుపు ఖాతాలు రాబడితో పాటు నగదు లభ్యతను అందిస్తాయి. అందువల్ల అవ‌స‌రాల‌ కోసం కొంత మొత్తాన్ని పొదుపు ఖాతాలో ఉంచుకోవ‌డం మంచిది. అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం వలన అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.

మూలధన నిధిని సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత విద్య, వివాహం, పదవీ విరమణ మొదలైన దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి తగిన సమయంలో చెప్పుకోదగ్గ మొత్తం అవసరమవుతుంది. ఇలాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్లు, ఈక్విటీలు మొద‌లైన వాటిని ఎంపిక చేసుకోవ‌చ్చు.

ఈక్విటీలు దీర్ఘ కాలంలో నిలకడగా ద్రవ్యోల్బణ రేట్లను మించి రాబడులను అందిస్తాయి. మ‌దుప‌ర్లు త‌మ పొదుపులో కొంత భాగం ఈక్విటీల్లో మ‌దుపు చేయ‌డం మంచిది. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టడం సులభంగా ఉంటుంది. ఎప్పుడైనా మిగులు ఆదాయం సమకూరినప్పుడు, లిక్విడ్ ఫండ్ల‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. అనంతరం సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా స్థిరమైన మొత్తాన్ని కావలసిన ఈక్విటీ ఫండ్ కు బదిలీ చేసుకోవచ్చు. అలాగే లిక్విడ్ ఫండ్ల‌లో మిగిలి ఉన్నపెట్టుబ‌డి పై కూడా రాబ‌డి అందుతుంది.

మ‌దుప‌ర్లు క్రెడిట్ స్కోరును మెరుగ్గా ఉంచుకోవాలి. క్రెడిట్ స్కోరు అనేది మీరు గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల వంటి సమాచారాన్ని తెలుపుతుంది. అదే విధంగా వాటి చెల్లింపులను ఎలా నిర్వహించారో అనే విషయం క్రెడిట్ చరిత్ర ఆధారంగా తెలుసుకునే వీలుంది. రుణ సంస్థలు మీరు రుణాన్ని మంజూరు చేసే ముందు మీ క్రెడిట్ చరిత్రను తనిఖీ చేస్తారు. మంచి క్రెడిట్ చరిత్ర అనుకూలంగా ఉంటే రుణం మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్ చరిత్రను మెరుగుపరుచుకోడానికి ఉన్న ముఖ్యమైన సాధనాల్లో క్రెడిట్ కార్డు వినియోగం ఒకటి. క్రెడిట్ కార్డు చెల్లింపులను సరిగ్గా నిర్వహించినట్లైతే మీ క్రెడిట్ చరిత్ర్ర మెరుగుపడుతుంది. మీకున్న బకాయిలన స‌మ‌యానికి చెల్లించినట్లైతే క్రమంగా మీ క్రెడిట్ స్కోరు వృద్ధి చెందుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly