జీఎస్‌టీ పరిధిలోకి రాని నిత్యావసర వస్తువులు...

ఒక వినియోగదారుడిగా ఏ వస్తువులను జీఎస్‌టీ నుంచి పూర్తిగా మినహాయించారనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం

జీఎస్‌టీ పరిధిలోకి రాని నిత్యావసర వస్తువులు...

గత నెలలో బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ చండీఘర్ కు చెందిన ఫైవ్ స్టార్ హోటల్ లో కేవలం రెండు అరటి పండ్లకు జీఎస్‌టీతో కలిపి రూ. 442 వసూలు చేసినట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. హోటల్ బిల్లులో ఉన్న జీఎస్‌టీ మొత్తం రూ. 67.50 కాగా, అందులో 9 శాతం అనగా రూ. 33.75 సెంట్రల్ జీఎస్‌టీ, అలాగే మరో 9 శాతం అనగా రూ. 33.75 కేంద్ర పాలిత ప్రాంతం జీఎస్‌టీ. ఈ వార్త దేశం మొత్తం వైరల్ అయ్యింది. అయితే ఒక వినియోగదారుడిగా మీరు చెల్లించాల్సిన సరైన జీఎస్‌టీ మొత్తం ఎంత? అలాగే ఏ వస్తువులను జీఎస్‌టీ నుంచి పూర్తిగా మినహాయించారనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేని కొన్ని రకాల నిత్యావసర వస్తువుల వివరాలను కింద తెలియచేస్తున్నాము.

ఆహార పదార్థాలు :

తాజా లేదా పాశ్చరైజ్డ్ పాలు, వెన్న పాలు, పెరుగు, చెనా లేదా పన్నీర్, గుడ్లు, చికెన్, తాజా మాంసం, తాజా లేదా చిల్డ్ చేపలపై జీఎస్‌టీ ఉండదు. పండ్లు, కూరగాయలు, యూనిట్ కంటైనర్-ప్యాక్ చేసిన ఫ్రోజెన్ బ్రాండెడ్ కూరగాయలకు (వండని లేదా ఆవిరి) కూడా జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంటుంది.

ఈ జాబితాలోని ఇతర వస్తువుల విషయానికి వస్తే…సహజమైన తేనె, బార్లీ, గోధుమ, వోట్స్ వంటి తృణధాన్యాలు ఉన్నాయి. పల్మిరా బెల్లం, అన్ని రకాల ఉప్పులు, గ్రామ్ లేదా బఠానీ పిండి, తాజాగా లేదా ఎండిన కొబ్బరి, సోంపు, కొత్తిమీర, జీలకర్ర వంటి అన్ని రకాల సుగంధ ద్రవ్యాలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే అప్పడాలు, బ్రెడ్ (బ్రాండెడ్ లేదా ఇతరత్రా), పిజ్జా బ్రెడ్ లకు కూడా జీఎస్‌టీ ఉండదు. నీరు (మినరల్, ప్యూరిఫైడ్, డిస్టిల్డ్, మెడిసినల్, అయానిక్, బ్యాటరీ, డీ-మినరలైజ్డ్, సీల్డ్ కంటైనర్లలో విక్రయించే నీరు) లకు జీఎస్‌టీ లేదు.

వ్యక్తిగత వస్తువులు :

జీఎస్‌టీ వర్తించని జాబితాలో అనేక వ్యక్తిగత వస్తువులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు శానిటరీ ప్యాడ్లు, కాజల్ (కాజల్ పెన్సిల్ స్టిక్స్ కాకుండా), గాజు, ప్లాస్టిక్ గాజులు, వినికిడి పరికరాలు, స్లేట్లు, పెన్సిల్స్, చాక్ స్టిక్స్, ప్రయాణీకుల బ్యాగ్స్, బిండి, కండోమ్‌లతో సహా అన్ని రకాల గర్భనిరోధకాలపై జీఎస్‌టీ ఉండదు.

ఇతర వస్తువులు :

వీటిలో ఎక్కువగా స్టేషనరీ వస్తువులు, ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన వస్తువులు ఉన్నాయి. ఉదాహరణకు పిల్లల కోసం పిక్చర్, కలరింగ్, డ్రాయింగ్ పుస్తకాలు, మ్యూజిక్ పుస్తకాలు, మనూ స్క్రిప్ట్స్, ప్రభుత్వం విక్రయించే ఎన్వలప్, పోస్ట్ కార్డులు వంటి తపాలా వస్తువులు, వార్తాపత్రికలు, పత్రికలు, ప్రకటనల సామగ్రి, మ్యాప్‌లు, హైడ్రో గ్రాఫిక్ లేదా అట్లాసెస్, వాల్ మ్యాప్స్, టోపోగ్రాఫికల్ ప్లాన్స్, గ్లోబ్స్‌తో సహా అన్ని రకాల చార్టులపై కూడా జీఎస్‌టీ వర్తించదు. అలాగే చెక్కులు, బ్రెయిలీ పుస్తకాలు, జ్యుడిషియల్, నాన్-జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, ప్రభుత్వ ఖజానా లేదా ప్రభుత్వ అధికారం పొందిన విక్రేతలు విక్రయించే కోర్టు ఫీజు స్టాంపులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అమ్మిన రూపాయి నోట్లకు కూడా జీఎస్‌టీ వర్తించదు.

అదేవిధంగా రుద్రాక్ష వంటి మతపరమైన వస్తువులకు జీఎస్‌టీ వర్తించదు. మట్టి కుండలు, మట్టి దీపాలు వంటి వస్తువులు కూడా జీఎస్‌టీ జాబితాలో లేవు. బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం వంటి వైద్య వస్తువులు కూడా జీఎస్‌టీ పరిధిలో లేవు. ప్యాకేజ్ చేయని కొన్ని రకాల వస్తువులకు కూడా జీఎస్‌టీ ఉండదని గుర్తుంచుకోండి.

(source - livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly