సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అనుకూల‌మైన‌ ప‌థ‌కాలు

ప‌ద‌వీవిర‌మ‌ణ త‌రువాత పెట్టుబ‌డి చేసేందుకు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అనుకూలంగా కొన్ని పెట్టుబ‌డి ప‌థ‌కాలు

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అనుకూల‌మైన‌ ప‌థ‌కాలు

పదవీ విరమణ త‌రువాత పెట్టుబ‌డి చేసేంద‌కు వివిధ పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. పెట్టుబ‌డి భ‌ద్ర‌త‌తో పాటు మంచి రాబ‌డిని అందించే ప‌థ‌కాలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, బ్యాంకు ఎఫ్డీలు, ఆర్డీలు, పోస్టాఫీస్ ఎఫ్డిలు, ఆర్డీలు, నేషనల్ పెన్షన్ సిస్టం, ప్రధాన్ మంత్రి వయ వందన యోజన, మ్యూచ్యువల్ ఫండ్లు వంటి పెట్టుబడి ప‌ధ‌కాలు అందుబాటులో ఉన్నాయి.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్):
ఈ ప‌థ‌కం పోస్టాఫీసుల ద్వారా అందుబాటులో ఉంటుంది, సీనియర్ సిటిజెన్ల కోసం ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఎంపికలలో ఎస్సీఎస్ఎస్ ఒకటి. పెట్టుబడి కాలపరిమితి ఐదు ​​సంవత్సరాలు. వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన జమ చేస్తారు. అలాగే మొత్తం పెట్టుబడులపై పరిమితి రూ. 15 లక్షలు. రాబ‌డి రేటును త్రైమాసిక ప్రాతిపదికన ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత రాబడి రేటు 8.7 శాతంగా ఉంది. ఈ ప‌థ‌కం కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు. కావాల‌నుకుంటే మ‌దుప‌ర్లు అద‌నంగా మ‌రో 3సంవ‌త్స‌రాలు పొడిగించుకోవ‌చ్చు. ఎస్సీఎస్ఎస్ ద్వారా పొందే వడ్డీకి పన్ను వర్తిస్తుంది.

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన:
ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) పథకానికి ఎల్ఐసీ పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. ఇది కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం. ఈ పథకం ద్వారా పెన్షన్ ను నెలవారీ, త్రైమాసికం, అర్ధ వార్షిక, వార్షికం ప్రాతిపదికన తీసుకోవచ్చు. వృద్ధ దంపతులు ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టవచ్చు. దీని కాల వ్యవధి 10 సంవత్సరాలు, అలాగే రాబడుల రేటు సంవత్సరానికి 8.3 శాతంగా ఉంటుంది. భారత ప్రభుత్వం 8.3 శాతం వడ్డీని 10 సంవత్సరాల హామీతో అందిస్తుంది. పీఎంవీవీవై ద్వారా పొందే వడ్డీకి పన్ను వర్తిస్తుంది.

పోస్టాఫీసు రిక‌రింగ్, ఫిక్సిడ్ డిపాజిట్లు :
పోస్టాఫీసు ఫిక్డిడ్ ,రిక‌రింగ్ డిపాజిట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉంటాయి. బ్యాంకులో ఉంచే డిపాజిట్లు కంటే భ‌ద్ర‌త అధికంగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. సీనియర్ సిటిజన్లకు ఫిక్సిడ్ డిపాజిట్లపై బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు, బ్యాంకింగేత‌ర ఆర్థికేతర సంస్థలు కొంత అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన జమ చేస్తారు. ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు కాలవ్యవధి, బ్యాంకు ఆధారంగా మారుతూ ఉంటాయి.పోస్టాఫీసు ఫిక్సిడ్, రిక‌రింగ్ డిపాజిట్లలోని పెట్టుబడులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నియంత్రిస్తుంది. కానీ రూ. లక్ష వరకు పెట్టుబడుల మొత్తానికి మాత్రమే హామీగా ఉంటుంది. పోస్టాఫీసు ఆర్‌డీల‌పై టీడీఎస్ వ‌ర్తించ‌దు. పోస్ట్ ఆఫీస్ అందించే ఐదేళ్ల కాల‌వ్య‌వ‌ధి ఉండే డిపాజిట్ల‌లో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతుంది, అయితే వడ్డీ పన్నుఉంటుంది. నెలవారీ ఆదాయం పొందడానికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కం స్కీమ్ ను పెట్టుబడిదారులు ఎంపిక చేసుకోవచ్చు,

నేషనల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్) :
18 నుంచి 65 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సు ఉన్నవారు ఎన్‌పీఎస్ లో పెట్టుబడి పెట్టవచ్చు. మ‌దుప‌ర్లు కావాల‌నుకుంటే ఈ ఖాతాను 70 సంవత్సరాల వరకు పెంచుకోవ‌చ్చు. మదుప‌రి ఎంపిక ఆధారంగా, ఈక్విటీ, డెట్ ఫండ్లలో పెట్టుబడి పెడ‌తారు. మెచ్యూరిటీ తర్వాత 60 శాతం నిధిపై పన్ను మిన‌హాయింపు ఉంటుంది మిగిలిన మొత్తం (40 శాతం) నెలవారీ పెన్షన్ యాన్యుటీ స్కీమ్ కొనుగోలు చేసేందుకు ఉప‌యోగించాలి. దీని ద్వారా మ‌దుప‌ర్లు నెల‌వారీ ఆదాయం పొంద‌వ‌చ్చు. విభాగం 80 సి కింద, ఇది పన్ను మినహాయింపును రూ .1.5 ల‌క్ష‌లు, 80సీసీడీ(1బీ) కింద‌ అదనంగా రూ .50,000 లను అందిస్తుంది.

మ్యూచువల్ ఫండ్లు:
దీర్ఘకాలంలో ఇతర పెట్టుబడులు కంటే మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడులను అందిస్తాయి. అందువలన కొంత మూలధనాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిగా పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. కాబ‌ట్టి, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు సీనియర్ సిటిజన్లు జాగ్రత్త వహించడం మంచిది. దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్లు మంచి లాభాలను అందిస్తాయి. మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యం ఆధారంగా ఫండ్ల‌ను ఎంచుకోవాలి. ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కంలో పెట్టుబ‌డి చేస్తే సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.ఈక్విటీ ఫండ్ల ద్వారా దీర్ఘకాల మూలధన లాభాలు (ఎల్టీసీజీ) ఆర్థిక సంవత్సరానికి రూ .1 లక్ష వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తం ఉన్నట్లయితే, 10 శాతం పన్ను రేటు వర్తిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly