బీమా పాల‌సీ క్లెయిం తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యేందుకు కార‌ణాలు

ఇన్సురెన్స్ పాల‌సీ కొనుగోలు చేసేందుకు ప్ర‌ణాళిక సిద్దంచేస్తున్నారా? అయితే క్లెయిం తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యే కార‌ణాల‌ను తెలుసుకుని త‌గిన‌ జాగ్ర‌త్తలు తీసుకోవాలి.

బీమా పాల‌సీ క్లెయిం  తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యేందుకు కార‌ణాలు

మ‌నం తీసుకునే ఇన్సురెన్స్, మ‌న‌కు ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఆర్థికంగా స‌హాయ‌ప‌డుతుంది. ట‌ర్మ్ ఇన్సురెన్స్‌, పాల‌సీదారుడి త‌ద‌నంత‌రం కుటుంబానికి ఆర్థిక భ‌రోసాని అందిస్తే, ఆరోగ్య బీమా పాల‌సీ ఆసుప‌త్రి ఖ‌ర్చులతో స‌హా పాల‌సీదారునికి ఆర్థిక‌ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. మ‌నం తీసుకున్న పాల‌సీ ఏదైనా హామీ మొత్తం స‌మ‌యానికి అందితేనే ప్ర‌యోజ‌నం ఉంటుంది. పాల‌సీ క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ‌కు గురైతే, పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి, అత‌నిపై ఆధార‌ప‌డిన కుటుంబ స‌భ్యులు ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. అందువ‌ల్ల పాల‌సీ కొనుగోలు చేసే ముందు తిర‌స్క‌ర‌ణ‌కు కార‌ణాలు తెలుసుకుని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది.

త‌ప్పు స‌మాచారం ఇవ్వ‌డం లేదా నిజాల‌ను వెల్లడించ‌క‌పోవ‌డం:

జీవ‌త బీమా లేదా ఆరోగ్య బీమాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు మీరు తెలిపే వివ‌రాల ఆధారంగా, చెల్లించ‌వ‌ల‌సిన ప్రీమియంను బీమా సంస్థ నిర్ణ‌యిస్తుంది. కొంత మంది త‌క్కువ ప్రీమియంతో కూడిన పాల‌సీని తీసుకునేందుకు త‌ప్పు స‌మాచారాన్ని ఇస్తుంటారు. అయితే పాల‌సీ క్లెయిమ్ చేసిన‌ప్పుడు బీమా సంస్థ‌లు నిజ‌మైన వివ‌రాల‌ను తెలుసుకుంటే పాల‌సీ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంది. పాల‌సీ పత్రంలో వాస్త‌వ వివ‌రాల‌నే వెల్ల‌డించాలి. కొన్ని వివ‌రాల‌కు సంబంధించి నిజాల‌ను దాచినా, త‌ప్పులు రాసినా క్లెయిం చేసేట‌ప్పుడు ఆ ప్ర‌భావం క‌నిపిస్తుంది. ద‌ర‌ఖాస్తులోని అన్ని వివ‌రాల‌ను పూర్తిచేయాలి. ఏ పాయింట్‌ను ఖాళీగా వ‌దిలేయ‌కూడ‌దు. ఒక‌వేళ వారు అడిగిన స‌మాచారం మీకు సంబంధించిన‌ది కాక‌పోతే ‘ఎన్ఏ’ అని వ్రాయాలి. లేదా ఆ పాయింట్ ద‌గ్గ‌ర ‘క్రాస్’ చేయాలి. ద‌ర‌ఖాస్తు పూర్తి చేసి, దాని ఫోటో కాఫీని ప్రూవ్ కోసం మీ వ‌ద్ద ఉంచుకోవాలి.

పాల‌సీ ల్యాప్స్ అవ‌డం:

పాల‌సీ ప్రీమియం చెల్లించేందుకు కొద్ది రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ‌డువు లోపు స‌క్ర‌మంగా ప్రీమియం చెల్లించ‌న‌ట్ల‌యితే పాల‌సీ ల్యాప్స్ అయ్యే ప్ర‌మాదం ఉంది. ‘ఆటో బిల్ పే’ ప‌ద్ద‌తి ద్వారా గానీ, రిమైండ‌ర్‌ను ఏర్పాటు చేసుకోవ‌డం ద్వారా గానీ స‌మయానికి ప్రీమియం చెల్లించ‌వ‌చ్చు. ప్రీమియం చెల్లింపుల‌కు సాధార‌ణంగా 15 రోజుల గ్రేస్ పిరియ‌డ్ ఉంటుంది. బీమా క్లెయింలు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ్వ‌డంలో ఎక్కువ కార‌ణాలు పాల‌సీ ల్యాప్స్ అవ్వ‌డానికి సంబంధించిన‌ వాటివై ఉంటాయి.

ముందుగా నిర్థారించిన వ్యాధుల స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం:

ఆరోగ్య బీమా పాల‌సీలో ముందుగా నిర్థారించిన వ్యాధులను క‌వ‌ర్ చేసేందుకు కొంత వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. ఈ పిరియ‌డ్ పూర్తైన అనంత‌రం మాత్ర‌మే పాల‌సీ వ‌ర్తిస్తుంది. పాల‌సీ క్లాస్‌ ఆధారంగా 3 నుంచి 4 సంవ‌త్స‌రాల వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. ద‌ర‌ఖాస్తు స‌మయంలో ముందుగా గుర్తించిన వ్యాధుల స‌మాచారం తెలియ‌జేయ‌కుండా చేసే క్లెయిమ్‌లను వెయిటింగ్ పిరియ‌డ్ పూర్తికాక‌ముందు, పూర్తైన త‌రువాత కూడా బీమా సంస్థ తిర‌స్క‌రించ‌వచ్చు.
ఆరోగ్య ప‌రీక్ష‌ల నివేదిక‌ను ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో బీమా సంస్థ కోరితే, వారు అడిగిన అన్ని ప‌రీక్ష‌ల తాలూకు నివేదిక‌ల‌ను ఇవ్వాలి. ముందుగా గుర్తించిన వ్యాధుల కార‌ణంగా పాల‌సీ తిర‌స్క‌ర‌ణ‌కు గురికాకుండా బీమా సంస్థ కోరిన నివేదిక‌ల‌ను ఇవ్వ‌డం మంచిది.

పూర్తి స‌మాచారం అందించ‌క‌పోవ‌డం:

పూర్తి స‌మాచారం ఇవ్వ‌కం పోవ‌డం లేదా దాచిపెట్ట‌డం వ‌ల్ల పాల‌సీ తిర‌స్క‌ర‌ణ‌కు గురికావ‌చ్చు. లేదా క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఆల‌స్యం కావ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి, జీవిత బీమా పాల‌సీలో, మీ వేత‌నం ఆధారంగా బీమా సంస్థ హామీ మొత్తాన్ని నిర్ణ‌యిస్తుంది. అందువ‌ల్ల జీవిత బీమా పాల‌సీకి ద‌ర‌ఖాస్తు చేసేప్పుడు వేత‌నం గురించిన స‌రైన స‌మాచారాన్ని ఇవ్వాలి. మీకు పొగ‌త్రాగ‌డం, మ‌ధ్యం సేవించ‌డం వంటి అల‌వాట్లు ఉంటే ద‌ర‌ఖాస్తులో తెలియ‌జేయాలి. ఇత‌ర బీమా పాల‌సీల‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించాలి. వ‌య‌సు, బ‌రువు, ఎత్తు, చిరునామా వంటి స‌రైన వివ‌రాల‌ను తెలియ‌జేయాలి.

గ‌డువు లోపు క్లెయిం ద‌ర‌ఖాస్తు చేయ‌క‌పోవ‌డం:

పాలసీదారుకి ఏదైనా జరిగినప్పుడు సాధ్యమైనంత తొందరగా క్లెయిం కోసం దరఖాస్తు చేయాలి. బీమా కంపెనీల నియ‌మ నిబంధ‌న‌ల ఆధారంగా ఇందుకోసం 60-90 రోజుల వ్యవధి ఉంటుంది. మోస‌పూరిత క్లెయిమ్‌ల‌ను గుర్తించ‌డానికి జీవిత‌బీమా సంస్థ‌లు మ‌ర‌ణించిన వ్య‌క్తి గురించి స‌ర్వే నిర్వ‌హిస్తాయి. అదేవిధంగా ఆరోగ్య బీమాలో, వ్య‌క్తి ఆసుప‌త్రిలో చేరిన 48 గంట‌ల‌లోపు బీమా సంస్థ‌ల‌కు తెలియ‌జేయాలి. లేక‌పోతే క్లయిమ్ సెటిల్‌మెంటు ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంటుంది.

ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటేనే క్లెయిం స‌మ‌యంలో ప‌రిహారాన్ని సులువుగా అందుకోవ‌చ్చు. క్లెయిం తిర‌స్క‌ర‌ణకు కార‌ణాలెన్నో ఉండ‌వ‌చ్చు అయితే మ‌న నిర్ల‌క్ష్యం కార‌ణంగా పాల‌సీ తిర‌స్క‌ర‌ణ‌కు గురికాకుండా చూసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly