మీ భవిష్యత్తుకు ఆర్ధిక భద్రత కల్పించండిలా..

ఒకే సమయంలో మీరు పెట్టుబడులకు, బీమా అవసరాల కోసం నగదును వెచ్చించలేకపోవచ్చు

మీ భవిష్యత్తుకు ఆర్ధిక భద్రత కల్పించండిలా..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. అయితే, మన సంపదను రక్షించే ఆర్థిక ఉత్పత్తులతో భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడం, అలాగే సంపదను నిర్మించుకోవడం చాలా ముఖ్యం. మీ ఆదాయంలో కొంత భాగం పెట్టుబడి, బీమా కోసం తప్పనిసరిగా ఉపయోగించడం మంచిది. ఒకే సమయంలో మీరు పెట్టుబడులకు, బీమా అవసరాల కోసం నగదును వెచ్చించలేకపోవచ్చు. అందువలన ప్రాథమిక అవసరాలకు ముందుగా మీరు ప్రాధాన్యతనివ్వాలి, అనంతరం మిగిలిన వాటి కోసం ఖర్చు చేయడం మంచిది.

మీ భవిష్యత్ ను భద్రపరుచుకోడానికి అవసరమైన మూడు ఆర్థిక ఉత్పత్తులను కింద తెలియచేశాము :

  1. టర్మ్ ప్లాన్ :

మార్కెట్లో అనేక రకాల జీవిత బీమా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ఒకటి టర్మ్ బీమా పాలసీ. టర్మ్ బీమా అనేది పెట్టుబడి ప్రయోజనాలు లేని స్వచ్ఛమైన జీవిత బీమా కవరేజ్ ను అందిస్తుంది. దీనిని ఒక వ్యక్తి లేదా వివాహమైన భార్యాభర్తలు సంయుక్తంగా తీసుకోవచ్చు. ఒక వ్యక్తి పై ఎవరైన ఆధారపడి జీవిస్తూ ఉంటే, అలాంటి వారి ఆర్థిక పోర్ట్ఫోలియోలో టర్మ్ బీమా కచ్చితంగా ఉండడం మంచిది.

టర్మ్ ప్లాన్ ను కొనుగోలు చేసేటప్పుడు, మరణానంతరం మీ కుటుంబసభ్యులు పొందే హామీ మొత్తం మీ ఆదాయాన్ని భర్తీ చేస్తుందనే విషయాన్ని నిర్ధారించుకోండి. ఈ హామీ మొత్తం మీ కుటుంబ సభ్యులకు లేదా మీ పై ఆధారపడి జీవించే వారి అవసరాలకు, పిల్లల విద్య, వారి భవిష్యత్ అవసరాలను కవర్ చేస్తుంది. అలాగే గృహ రుణం వంటి అసాధారణ రుణాన్ని చెల్లించటానికి కూడా సహాయం చేస్తుంది. చిన్న వయస్సులోనే ఈ పథకంలో చేరినట్లైతే, మీరు చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉంటుంది.

  1. ఆరోగ్య బీమా :

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఏంతో ఉంది, దానికి కారణం ఆసుపత్రుల్లో విపరీతంగా పెరిగిపోతున్న వైద్య ఖర్చులు. అయితే, చాలా మంది దీనిని కేవలం పన్ను మినహాయింపు ఉన్న వారికి మాత్రమే ఉపయోగకరమని భావిస్తున్నారు. కానీ ఇందులో నిజం లేదు. ఆరోగ్య బీమా పధకం అనేది ఒక టర్మ్ ప్లాన్ లాంటిది, కష్టాలలో ఉన్నప్పుడు మీకు ఎంతగానో సహాయం చేస్తుంది, తద్వారా మీరు వైద్య ఖర్చుల కోసం రుణాన్ని తీసుకోవడం లేదా మీ పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

మీరు చిన్న వయస్సులోనే ఆరోగ్య బిమా పాలసీని తీసుకున్నట్లైతే, కేవలం తక్కువ ప్రీమియంతో లభ్యమవుతుంది. ఉదాహరణకి, ప్రస్తుతం మీ వయస్సు 45 సంవత్సరాలు అనుకుంటే, మీకు ఆసుపత్రి ఖర్చులు రూ. 5 లక్షలు అయ్యాయనుకుందాం, అది 15 సంవత్సరాల తరువాత సంవత్సరానికి 5 శాతం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే మీ ఆసుపత్రి ఖర్చులు రూ. 10.4 లక్షలు కావచ్చు. పదవీ విరమణ తరువాత మీరు ఆరోగ్య బీమా కవరేజ్ ను పెంచుకోవడం కష్టం. అందువలన మీరు ముందుగానే తగినంత ఆరోగ్య కవరేజ్ ను తీసుకోవడం మంచిది.

ఆరోగ్య బీమా అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు, బీమాదారుడికి పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 (డీ) కింద పన్ను ప్రయోజనం పొందడం బీమా కోసం చెల్లించిన ప్రీమియం, బీమాదారుడి వయస్సు, బీమాదారుడి అర్హతపై ఆధారపడి ఉంటుంది.

  1. పదవీ విరమణ ఫండు :

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం గ‌డ‌పాలంటే వీలైనంత‌ త్వ‌ర‌గా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాలి. పెట్టుబ‌డులు పెట్టేందుకు అనేక మార్గాలున్నాయి. అయితే రిస్క్‌, రాబ‌డి, ఆర్థిక ల‌క్ష్యం వంటి విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించడం ఉత్తమం. దానితో పాటు అత్య‌వ‌స‌ర నిధిని కూడా ఏర్పాటు చేసుకోవ‌డం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో మీరు పొదుపు చేసుకున్న నగదును ఖర్చు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. మీరు నెల‌కు ఎంత మొత్తాన్ని పొదుపు చేయ‌గ‌ల‌రో విశ్లేషించుకొని దానికి తగ్గట్టుగా ప్ర‌ణాళిక రూపొందించుకుని ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం ప్రాంరంభించాలి. పెట్టుబ‌డుల‌ ద్వారా వచ్చిన రాబడిపై కూడా వ‌డ్డీ లభిస్తుంది. కావున ఎంత త్వ‌ర‌గా పెట్టుబ‌డులు పెట్టడం ప్రారంభిస్తే అంత మంచిది.

మ్యూచువ‌ల్ ఫండ్లు లేదా ప్రావిడెండ్ ఫండ్ ఎందులో పెట్టుబ‌డులు పెట్టాల‌న్న నిర్ణ‌యం తీసుకోవాలి. ప‌న్ను మినహాయింపు లభించే సాధ‌నాల‌లో పెట్టుబ‌డులు పెట్టడం మంచిది. దీని ద్వారా ఎక్కువ మొత్తంలో రాబడులను పొందవచ్చు. చిన్న‌వయస్సులోనే రిస్క్ ఎక్కువ‌గా ఉండే ఫండ్ల‌లో పెట్టుబ‌డులు చేయడం మంచిది. పెట్టుబ‌డుల మొత్తాన్ని వేర్వేరు సాధ‌నాల్లో పెట్ట‌డం మంచిది. ఈక్విటీ, మ్యూచువ‌ల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు (పీపీఎఫ్), నెల‌వారి పెన్ష‌న్ ప‌థ‌కాలు, ట‌ర్మ్ బీమా, స్థిరాస్తి, బంగారం ఇలా అన్ని ర‌కాల పెట్టుబ‌డులను విశ్లేషించి అందులో సరైన దానిని ఎంచుకోవాలి. సిప్ ద్వారా నెలవారీ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాలి. ఒకవేళ మీకు ఉద్యోగంలో బోన‌స్ ల‌భిస్తే దానిని కూడా పెట్టుబ‌డిగా పెట్టడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly