ప‌న్ను మిన‌హాయింపు బాండ్లలో పెట్టుబ‌డి చేస్తున్నారా?

ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా మ‌దుప‌ర్లు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

ప‌న్ను మిన‌హాయింపు బాండ్లలో పెట్టుబ‌డి చేస్తున్నారా?

త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగిన మ‌దుప‌ర్లు స్థిరాదాయ పెట్టుబ‌డుల్లో స్థిర‌మైన రాబ‌డి పొందాల‌ని కోరుకుంటారు. దీనికి సాధార‌ణంగా వారు ఫిక్సిడ్ డిపాజిట్ల‌ను ఎంచుకుంటారు. ఫిక్సిడ్ డిపాజిట్ల‌పై రాబ‌డి స్థిరంగా ఉండి, న‌ష్ట‌భ‌యం ఉండ‌దు. అయితే ప‌న్ను త‌ర్వాత వ‌చ్చే రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు ప‌న్ను మిన‌హాయింపు ఉండే పెట్టుబ‌డుల‌కు చూస్తే ముందుగా క‌నిపించేది ప‌న్నుమిన‌హాయింపు బాండ్లు.

ప‌న్ను మిన‌హాయింపు బాండ్ల‌ను ప్ర‌భుత్వం జారీచేస్తుంది. వీటిపై స్థిర‌మైన వ‌డ్డీరేటు, కాల‌ప‌రిమితి ఉంటుంది. వీటికి ఆదాయ‌పుప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 10 ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. వీటి ద్వారా స‌మీక‌రించిన నిధుల‌ను ప్ర‌భుత్వం మౌలిక‌స‌దుపాయాల రుప‌క‌ల్ప‌న‌,గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేప‌ట్టేందుకు ఉప‌యోగిస్తుంది. సాధార‌ణంగా ఈ బాండ్ల కాల‌ప‌రిమితి ప‌దేళ్లు అంత‌కంటే ఎక్కువ ఉంటుంది.

ఎవ‌రు కొనొచ్చు?
రిటైల్ మ‌దుప‌ర్లు హిందూ అభివ్యాజ్య కుటుంబం, ఎన్ఆర్ఐలు.
అధిక నిక‌ర‌విలువ క‌లిగిన మ‌దుప‌ర్లు, రూ.10 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ మొత్తం పెట్టుబ‌డి పెట్టే మ‌దుప‌ర్లు.
గుర్తింపు పొందిన‌ సంస్థాగ‌త మ‌దుప‌ర్లు (క్యూఐబీలు).
కార్పోరేట్లు, ట్ర‌స్టులు, కోఆప‌రేటివ్ బ్యాంకులు,రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంకులు మొద‌లైన వారు ఈ బాండ్ల‌లో మ‌దుపు చేయోచ్చు.

ఈ బాండ్ల‌కు ఉండే ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త ప‌న్ను మిన‌హాయింపు ఉండ‌టం. వీటిపై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయానికి పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్) కోత ఉండ‌దు. అస‌లుకు పై వ‌చ్చే వ‌డ్డీని మాత్ర‌మే ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. అధిక ప‌న్ను స్లాబులో ఉండే వారికి ఎఫ్‌డీల‌కంటే ప‌న్ను మిన‌హాయింపు బాండ్లు అనుకూలంగా ఉంటాయి. వ‌డ్డీ రేటు కూడా ఆక‌ర్ష‌ణీయంగానే ఉంటుంది. వార్షిక ప్రాతిపాదిక‌న వ‌డ్డీ రాబ‌డి వ‌స్తుంది. వీటిపై చెల్లించే వ‌డ్డీరేటు మార్కెట్ తో అనుసంధానమై ఉంటుంది. కాబ‌ట్టి వ‌డ్డీరేట్ల‌లో హెచ్చుత‌గ్గులు వ‌స్తుంటాయి. వీటిని ప్ర‌భుత్వం జారీచేస్తుంది కాబ‌ట్టి న‌ష్ట‌భ‌యం చాలా త‌క్కువ లేదా శూన్యం అని చెప్పాలి. దీంతో పాటు ఈ బాండ్లలో అస‌లుకు పూర్తి ర‌క్ష‌ణ, ఏటా రాబ‌డి ఉంటుంది. వీటికి లిక్విడిటీ త‌క్కువ‌గా ఉంటుంది. వీటిని డెట్ ఫండ్ల‌లా సుల‌భంగా న‌గ‌దు రూపంలోకి మార్చుకోలేం. ఈ బాండ్ల కాల‌ప‌రిమితి దీర్ఘ‌కాలం ఉంటుంది. కాబ‌ట్టి వీటిని అత్య‌వ‌స‌ర‌నిధిగా ప‌రిగ‌ణించ‌రాదు.

ఇవి నిర్బంధిత కాల‌ప‌రిమితి (లాక్ ఇన్ పిరియ‌డ్) క‌లిగి ఉంటాయి. క‌నీసం 10 సంవ‌త్స‌రాలు , గ‌రిష్టంగా 20 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితిని క‌లిగి ఉంటాయి. కాబ‌ట్టి వీటిని ప‌ద‌వీవిర‌మ‌ణ నిధి వంటి దీర్ఘ‌కాల ల‌క్ష్యాల‌కు ఎంపిక చేసుకోవాలి. స్వ‌ల్ప‌కాలంలో నిధులు అవ‌స‌రం అనుకుంటే మ‌దుప‌ర్లు వీటిని ఎంచుకోక‌పోవ‌డం మంచిది.

ఈ బాండ్లు డీమ్యాట్ ఖాతాలో లేదా భౌతిక రూపంలో ఉంచుకోవ‌చ్చు. వీటిపై వ‌చ్చే రాబ‌డికి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. కానీ ఎక్స్ఛేంజీ ద్వారా విక్రయించిన వాటికి ప‌న్ను మిన‌హాయింపు ఉండ‌దు. ఎక్స్ఛేంజీ ద్వారా ఈ బాండ్ల‌ను కొనుగోలు చేసే వారి లాభం ప్ర‌ధానంగా కొనుగోలు చేసిన ధ‌ర ఆధార‌ప‌డి ఉంటుంది. ఎందుకంటే వీటిని కొనుగోలు చేసేందుకు లేదా విక్ర‌యించేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి చూప‌రు. ఒక వేళ ఎక్స్ఛేంజీ ద్వారా కొనుగోలు చేసి విక్ర‌యించేందుకు వీలు ప‌డ‌కుంటే వాటిని మెచ్యూరిటీ వ‌ర‌కూ కొన‌సాగించాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly