ఆర్థిక ప్రణాళిక చేసుకోండిలా..

ఒక్క‌సారిగా ఆదాయం వ‌చ్చి ప‌డుతుంటే, ఖ‌ర్చు పెట్టాల‌న్న ఉబ‌లాడ‌టం ఉండ‌టం స‌హ‌జ‌మే

ఆర్థిక ప్రణాళిక చేసుకోండిలా..

జీవితంలో ఆర్థికంగా భ‌ద్ర‌త చేకూరాలంటే మొద‌టి నుంచి స‌రైన ప్రణాళిక‌తో వ్య‌వ‌హ‌రించ‌డం ఎంతో ముఖ్యం. వేత‌న జీవుల‌కు నెల నెలా స్థిరంగా ఆదాయం వ‌స్తుంది కాబ‌ట్టి వారు అన్నీ ప్రణాళిక ప్ర‌కారం చేసుకునే అవ‌కాశం ఉంది. కానీ ఆదాయం స్థిరంగా ఉండ‌ని వ్యాపారులు, వృత్తి నిపుణుల ప‌రిస్థితి ఏంటి. ఈ త‌రహా వ్య‌క్తులు ఆర్థిక విష‌యాల‌లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే భ‌విష్య‌త్తులో ఎన్నో ఇక్క‌ట్లు ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. ఒక్క‌సారిగా ఆదాయం వ‌చ్చి ప‌డుతుంటే, ఖ‌ర్చు పెట్టాల‌న్న ఉబ‌లాడ‌టం ఉండ‌టం స‌హ‌జ‌మే. ఆదాయం త‌క్కువున్న‌ప్పుడు, ఖ‌ర్చుల‌కు బడ్జెట్ వేసుకోక‌పోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావ‌చ్చు. ఆదాయం స్థిరంగా ఉండ‌ని వారు, ఏవైనా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర‌య్యే దాకా ఆర్థిక ప్ర‌ణాళిక అవ‌స‌రం వారికి గుర్తు రాదు.

వ్యాపారులు, వృత్థి నిపుణులు ఎలాంటి ఆర్థిక ప్ర‌ణాళిక పాటిస్తే బాగుంటుందో ఈ కింద క‌థ‌నంలో తెలుసుకుందాం.

వ్యాపారుల కోసం ఆర్థిక ప్ర‌ణాళిక‌ :

రాణి అనే యువ‌తి ఇండోర్‌లో ఒక హోటల్ న‌డుపుతోంది. ఆమెకు ఏడాది పొడ‌వునా ఆదాయం స్థిరంగా ఉండ‌దు. కొన్ని నెల‌ల్లో వ‌చ్చే ప్ర‌త్యేక సంద‌ర్భాలు, పండుగ‌లు, వారాంతాల్లో ఆదాయం బాగుంటే, మ‌రికొన్ని రోజుల్లో త‌క్కువ‌గా వ‌స్తుంది. ఇలాంటి వ్య‌క్తులు ఎలా చేస్తే బాగుంటుందో ఒక్క‌సారి ప‌రిశీలిద్దాం.

ఇలాంటి వ్య‌క్తులు స‌రైన ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా స్థిర‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. వ్యాపారుల‌కు వ‌చ్చే ఆదాయం ఎక్కువ‌గా ఉంటుంది. కానీ అవి స్థిరంగా రాక‌పోవ‌డం వ‌ల్ల వారికి ఈ విష‌యం అర్థం కాదు. ఈ త‌ర‌హా వ్య‌క్తులు స్థిర‌మైన ఆదాయం, దీర్ఘ‌కాలంలో సంప‌ద వృద్ధి చెందే ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం మేలు. ఉదాహ‌ర‌ణ‌కు పైన చెప్పుకున్న వ్య‌క్తికి ఏడాదిలో తొమ్మిది నెల‌లకు నెల నెలా రూ.60 వేల ఆదాయం వ‌చ్చి, మిగిలిన మూడు నెల‌ల‌కు క‌లిపి నెల‌కు రూ.1 ల‌క్ష చొప్పున మూడు ల‌క్ష‌లు వ‌స్తున్నాయ‌నుకుందాం. ఈ సంద‌ర్భంలో నెల‌కయ్యే అన్ని ఖ‌ర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని ఆదా చేసుకోవ‌డం ముఖ్యం.

ఉదాహ‌ర‌ణ‌కు రాణికి నెల‌కు రూ. 40 వేల ఖ‌ర్చులున్నాయ‌నుకుంటే, ఆ తొమ్మిది నెల‌ల్లో రూ.20 వేలు, మిగిలిన మూడు నెల‌ల‌కు క‌లిపి రూ. 2.60 ల‌క్ష‌ల‌ను పొదుపు ప‌థ‌కాల‌లో పెట్టాలి. అలా చేస్తే వారికి రూ.9.60 ల‌క్ష‌ల నిధి సొంత‌మ‌వుతుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే, ఖ‌ర్చుల‌న్నీ పోయాకా మిగిలినది పొదుపు చేయ‌డం కంటే, పొదుపు చేశాకా మిగిలింది ఖ‌ర్చు చేయ‌డం మంచిది.

ఆదాయం స్థిరంగా లేకున్న‌ప్ప‌టికీ, జీవితంలో నెర‌వేర్చుకోవాల్సిన ల‌క్ష్యాలు త‌ప్ప‌వు. ఆర్థిక ల‌క్ష్యాలు ఎప్పుడూ, వృత్తిప‌రంగా(వ్యాపార విస్త‌ర‌ణ‌), వ్య‌క్తిగ‌తంగా(చ‌దువులు, పెళ్లి, ఇళ్లు, ప‌ద‌వీవిర‌మ‌ణ‌) మిళితంగా ఉంటాయి. ప్ర‌తీ ల‌క్ష్యానికి విడివిడిగా కొంత సొమ్మును కేటాయించుకోవాలి. మీ ల‌క్ష్యాల విష‌యంలో ఒక్క‌సారి స్ప‌ష్ట‌త వ‌చ్చిదంటే, త‌ర్వాతి ద‌శ‌లో వాటి కోసం పెట్టుబ‌డులు పెడుతూ పోతూ ఉండాలి. దీర్ఘ‌కాల‌, స్వ‌ల్ప‌కాల ల‌క్ష్యాల‌ను నిర్ధేశించుకోవాలి. దీర్ఘకాల ల‌క్ష్యాల సాధ‌న కోసం ఈక్విటీ అనుసంధాన ప‌థకాల‌లో పెట్టుబడులు పెట్ట‌డం మంచిది.

వృత్తి నిపుణుల కోసం ప్ర‌ణాళిక‌ :

ర‌మేష్ ఒక ఫుట్‌బాల్ ఆట‌గాడు. సాధార‌ణంగా క్రీడాకారులు, సెల‌బ్రిటీల కెరీర్ చాలా చిన్న‌ది. వారి కెరీర్ ఉచ్ఛ ద‌శ‌లో ఉన్న‌ప్పుడు వారి ఆదాయం ఎక్కువ‌గా ఉంటుంది. త‌ర్వాత స‌మ‌యాల్లో ఆ ఆదాయం భారీగా క్షీణించ‌వ‌చ్చు. ఆర్థిక ప్ర‌ణాళిక విష‌యంలో వీరు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి.

కెరీర్ స‌గం స‌మ‌యంలోనే జీవితానికి అవ‌స‌ర‌మైన నిధిని ఏర్పాటు చేసుకోవాలి. నిధి ఏర్పాటు విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చాకా ఇక పెట్టుబ‌డుల ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టాలి. క్రీడాకారుల కెరీర్ 15 నుంచి 20 ఏళ్లు ఉంటుందనుకుందాం. ఉదాహ‌ర‌ణ‌కు 22 ఏళ్ల వ‌య‌సు గ‌ల ఆట‌గాడు అతినికి 37 ఏళ్లు వ‌చ్చాక గానీ రిటైర్ కాడు. మిగిలిన 40 ఏళ్ల కాలానికి అవ‌స‌ర‌మైన నిధిని ఈ మ‌ధ్య‌కాలంలోనే అత‌డు ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం ఏడాదిక‌య్యే ఖ‌ర్చులు, భ‌విష్య‌త్‌లో ఎదురయ్యే ఖ‌ర్చులు(పిల్ల‌ల చ‌దువుల‌, వారి పెళ్లిళ్లు లాంటివి) బేరీజు వేసుకుని పెట్టుబ‌డులు పెట్టాలి. ఈ పెట్టుబ‌డుల విష‌యంలో ఆర్థిక నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం మ‌ర‌వ‌వ‌ద్దు.

స్థిరాదాయం కోసం సిస్టమాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప‌థ‌కాల(ఎస్‌డ‌బ్లూపీ)ను ఎంచుకోవాలి. వ్య‌క్తుల మ‌లి జీవిత ద‌శ‌లో నిధిని ఏర్పాటు చేసుకోవాల‌నుకునే వారికి ఇది ప్ర‌యోజ‌న‌క‌రం. ఎస్‌డ‌బ్ల్యూపీ ప‌థ‌కాల ముఖ్య ఉద్ధేశం స్థిర‌మైన ఆదాయం వ‌ల్ల న‌గ‌దు ల‌భ్య‌త క‌ల‌గ‌డంతో పాటు ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌డం.

ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగంగా అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. 3 నుంచి 6 నెల‌ల ఖ‌ర్చుల‌కు అవ‌స‌ర‌మయ్యే మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. జీవితంలో ఆక‌స్మికంగా సంభ‌వించే ప్ర‌మాదాలు, సంఘ‌ట‌న‌ల నుంచి ఆర్థికంగా ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను త‌ట్టుకోవ‌డానికి ఇది అవ‌స‌ర‌ప‌డుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly