అసంఘ‌టిత రంగ కార్మికుల కోసం ఆర్ధిక ప్రణాళిక..

అసంఘ‌టిత రంగాల‌కు చెందిన వారి ఉద్యోగ భ‌ద్ర‌త, అందుకునే జీత‌భ‌త్యాలు నిల‌క‌డ‌గా ఉండ‌వు

అసంఘ‌టిత రంగ కార్మికుల కోసం ఆర్ధిక ప్రణాళిక..

మ‌న దేశంలో అసంఘ‌టిత రంగంలో ప‌నిచేసేవాళ్లు చాలా మందే ఉంటారు. ఇలాంటి రంగాల్లో ప‌నిచేసే వారికి ప‌ని, జీత‌భ‌త్యాలకు గ్యారెంటీ ఉండ‌దు. భ‌వ‌న నిర్మాణం, సినీ ప‌రిశ్ర‌మ‌, మోడ‌లింగ్ లాంటి రంగాల్లోని అసంఖ్యాక‌మైన అసంఘ‌టిత కార్మికులు ప‌నిచేస్తున్నారు. ఈ రంగంలో ప‌నిచేసే కొంద‌రు ఒక్కోసారి అనుకోకుండా ఎక్కువ మొత్తంలో డ‌బ్బు పొందుతారు. ఇది వారి ఆదాయానికి అద‌నం. ఇది వాళ్లు అప్ప‌టిక‌ప్పుడు సంతృప్తినిచ్చే విలాసాల‌కు ఖ‌ర్చుపెట్ట‌డ‌మో లేదా ఖ‌రీదైన వ‌స్తువుల‌ను కొనేందుకు ఉప‌యోగిస్తారు. మ‌రి కొంద‌రు మోస‌పూరిత‌మైన వాగ్దానాలు చేసే వారి వ‌ల‌లో ప‌డి పెద్ద మొత్తంలో డ‌బ్బు కోల్పోయే ప్ర‌మాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు.

అసంఘ‌టిత రంగాల‌కు చెందిన వారి ఉద్యోగ భ‌ద్ర‌త, అందుకునే జీత‌భ‌త్యాలు నిల‌క‌డ‌గా ఉండ‌వు. ఇది వారి ఆర్థిక జీవితంపై ప్ర‌భావం చూపించ‌కుండా ఎలా చేసుకోవాలో కింద చూద్దాం…

 • ల‌క్ష్యాల‌పై గురి :
 1. క్ర‌మ‌మైన ఆదాయం ఉండ‌దు కాబ‌ట్టి 6 నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిప‌డా అత్య‌వ‌స‌ర నిధిని ప‌క్క‌న పెట్టుకోవ‌డం మంచిది.

 2. పిల్ల‌ల చ‌దువు, పెళ్లి, ఇంటి కొనుగోలు, ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక లాంటి ఆర్థిక ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకోండి. ఎప్పుడూ ఉండే ఖ‌ర్చులు కాకుండా ఈ ల‌క్ష్యాల‌న్నింటికీ డ‌బ్బు అవ‌స‌రమే క‌దా!

 • జీవిత‌, ఆరోగ్య ర‌క్ష‌ణ‌ :
 1. కుటుంబ పెద్ద మ‌ర‌ణించాక ఆర్థిక ల‌క్ష్యాలకు ఆటంకం క‌ల‌గ‌కుండా కుటుంబానికి ర‌క్ష‌ణ‌గా ఉండేందుకు జీవిత బీమా అవ‌స‌రం.

 2. ఆరోగ్య బీమా ప్రాముఖ్య‌త అంతా ఇంతా కాదు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు అనారోగ్య‌నికే ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తే ఎంత బాధ ఉంటుందో వ‌ర్ణ‌నాతీతం. అందుకే ఓ మంచి హెల్త్ పాల‌సీ తీసుకుంటే ఖ‌ర్చుల భారం కాస్త‌యినా త‌గ్గ‌వ‌చ్చు. పైగా ఇది ఆర్థిక ల‌క్ష్యాల‌కు ఆటంకం క‌లిగించ‌దు.

 • చ‌క్ర‌ వ‌డ్డీ ప్ర‌భావం :
 1. ఆర్థిక సంప‌ద‌ను సృష్టించుక‌నేందుకు క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులపై అవ‌గాహ‌న అవ‌సరం. మార్కెట్లో అనేక ప‌థ‌కాలు, స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

 2. ప్ర‌తి ఒక్క‌రి అవ‌స‌రాన్ని తీర్చేవిధంగా, పెట్టుబ‌డుల‌పై ర‌క్ష‌ణ‌ను బ‌ట్టి, అధిక రాబ‌డులు, న‌గ‌దు ల‌భ్య‌త‌, ప‌న్ను ఆదాను బ‌ట్టి చాలా ర‌కాలే ఉన్నాయి.

 3. చిన్న వ‌య‌సులో చేసే పెట్టుబ‌డుల‌పై చ‌క్ర‌వ‌డ్డీ ప్ర‌భావంతో ల‌క్ష్యాలను అనుకున్న స‌మ‌యానికి అందుకోగ‌లం. దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డుల‌పై చ‌క్ర‌వ‌డ్డీ ప్ర‌భావం మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంది.

 • ట‌ర్మ్ పాల‌సీ విశిష్ట‌త‌ :
 1. ఓ ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీని తీసుకోండి. 65 నుంచి మీ వ‌య‌సును తీసేస్తే ఎన్నేళ్లుంటుందో అన్ని సంవ‌త్స‌రాల‌కు పాల‌సీ కొనుగోలు చేయ‌డం మంచిది.

 2. వార్షిక ఖ‌ర్చుల‌కు 10 రెట్లు ఉండేలా బీమా హామీ సొమ్ము(స‌మ్ అస్యూరెన్స్‌) ఉండాలి. దీంతో పాటు పిల్ల‌ల ఉన్న‌త చ‌దువులు, ఇంకా ఇత‌ర రుణాల‌ను దృష్టిలో పెట్టుకొని మ‌రింత అద‌నంగా తీసుకోవ‌చ్చు. దీనికి అద‌నంగా డెత్ డ్యూ టు యాక్సిడెంట్‌, డిసేబిలిటీ బెనిఫిట్‌, ప్రీమియం వెయివ‌ర్ లాంటి రైడ‌ర్ల‌ను జోడించుకోవాలి.

 3. ప్ర‌తి అయిదేళ్ల‌కోసారి ట‌ర్మ్ పాల‌సీని స‌మీక్షించండి. అవ‌స‌ర‌మైతే బీమా హామీ సొమ్ము పెంపు విష‌యాన్ని ప‌రిశీలించ‌గ‌ల‌రు. ట‌ర్మ్ పాల‌సీల‌పై ప్రీమియంలు త‌క్కువ‌గా ఉంటాయి. క‌వ‌రేజీ అధికంగా ఉంటుంది.

 • క్ర‌మమైన ఆదాయానికి సిస్ట‌మెటిక్ విత్‌డ్రాయ‌ల్‌ :
 1. అసంఘ‌టిత రంగంలోని వారు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో లంప్‌స‌మ్ అమౌంట్ పెట్ట‌వ‌చ్చు లేదా సిప్ మార్గాన్ని ఎంచుకోవ‌చ్చు. క‌నీసం రూ. 1000ల‌తో పెట్టుబ‌డిని ప్రారంభించ‌వ‌చ్చు. అందుబాటులో సొమ్మును బ‌ట్టి పెట్టుబ‌డిని నెల‌కు, మూడునెల‌ల‌కు లేదా సంవ‌త్స‌రానికి ఒక సారి ఎవ‌రి వీలును బ‌ట్టి వారు చేసుకోవ‌చ్చు.

 2. ఈ రంగంలోని వారికి కొన్ని సార్లు అనుకోకుండా ఒకే సారి డ‌బ్బు వ‌స్తుంది. అలాంట‌ప్ప‌డు క్ర‌మ‌మైన ఆదాయం కోసం ఒకేసారి ఫండ్లో పెట్టి సిస్టమెటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ ద్వారా క్ర‌మ‌మైన ఆదాయం పొందే అంశాన్ని ప‌రిశీలించ‌వ‌చ్చు.

 • ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ :
 1. ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితంలో కీల‌క ద‌శ‌. ఈ ద‌శ‌లో ఇత‌రుల‌పై ఆధార‌ప‌డాల్సి రావొచ్చు.

 2. చిన్న వ‌య‌సు నుంచే పెట్టుబ‌డి ప్రారంభించ‌డం వ‌ల్ల రిటైర్‌మెంట్ నాటికి పెద్ద మొత్తంలో నిధి జ‌మ‌వుతుంది.

 3. సాధార‌ణంగా కొంద‌రు రిటైర్‌మెంట్ కోసం పొదుపు ప్రారంభిస్తారు. అయితే మ‌ధ్య‌లో కొన్ని అవ‌స‌రాల నిమిత్తం అందులోంచి పెట్టుబ‌డిని తీస్తారు. ఇలా ఎప్పుడూ ఏదో ఒక అవ‌స‌రం వ‌స్తుంది క‌దా అని అనుకున్న ల‌క్ష్యాన్ని నీరుగార్చ‌వ‌ద్దు.

 • జాతీయ పింఛ‌ను ప‌థ‌కం :

ప‌ద‌వీ విర‌మ‌ణ అవ‌స‌రాలు తీర్చేలా ప్ర‌భుత్వం ఓ చ‌క్క‌టి ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. పీఎఫ్ ఆర్‌డీఏ వారి ఆధ్వ‌ర్యంలో ఈ పింఛ‌ను ప‌థ‌కం న‌డుస్తోంది. మ‌న‌దేశంలోని ప్ర‌తి పౌరుడు ఈ ప‌థ‌కంలో స‌భ్యులుగా చేర‌వ‌చ్చు. అసంఘ‌టిత రంగంవారికి ఈ ప‌థ‌కం చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులోని సొమ్మును ఈక్విటీ, ప్ర‌భుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్ల‌లో పెట్టుబ‌డిగా పెడ‌తారు. ఎన్‌పీఎస్ చందాదారు పెట్టుబ‌డి ర‌కాల్లో నిష్పత్తిని ఎంచుకునే వీలుంటుంది. అలా చేయ‌ని ప‌క్షంలో చందాదారుడి వ‌య‌సు ఆధారంగా ఎన్‌పీఎస్‌లో ఆటోమెటిక్‌గా ఫండ్ల కేటాయింపులు జ‌రుపుతారు. ఈ ప‌థ‌కం ప్ర‌ధాన ఉద్దేశం ప‌ద‌వీ విర‌మ‌ణ నాటికి స‌రిప‌డా నిధిని పొంద‌డం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly