ఆర్థిక భద్రత ఇంత సులువా?

ఆర్థిక అవసరాలు మారిపోతున్న పరిస్థితుల్లో కచ్చితమైన ప్రణాళిక అవసరం

ఆర్థిక భద్రత ఇంత సులువా?

వచ్చిన ఆదాయంతో నేటి అవసరాలు తీరుతున్నాయా? లేదా? చాలామంది ఆలోచన ఇక్కడే ఆగిపోతుంది. కానీ… ముందున్న జీవితాన్ని సాఫీగా కొనసాగించేందుకు అవసరమైన వనరులు మన దగ్గర సిద్ధంగా ఉన్నాయా? అనేదే ఈ రోజుల్లో కీలకంగా మారిపోయింది. అవసరమైన వస్తువుల కొనుగోలు… వినోదం, వీహార యాత్రలు… వీటిని ప్రణాళిక వేసుకున్నంతగా… ఆర్థిక ప్రణాళికలపై చాలామంది దృష్టి సారించడం లేదన్నది వాస్తవం. రోజురోజుకూ ఆర్థిక అవసరాలు మారిపోతున్న పరిస్థితుల్లో కచ్చితమైన ప్రణాళిక అవసరం ఎంతైనా ఉంది. మరి, దీనికోసం ఎలా సిద్ధం అవ్వాలో తెలుసుకుందామా!

ఆర్థిక భద్రత…మన చేతుల్లోనే పిల్లల చదువులకు డబ్బు కావాలనుకుంటే… విద్యారుణం తీసుకోవచ్చు… కారు కోసం వాహన రుణం, ఇంటికోసం గృహరుణం అందుబాటులో ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత అవసరాల సంగతేమిటి? దీనికోసం ఏ రుణాలూ అందుబాటులో ఉండవు. ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం సంపాదించిన మొత్తం నుంచే విశ్రాంత జీవితానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

పదేళ్ల క్రితం రూ.10 వేలు ఉన్నా ఒక కుటుంబానికి సరిపోయేది. ఇప్పుడు అదే రూ.10వేలతో అప్పటి జీవన శైలి సాధ్యమేనా? దాదాపు కష్టమే. కాలం గడుస్తున్న కొద్దీ డబ్బు కొనుగోలు శక్తి తగ్గుతుంది. కాబట్టి, పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసుకునేప్పుడు ఈ ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

మొదటి జీతం నుంచే ఆ జీతం ఆగిపోయే రోజు వచ్చేనాటికి పనికొస్తుందని చెప్పి… కొంత పక్కన పెట్టుకోవాలి. 30 ఏళ్లలోపే పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసుకున్నప్పుడు… చిన్న మొత్తంతోనూ మంచి నిధిని సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మలి వయసు వచ్చేనాటికి ఎంతో కొంత ఉండాలి అని అన్నారు కదా… అనుకుంటే చాలదు… పదవీ విరమణ తర్వాత కనీసం 20 ఏళ్లపాటు ఆ డబ్బు మీకు సరిపోవాలి. సంపదను పోగేసి, పిల్లలకు ఇచ్చేమాట అటుంచండి… 70 ఏళ్ల వయసులో మీరు పని చేసే అవసరం రాకుండా ఉంటే చాలు అన్నదే ముఖ్యం.

పిల్లలకు భరోసాగా…

నెలనెలా వచ్చే ఆదాయంతోనే పిల్లల ఖర్చులు కూడా సరిపెట్టేస్తుంటాం కదా… మళ్లీ వారి చదువులు, ఇతర అవసరాల కోసం ప్రత్యేకంగా ప్రణాళిక అవసరమా అనే సందేహం వస్తుంటుంది. పిల్లల చదువులు, వారి వివాహంలాంటి వాటికీ ముందునుంచీ తగిన ప్రణాళిక తప్పనిసరి.

ఇక్కడ మిమ్మల్ని మీరే ఒక ఉదాహరణగా తీసుకోండి… మీ మొత్తం చదువులకు అయిన ఖర్చెంత? ఇప్పుడు మీ అమ్మాయి/అబ్బాయికి ఏడాదికి ఎంత ఫీజు చెల్లిస్తున్నారు? ఈ రెండు లెక్కలు చాలు… పిల్లల చదువు కోసం ఎందుకు ప్రణాళిక వేసుకోవాలో అర్థం చేసుకునేందుకు… సాధారణ ద్రవ్యోల్బణంతో పోల్చినప్పుడు విద్యా ద్రవ్యోల్బణం అధికంగా ఉంటుంది. ఇది దాదాపు ఏడాదికి 13-25శాతం మధ్యలో ఉంటోంది. దీనికోసం ఏం చేయాలి?

 • మీ పిల్లల చదువు ఇంకా ఎన్నేళ్లు ఉంది… ఏడాదికేడాది అందుకోసం అవసరమయ్యే మొత్తం ఎంత? లెక్క వేసుకోండి.
 • ప్రస్తుత ఖర్చుకు… పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కూడా కలపండి.
 • దీనిని తట్టుకునేందుకు మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి… ఏయే పథకాలను ఎంచుకోవాలో తెలుసుకోవాలి. అవసరమైతే ఆర్థిక ప్రణాళిక నిపుణుడిని సంప్రదించండి.
 • మీరు ఎంచుకున్న పథకాల్లో నష్టభయం ఎలా ఉంటుంది? అది మీరు ఎంతమేరకు తట్టుకోగలరో చూసుకోవాలి… మీకు అనువైన పథకాలను ఎంచుకోవడమే ఎప్పుడూ మంచిది.
 • మీరు నెలకు ఎంత మదుపు చేయగలరు అనేది ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాతే పైవన్నీ…
 • పిల్లలు పెద్దవారవుతున్న కొద్దీ… మీ లక్ష్యాలు మారే అవకాశం ఉంది. పిల్లల ఆలోచనలు, వారి లక్ష్యాలూ మారుతుంటాయి. దీన్నిబట్టి ఎప్పటికప్పుడు మీ ప్రణాళికల్లోనూ మార్పులు చేర్పులు రావాలి.
 • చదువుల ఖర్చులకు వేసే ప్రణాళికల మాదిరిగానే… పిల్లల వివాహం ఖర్చుల కోసమూ పెట్టుబడులు పెట్టడం మర్చిపోవద్దు… అదే సమయంలో చిన్న వయసు నుంచి మదుపు చేయాలనే సూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు.

ఏం జరిగినా…

మనం సంపాదించినన్ని రోజులూ మన కుటుంబానికి ఏ ఇబ్బందీ ఉండదు. కానీ… ఆ సంపాదన ఆగిపోతే? దీనికి మనం ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉండాల్సిందే. ఏదైనా అనుకోని కష్టం వచ్చినప్పుడు… మనం వేరే ఇతర లక్ష్యానికి అనుకున్న డబ్బును దానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక కష్టం… మరో కష్టానికి కారణం కాకూడదు. అందుకే, ఎటువంటి ఆపద వచ్చినా ఆర్థికంగా తట్టుకునే శక్తిని మనకు మనం కల్పించుకోవాలి.

 • చాలామంది జీవిత బీమా పాలసీ తీసుకుంటారు. కానీ… వారికి ఏదైనా జరిగితే ఆ బీమా ద్వారా వచ్చే పరిహారం వారి కుటుంబ సభ్యులకు కనీసం రెండేళ్ల వరకైనా సరిపోదు. నిజం చెప్పాలంటే… ఇలాంటి బీమా ఉన్నా లేన్నట్లే.
  సరిపోయేంత బీమా పాలసీ అంటే ఎలా లెక్కేసుకోవాలి అనేదీ పెద్ద ప్రశ్నే… ఆర్జించే వ్యక్తికి ఏదైనా జరిగితే… అతని జీవిత భాగస్వామికి 60 ఏళ్లు వచ్చేదాకా అవసరమైన అన్ని ఆర్థిక అవసరాలను తీర్చేలా బీమా డబ్బు చేతికి అందాలి. ఈ లోపు పిల్లల అవసరాలు… వారి పెళ్ళిలాంటి ఖర్చులనూ బీమా పాలసీ భరించగలగాలి… ఎన్ని పాలసీలు ఉన్నాయన్నది అనవసరం. ఉన్న బీమా పాలసీల విలువ మీ వార్షికాదాయానికి 10-15 రెట్ల వరకూ ఉందా లేదా అన్నది చూసుకోండి. అప్పుడే అది మీకు సరిపోయే మొత్తం అన్నట్లు.

ఇంత అధిక మొత్తంలో బీమా పాలసీ తీసుకున్నప్పుడు ప్రీమియం అధికంగా ఉంటుంది కదా అనే సందేహమూ రావచ్చు. కానీ, టర్మ్‌ పాలసీ ద్వారా బీమా తీసుకుంటే మీరు చెల్లించే ప్రీమియం పెద్దగా ఏమీ ఉండదు. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తికి రూ. కోటి విలువైన బీమా పాలసీ రోజుకు రూ.15-20 ఖర్చుతో లభిస్తుంది. ఇప్పటివరకూ జరిగిన ఆలస్యం చాలు… ఇకనైనా ఈ విషయం గురించి ఆలోచించాల్సిన తరుణం వచ్చింది.

 • కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. మీపై ఆధారపడిన మీ తల్లిదండ్రులకూ ఆరోగ్య బీమా తప్పనిసరి. ఈ పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు లభిస్తుంది.

భారం తగ్గేలా…

చాలామంది ఆర్థిక సంవత్సరం చివర్లోనే పన్ను గురించి ఆలోచిస్తారు. ఇది ఎంతమాత్రం ఆచరణీయం కాదు. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే పథకాలను ఎంచుకోవాలి. అవి పన్ను ఆదా అనే అదనపు ప్రయోజనాన్ని ఇవ్వాలి.

 • ఈపీఎఫ్‌, జీవిత బీమా ప్రీమియం, పిల్లల ట్యూషన్‌ ఫీజులను సెక్షన్‌ 80సీలో చూపిస్తే… రూ.1,50,000లలో ఇవన్నీ పోను మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో మదుపు చేయండి.

 • పన్ను ఆదా పథకాలను ఎంచుకునేప్పుడు… అవి ఇచ్చే రాబడిపై పన్ను లేకుండా చూసుకోవడం మర్చిపోవద్దు.
  పాటించండి ఇవన్నీ…

 • మీ దగ్గర అత్యవసర నిధి ఎంత ఉంది? మన చేతిలో ఎప్పుడూ కనీసం 3-6 నెలల ఖర్చులకు సరిపడా మొత్తం ఉండాలి. ఇందులో 2 నెలలకు సరిపోయే మొత్తం పొదుపు ఖాతాలో… మిగతా మొత్తం లిక్విడ్‌ ఫండ్లలో ఉండాలి.

 • ఉద్యోగం మొదలైన కొత్తలోనే… గృహరుణంతో ఇల్లు కొనకూడదు. వచ్చిన ఆదాయంలో సగానికిపైగా గృహరుణం వాయిదాలకే వెళ్లిపోతుంది. ఇలాంటప్పుడు మీరు పొదుపు చేయడానికి మీ చేతిలో డబ్బు మిగలదు.

 • మీ పాప వివాహం సమయానికి బంగారం కూడబెట్టాలనుకుంటే… గోల్ట్‌ ఈటీఎఫ్‌లలో నెలనెలా కొంత మొత్తాన్ని మదుపు చేయండి. దీనివల్ల ఒకేసారి బంగారం కొనే భారం తప్పుతుంది.

 • మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఆ మొత్తంతో గృహరుణాన్ని పాక్షికంగా చెల్లించాలని తొందరపడకండి. గృహరుణానికి తక్కువ వడ్డీ ఉంటుంది. చెల్లించిన వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. మీ దగ్గర ఉన్న డబ్బును డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు ప్రయత్నించండి.

 • ఏడాది రెండేళ్లలో డబ్బు అవసరం అనుకుంటే… లిక్విడ్‌ ఫండ్లు, రికరింగ్‌ డిపాజిట్లను ఎంచుకోండి. 3-5 ఏళ్లలో అవసరం అనుకుంటే… ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా డెట్‌ ఫండ్లను ఎంచుకోండి. 5 ఏళ్లకు మించి ఆర్థిక లక్ష్యాలు ఉంటే… ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. వీటిలో సిప్‌ చేయడం ఎప్పుడూ ఉత్తమం.

 • మీకు వచ్చే రాబడిని బట్టి, మీ పెట్టుబడి ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. దీనికోసం ‘రూల్‌ 72’ ఉంది. అంటే… 72ను మీకు వచ్చే రాబడితో భాగిస్తే… వచ్చే జవాబే… మీ పెట్టుబడి రెట్టింపు అవడానికి పట్టే సమయం. ఉదాహరణకు మీకు 9శాతం రాబడి వస్తుందనకుంటే… 72/9=8. మీ పెట్టుబడి 8 ఏళ్లలో రెట్టింపు అవుతుందన్నమాట. మీ దగ్గర ఇప్పుడు రూ.2లక్షలు ఉన్నాయి. 6 ఏళ్లలో అవి రెట్టింపు కావాలనుకున్నారనుకోండి… అప్పుడు 72/6= 12. అంటే… 12 శాతం రాబడి సాధించేలా మదుపు చేయాలన్నమాట.

 • నెలవారీ సంపాదనలో 50శాతం కుటుంబ ఖర్చులకు వెళ్లాలి. 30శాతం పెట్టుబడులు పెట్టాలి. 20 శాతం మీ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు. దీన్ని 50:30:20 సూత్రంగా పేర్కొంటారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly