ఇవి కంపెనీలకేనా... మనకూ వర్తిస్తాయా?

బలాలు, బలహీనతలు, అవకాశాలు, లోటుపాట్లు అనే నాలుగు పదాలు కంపెనీ బోర్డు మీటింగులలో ఎక్కువగా వినిపిస్తాయి

ఇవి కంపెనీలకేనా... మనకూ వర్తిస్తాయా?

సాధారణంగా నాలుగు పదాలు కంపెనీ బోర్డు మీటింగులలో ఎక్కువగా వినిపిస్తాయి. అవే బలాలు, బలహీనతలు, అవకాశాలు, లోటుపాట్లు. వీటి గురించి కంపెనీలు విస్తృతంగా చర్చిస్తాయి. మార్కెట్లో ఉన్న పోటీ కారణంగా వారి ఉత్పత్తులకు గిరాకీ పెంచుకోవటం, నిలబడేటట్లు చూసుకోవడం, అలాగే కొనసాగేటట్లు చేసుకోవడం కంపెనీ సీఈఓలకు ఒక నిరంతర ప్రక్రియ. దీని కోసం ఆ కంపెనీకి ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, లోటుపాట్లు గురించి చర్చిస్తారు.

బలాలు : వీటి కోసం కంపెనీ ఆర్ధిక స్థోమత, తమ ఉత్పత్తులకు దీర్ఘకాలిక అమ్మకాల ప్రణాళిక, నమ్మకమైన ఉద్యోగులు, సప్లై చైన్ మ్యానేజ్మెంట్ (ఎస్సీఎం) అంటే ముడి సరుకు నుంచి ఉత్పత్తి అయిన వస్తువులు వినియోగదారునికి చేరే వరకు ఉన్న ప్రక్రియని పరిగణనలోకి తీసుకుని తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండేట్లు చూసుకోవడం మొదలైనవి.

బలహీనతలు : మార్కెట్ గురించి రీసెర్చ్, విశ్లేషణ చేసే టీమ్, సప్ప్లైర్లతో, వినియోగదారులతో, అలాగే రుణాలు ఇచ్చే సంస్థలతో సంప్రదింపులు జరిపే యంత్రాంగం లేకపోవటం వంటివి చెప్పుకోవచ్చు.

అవకాశాలు : ఎటువంటి ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉన్నదో తెలుసుకోవటం, అవి దేశీయంగా లభిస్తాయా లేదా దిగుమతి ద్వారా చౌకగా లభిస్తాయో చూసుకోవటం, సరఫరాదారుని నుంచి రుణ సదుపాయం, అలాగే గిడ్డంగి సదుపాయం వంటివి చూసుకోవటం.

లోటుపాట్లు : మార్కెట్లో లభించే చౌక వస్తువులు, ప్రభుత్వ విధానాలు, రూపాయి మారక విలువ వంటిని పరిశీలించడం.

ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు. అదేమిటంటే కంపెనీ విషయాలతో నాకేంటి అని. పైన తెలిపిన నాలుగు అంశాలను మన జీవితానికి అన్వయించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

బలాలు :

 • నా ఖర్చులు నియంత్రణ లోనే ఉంటాయి.
 • నా కుటుంబానికి నిర్దేశించుకున్న ఆర్ధిక లక్ష్యాల కోసం సరైన మదుపు సాధనాలలో పెట్టుబడి పెడతాను.
 • ముఖ్యమైన ఆర్ధిక విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తాను.
 • క్రమం తప్పకుండా మదుపు చేస్తాను, అలాగే క్రమానుగతంగా విశ్లేషణ చేస్తాను.
 • నేను పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాన్ని తెలుసుకుంటాను. ఇల్లు లేదా స్థలం కొనుగోలు, జీవిత లేదా ఆరోగ్య బీమా పధకం , బంగారం, పెట్టుబడి వంటి విషయాలలో ఉండే లోటుపాట్ల గురించి వివరంగా తెలుసుకుంటాను.
 • ప్రతి పెట్టుబడిని ఒకే లాంటి రెండు లేదా మూడు పథకాలతో పోల్చి చూసి ఆ తరువాతే నిర్ణయం తీసుకుంటాను.
 • అవసరమైతే వృత్తి నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటాను.

బలహీనతలు :

 • బీమా పాలసీలు తీసుకునేటప్పుడు నా ఏజెంట్ ఏది చెప్తే (ఉదాహరణకు జీవిత బీమాలో ఎండోమెంట్ / మనీ బ్యాక్ / యులిప్స్ వంటి) వాటిని తీసుకుంటాను. వాటి గురించి మరిన్ని వివరాలు అడగను. అటువంటి పాలసీల వలన లాభాలు, నష్టాలు, అలాగే ఇటువంటి పాలసీలు నాకు ఉపయోపడతాయా అని చర్చించను.
 • నా చుట్టాలు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సలహాలతో పొదుపు, మదుపు చేస్తాను.
 • ఇంతకు మునుపు అనేక మంది నష్టపోయిన విషయాల గురించి తెలుసుకుని కూడా అధిక రాబడి కోసం అత్యాశకు పోతాను.
 • నాకు అవసరం ఉన్నా లేకున్నా వస్తువులను కొంటాను. వాటి అవసరం, ధర, వాటి ఉపయోగం గురించి పెద్దగా ఆలోచించను.
 • నాకు పెట్టుబడి కంటే ఖర్చు చేయటంలోనే ఆనందం. ఎందుకంటే నా బంధువులలో, స్నేహితులలో పరపతి పెరుగుతుందని భావిస్తాను.

అవకాశాలు :

 • అంతర్జాలం ద్వారా మనకు కావలసిన విషయం గురించిన సమాచారం తెలుసుకోవచ్చు.
 • అత్యవసరం కానీ విషయంలో మరొక అభిప్రాయం పరిశీలించవచ్చు.
 • ఆర్ధిక ప్రణాళిక కోసం ఈ లింక్ ద్వారా నిపుణులను సంప్రదించవచ్చు.

లోటుపాట్లు :

 • పెట్టుబడి ఆలస్యం చేయటం వలన చక్రవడ్డీ ద్వారా లభించే రాబడిని కోల్పోతాం.
 • చిన్న వయసు నుంచే పెట్టుబడి చేయటం వలన అత్యధిక నిధిని సమకూర్చుకోవచ్చు.
 • ఆలస్యం చేసే కొద్దీ అధిక మొత్తాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది.
 • జీవిత బీమాని పెట్టుబడిని వేరు వేరుగా చూడగలగాలి.
 • ఈఎంఐ (ఇంటి, కారు, క్రెడిట్ కార్డు వంటి రుణాలు) లను సమయానికి చెల్లించక పోవటం వలన అధిక వడ్డీ, అదనపు రుసుముల భారంతో పాటు క్రెడిట్ స్కోర్ ఫై కూడా చెడు ప్రభావం పడుతుంది.

ముగింపు :

మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం, రాబడి, ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఇది మనం కష్టపడి సంపాదించిన సొమ్ము. ఇటువంటి విషయాల గురించి మరిన్ని కధనాల కోసం శోధించండి (www.eenadusiri.net).

బలాలను మరింత బలపర్చుకోండి, బలహీనతల నుంచి బయట పడండి, అవకాశాలను సద్వినియోగ పర్చుకోండి, లోటుపాట్లను సరిచేసుకోండి. ఇక విజయం మీదే.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly