హుందాయ్‌ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు..

మొదటగా సుమారు 1000 కార్లను మన దేశ మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది

హుందాయ్‌ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన హుందాయ్‌ మొదటిసారి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని పేరు ‘కోనా’. దీనిని జులైలో భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. హుందాయ్‌కి సంబంధించిన అన్ని కొత్త కార్లను భారత మార్కెట్ లోకి విడుదల చేస్తూ ఉంటామని, దీనిలో భాగంగానే కోనా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ కారును కూడా జులై 9న ఇక్కడి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు హుందాయ్‌ మోటార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ పునీత్‌ ఆనంద్‌ తెలిపారు.

ఈ ఎలక్ట్రిక్‌ కారు ధర సుమారు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్ - షోరూమ్) మధ్య వుండే అవకాశం ఉంది. ఈ కారును చెన్నైలోని హుందాయ్‌ ప్లాంట్ లో తయారు చేయనున్నట్లు తెలుస్తుంది. మొదటగా సుమారు 1000 కార్లను మన దేశ మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. డిమాండ్ ఆధారంగా వాటి సంఖ్య మరింత పెంచనున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.

అంతర్జాతీయంగా, కోనా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. వాటిలో ఒకటి ఎలక్ట్రిక్, రెండవది ఎలక్ట్రిక్ లైట్. కోనా ఎలక్ట్రిక్ 64 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది, ఇది 201.2 bhp, 395nm శక్తిని అందిస్తుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 482 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ కారు పూర్తిగా ఛార్జ్ అవడానికి తొమ్మిది గంటల సమయం పడుతుంది.

అలాగే కోనా ఎలక్ట్రిక్ లైట్ 39.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది, ఇది 134.13 bhp, 395 Nm శక్తిని అందిస్తుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 312 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ కారు పూర్తిగా ఛార్జ్ అవడానికి ఆరు గంటల సమయం పడుతుంది.

కోనా ఎలక్ట్రిక్ కారు 100kW DC ఫాస్ట్ ఛార్జర్ తో అందుబాటులో ఉంటుంది, ఇది కేవలం 54 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుంది. దీనిలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేషన్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్ బాగ్స్, యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, హిల్-స్టార్ అసిస్ట్, రివర్స్ కెమెరా, రియల్ టైమ్ ట్రాఫిక్ అలర్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నెలకు సుమారు 50 కార్లను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly