టీవీఎస్ నుంచి సరికొత్త బైకు..ధర ఏంతో తెలుసా?

ఇథనాల్ కాన్సెప్ట్‌ బైకును ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో తొలిసారిగా ప్రదర్శించారు

టీవీఎస్ నుంచి సరికొత్త బైకు..ధర ఏంతో తెలుసా?

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ భారతదేశపు మొదటి ఇథనాల్ ఆధారిత మోటార్‌సైకిల్‌ను శుక్రవారం విడుదల చేసింది. దీని పేరు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ. దీని ధరను రూ. 1,20,000 గా సంస్థ నిర్ణయించింది. ఈ బైకు మొదటగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఇందులో 200 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 129 కిలోమీటర్లని సంస్థ తెలిపింది.

ఈ బైకు లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత వింప్లవం కార్యక్రమానికి అనుగుణంగా ఈ కొత్త బైకును తయారు చేసినట్లు సంస్థ తెలిపింది.

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ఇథనాల్ కాన్సెప్ట్‌ బైకును ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో తొలిసారిగా ప్రదర్శించారు. టీవీఎస్ మోటార్స్ కు చెందిన ప్రధాన బ్రాండ్ అయిన టీవీఎస్ అపాచీకి ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. ద్విచక్ర వాహన పరిశ్రమ విద్యుత్, హైబ్రిడ్, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్ తెలిపారు. అలాగే పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే ఇథనాల్‌ తో నడిచే బైకుల పనితీరులో ఎలాంటి తేడా ఉండదని, ఇవి పర్యావరణానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయని వేణు శ్రీనివాసన్‌ తెలిపారు.

tvs ethanol bike.jpg

ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగించడం ద్వారా పెట్రోలియం దిగుమతిపై ఆధారపడటం తగ్గుతుందని, ఇంధన భద్రత పెరుగుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఏదేమైనా, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ తో నడిచే 150 సీసీ వరకు సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలన్న నీతి ఆయోగ్ నిర్ణయంతో చాలా మంది పరిశ్రమ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025 సంవత్సరం నాటికి దేశంలోని ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను విద్యుదీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly