మదుపు మార్గం లో అయిదు మరువకూడని పాఠాలు!

దాచిన సొమ్ముతో క్రమం తప్పని ఆదాయానికి బాటలు ఎలా వేసుకోవాలో చూద్దాం

మదుపు మార్గం లో అయిదు మరువకూడని పాఠాలు!

జీవితంలో ప్రతి అవసరమూ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం ద్వారా ఆర్జిస్తున్నన్ని రోజులూ ఎలాగో అలా అవసరాలను తీర్చుకుంటున్నా… ఆ క్రమం తప్పని ఆదాయం ఆగిపోయిన రోజున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ముందునుంచే జాగ్రత్తగా ఉంటే మేలు కదూ! భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి ప్రణాళికలను రూపొందించుకోవడం ఎప్పుడూ అవసరమే. అయితే, ఆ పెట్టుబడులను ఎంత తొందరగా ప్రారంభించామన్నదే ముఖ్యం. ఇలా దాచిన సొమ్ముతో క్రమం తప్పని ఆదాయానికి బాటలు వేసుకోవాలి. అది ఎలాగో చూద్దామా!

  1. వైవిధ్యంగా, సురక్షితంగా:

మొత్తం పెట్టుబడిని ఒకే పథకంలో పెట్టడం ఆర్థికంగా సురక్షితం కాదు. పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండాలి. నష్టభయం ఉన్న పథకాలతో పాటు… తక్కువ రాబడినిచ్చినా కష్టార్జితానికి కాస్త రక్షణ ఇచ్చేవీ మన జాబితాలో ఉండాలి. ఉదాహరణకు ఒక షేరులో మదుపు చేసినప్పుడు ఐదేళ్లలో దాదాపు 300శాతం వరకూ రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. అదే డెట్‌ పథకాన్ని ఎంచుకుంటే… 25శాతానికి మించి రాబడి రాకపోవచ్చు. కానీ, ఒకవేళ ఆ షేరు పతనం అయితే ఏడాదికి 80శాతానికి పైగానే దిగజారవచ్చు. ఇదే సమయంలో డెట్‌ పథకం 7-8శాతానికి మించి పడిపోదు. వైవిధ్యంగా పెట్టుబడి పథకాలు ఉండటం మంచిదనేది అందరూ అనుకుంటారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే… మరీ ఎక్కువ వైవిధ్యం కూడా పనికిరాదు. ఒకే సమయంలో ఐదు కన్నా అధికంగా పథకాలను ఎంచుకోకపోవడమే ఉత్తమం. అవీ పూర్తి పారదర్శకంగా, నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో ఉండాలి. ఉదాహరణకు ఈక్విటీలు, ప్రభుత్వ, కార్పొరేట్‌ డెట్‌ పథకాలు, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, స్థిరాస్తులు, బంగారంలాంటి వాటిని ఎంచుకోవచ్చు. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేని పథకాల్లో అధిక మొత్తాలను పెట్టి, నష్టపోకూడదు. ముఖ్యంగా అధిక వడ్డీల ఆశతో వచ్చే పలు పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

  1. ఎంత పొదుపు చేయాలి?

సంపాదించిన డబ్బులో నుంచి ఎంత పొదుపు చేయాలనే సందేహం చాలామందికి వస్తుంటుంది. దీనికి ఒక సూత్రాన్ని చెప్పుకోవచ్చు. అదే…50-20-30. మీరు సంపాదించిన మొత్తంలో 50శాతం వరకూ నిత్యావసరాలకు, ఇతర ఖర్చులకు వెచ్చించాలి. కనీసం 20శాతం కచ్చితంగా పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. ఇక మిగిలిన 30శాతం మీ కోరికలు, లేదా ఇతర అవసరాలకు వాడుకోవాలి. అయితే, ఇది ఇప్పుడిప్పుడే సంపాదన ప్రారంభించిన వారికే. ఆదాయం అధికంగా ఉన్నవారు, బాధ్యతలు మీదపడిన వారు… పొదుపు, పెట్టుబడులు 50శాతం లేదా అంతకు మించి ఉండాలి. దీంతోపాటు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అన్న ఆలోచనా ఉండాలి. దానికి తగ్గట్టుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 3-6 నెలల ఖర్చులను అందుబాటులో ఉంచు కోవడం ఎప్పుడూ తప్పనిసరి.

  1. లక్షలు… కోట్లయ్యేలా

చిన్న మదుపరులు క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో మదుపు చేసేందుకు ఉన్న మార్గాల్లో మ్యూచువల్‌ ఫండ్లు ఒకటి. ఇందులోనూ క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుంది. గత దశాబ్ద కాలం నుంచీ భారతీయ ఈక్విటీ మార్కెట్‌నూ, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల పనితీరునూ గమనిస్తే… ఆకర్షణీయమైన రాబడులనే అందించాయని చెప్పొచ్చు. నేరుగా ఈక్విటీల్లో మదుపు చేసినప్పుడు నష్టభయం కాస్త అధికంగానే ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నిపుణుల పర్యవేక్షణలో, వారు నిర్వహించే ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసినప్పుడు ఈ నష్టభయాన్ని కాస్త నియంత్రించుకోవచ్చు. అదే సమయంలో పూర్తి సురక్షిత పథకాలతో పోలిస్తే కాస్త అధిక రాబడి కూడా అందుతుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో మ్యూచువల్‌ ఫండ్లలో చేసే సిప్‌ ఉపయోగపడుతుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకొని, అందుకు అనువైన మొత్తాన్ని సిప్‌ చేస్తూ వెళ్లడమే ఎప్పుడూ ఉత్తమం.

రాబోయే దశాబ్ద కాలంలో ఈక్విటీ ఫండ్ల నుంచి సగటున 13-17శాతం వరకూ రావచ్చనేది చాలామంది నిపుణుల అంచనా. ఇప్పటి నుంచి ఒక వ్యక్తి నెలకు రూ.10వేల చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో 20 ఏళ్లపాటు మదుపు చేస్తారని అనుకుందాం. పెట్టుబడి మొత్తం రూ.24లక్షలు అవుతుంది. 20 ఏళ్లు పూర్తయ్యే సరికి… 15 శాతం వార్షిక సగటు రాబడి అంచనాతో రూ.1.5 కోట్ల నిధి జమ అయ్యేందుకు అవకాశం ఉంది. పెట్టుబడిని ఇంకా కొంతకాలం కొనసాగిస్తే ఈ మొత్తం మరింత అధికమవుతుంది. పెట్టుబడిని 20 ఏళ్లకు బదులు 25 ఏళ్లపాటు పెడితే… రూ.3.3కోట్లు అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఇక 30 ఏళ్లపాటు మదుపు చేస్తే… రూ.7 కోట్లు జమ అవుతాయి. ఇదే రీతిన 35 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగితే… 14.9 కోట్ల వరకూ అయ్యే అవకాశం ఉంది. ఎంత దీర్ఘకాలం మదుపు చేస్తే అంత మంచి ప్రయోజనాలు లభిస్తాయని ఈ గణాంకాలతో మనకు అర్థం అవుతుంది.

మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌తో పాటు ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయాన్నీ పరిశీలించవచ్చు. అయితే, అనిశ్చితి ఎక్కువగా ఉండే ఈక్విటీ మార్కెట్లో ఇలా చేయడం కాస్త నష్టభయంతో కూడుకున్నదే. నేరుగా షేర్లలో మదుపు చేసినప్పుడు మ్యూచువల్‌ ఫండ్లకన్నా అధిక రాబడి రావచ్చు. కానీ, నష్టపోవడానికి అవకాశమూ ఉంటుంది. మంచి అవగాహనతో, సెబీ వద్ద నమోదైన బ్రోకర్‌ ద్వారానే షేర్లలో మదుపు చేయాలి. ఈక్విటీలతోపాటు డెట్‌ ఫండ్లు, హైబ్రీడ్‌ ఫండ్లు, పూర్తి సురక్షితంగా ఉండే పథకాలనూ పరిశీలించాలి.

  1. లక్ష్య సాధనలో తోడుగా

పిల్లల చదువులు, పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం స్థిరంగా ఆదాయం ఉండాలని చాలామంది కోరుకుంటారు. అదే సమయంలో కొన్ని స్వల్పకాలిక అవసరాలకూ డబ్బు అవసరం ఉంటుంది. కారు కొనడం, విహార యాత్రలకు వెళ్లడం, ఇల్లు కొనడంలాంటి కోరికలూ ఉంటాయి. కాబట్టి, పెట్టుబడులు ఎప్పుడూ దీర్ఘకాలం కోసం అని అనుకోకూడదు. 3-5 ఏళ్ల వ్యవధి కోసమూ మదుపు చేయాలి. ఇలాంటప్పుడు డెట్‌ పథకాలను పరిశీలించాలి. 7-10 ఏళ్లకు మించి వ్యవధి ఉన్నప్పుడే ఈక్విటీ పథకాలవైపు దృష్టి పెట్టాలి.

  1. రాబడి పెరగాలి

గతంతో పోలిస్తే ఇప్పుడు పెట్టుబడి విధానంలో చాలా మార్పులు వచ్చాయి. సాంకేతికత సహాయంతో ఎంతో సులువుగా పెట్టుబడులు పెట్టడం, వాటిని నిర్వహించడం తేలికయ్యింది. దీనిద్వారా పెట్టుబడి ఖర్చులూ తగ్గుతున్నాయి. ఉదాహరణకు సంప్రదాయ బ్రోకర్లతో పోలిస్తే… పూర్తి సాంకేతికతో వచ్చిన బ్రోకర్లు చాలా తక్కువ రుసుములు వసూలు చేస్తున్నారు. చిన్న మదుపరులు మదుపు చేసేముందు సరైన అవగాహన పెంచుకునేందుకూ ఇప్పుడు అనేక మార్గాలున్నాయి. వీటి ద్వారా మీరు మదుపు చేసే పథకాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అప్పుడే విజయవంతమైన మదుపరిగా… అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly