ఎఫ్‌డీల ద్వారా పెద్ద‌ల‌కు ప్ర‌యోజ‌నాలు

పెరిగిన వ‌డ్డీ రేట్లు, ప‌న్ను ప్ర‌యోజ‌నాల వ‌ల్ల ఎఫ్‌డీలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మారాయి

ఎఫ్‌డీల ద్వారా పెద్ద‌ల‌కు ప్ర‌యోజ‌నాలు

జీవితం అంతా క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు కు స్థిర‌మైన, సుర‌క్షిత‌మైన చోట పెట్టుబ‌డి చేయాల‌ని ఎవ‌ర‌నుకోరు చెప్పండి. వ‌యోవృద్ధుల‌కు రాబ‌డి శాతం కంటే క‌చ్చిత‌మైన రాబ‌డి చాలా అవ‌స‌రం. చాలా మంది పెద్ద‌వారు త‌మ ప‌ద‌వీవిర‌మ‌ణ డ‌బ్బును లేదా పొదుపు చేసిన మొత్తాన్ని 60 ఏళ్ల త‌రువాత విశ్రాంత జీవితానికి ఏ చింత రాకుండా ఉండే విధంగా ఫిక్సిడ్ డిపాజిట్ల‌ను ఎంచుకుంటారు. 50 బేసిస్ (0.5 శాతం) రేటును పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణ‌యం తీసుకుంది. వ‌డ్డీ ద్వారా వ‌చ్చే ఆదాయం పై ఆధార‌ప‌డే వారికి ఇది మంచి ప‌రిణామంగానే చెప్పాలి.

వడ్డీ 0.5 శాతం ఎక్కువ:

చాలా బ్యాంకులు వ‌యో వృద్ధుల‌కు (సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు) వ‌డ్డీ రేట్ల‌ను 50 బేసిస్ పాయింట్ల వ‌ర‌కూ అధికంగా ఇస్తుంటాయి. ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లు సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎక్కువ‌గా ఎంచుకునే పెట్టుబ‌డి సాధ‌నమ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే వాటిలోన‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా, స్థిర‌త్వం ఎక్కువ‌గా ఉంటుంది. 60 ఏళ్ల వ‌య‌సు నిండిన వారికి స్థిరాదాయ ప‌థ‌కాల్లో మ‌దుపు భ‌రోసానిస్తుంది.

స్థిరంగా… క‌చ్చితంగా…

మ్యూచువ‌ల్ ఫండ్లలా ఇవి మార్కెట్ తో అనుసంధానమై ఉండ‌వు. వీటిపై రాబ‌డి స్థిరంగా ఉంటుంది. బ్యాంకు వ‌డ్డీ రేటు ఆధారంగా ఉంటుంది. వీటిలో క్ర‌మానుగ‌తంగా ఆదాయం ల‌భిస్తుంది. మ‌దుప‌రి పెట్టుకున్న ఆప్ష‌న్ బ‌ట్టి నెల‌కు, మూడు నెల‌ల‌కు వ‌డ్డీ అందుతుంది. ఇది స్థిరంగా క‌చ్చితంగా అందుతుంది.

ప‌న్ను మిన‌హాయింపు రూ.50,000:

అన్ని కంటే ముఖ్య‌మైన విష‌యం ప‌న్ను ప్ర‌యోజ‌నాలు. ఎఫ్‌డీల‌పై వ‌చ్చే ఆదాయం పై గ‌తంలో అంద‌రికీ రూ.10 వేల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ఉండేది. సెక్ష‌న్ 80టీటీఏ కింద ఈ మిన‌హాయింపుఉండేది. ప్ర‌స్తుతం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఎఫ్‌డీల‌పై వ‌చ్చే ప‌న్ను మిన‌హాయింపు ఆదాయం రూ.50000 వ‌ర‌కూ ఉంది. ఆర్థిక సంవ‌త్స‌రం 2018-19 నుంచి ఈ విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది. సెక్ష‌న్ 80టీటీబీ కింద ప‌న్ను మిన‌హాయింపును రూ.50వేల‌కు పెంచుతున్న‌ట్లు 2018-19 బ‌డ్జెట్ లో పేర్కొన్నారు.

టీడీఎస్ ఎలాగంటే?

ప్ర‌స్తుతం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మూలం వ‌ద్ద ప‌న్ను(టీడీఎస్) వ‌డ్డీ ఆదాయం రూ. 50000 మించితే క‌ట్ అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు 60 ఏళ్ల పై బ‌డిని వ్య‌క్తికి రూ.45 వేలు వ‌డ్డీ ద్వారా ఆదాయం వ‌చ్చింద‌నుకుంటే, అందులో ఏవిధ‌మైన టీడీఎస్ కోత ఉండ‌దు. ఒక వేళ ఆ వ్య‌క్తికి రూ.60 వేలు వ‌డ్డీ ఆదాయం ల‌భిస్తే , దానిపై 10 శాతం టీడీఎస్ కోత ప‌డుతుంది. పాన్ వివ‌రాలు ఇచ్చిన వారికి 10 శాతం ఇవ్వ‌ని వారికి 20 శాతం మూలం వ‌ద్ద ప‌న్ను కోత ఉంటుంది.

ఇది ఆ వ్య‌క్తి మొత్తం ప‌న్ను చెల్లింపుల్లో భాగంగా ఉంటుంది. కాబ‌ట్టి ఆ వ్య‌క్తి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌పుడు ఈ మొత్తం లెక్కించుకోవాలి. ఒక వేళ ఆ వ్య‌క్తి ప‌న్ను ప‌రిధిలోకి రాలేన‌ట్ట‌యితే ఆ టీడీఎస్ మొత్తాన్ని రీ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.ఫిక్సిడ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డి చేసేందుకు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణగా ఉన్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly