ఫండ్ల‌లో మ‌దుపుచేసే ఫండ్లు

సంప్ర‌దాయానికి భిన్నంగా ఈ ర‌క‌మైన మ్యూచువల్ ఫండ్లు ఇత‌ర ఫండ్ల‌లో మ‌దుపు చేసే ప‌నితీరు తెలుసుకుందాం.

ఫండ్ల‌లో మ‌దుపుచేసే ఫండ్లు

సాధార‌ణంగా మ్యూచువ‌ల్ ఫండ్ నిపుణులు మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను షేర్లు, బాండ్లు త‌దిత‌రాల్లో పెట్టుబ‌డి చేస్తారు. సంప్ర‌దాయానికి భిన్నంగా కొంద‌రు ఫండ్ మేనేజ‌ర్లు బాగా రాణించే, ఎంపిక చేసిన కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తుంటారు. ఇలా చేయ‌డంతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌.ఓ.ఎఫ్‌) అంటారు.

ఎఫ్‌.ఓ.ఎఫ్‌ల నిక‌ర ఆస్తి విలువ (ఎన్ ఏవీ) అందులో స‌మ్మిళితంగా ఎంచుకున్న మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉంటుంది. సాధార‌ణంగా మంచి ఫండ్ల‌నే ఎంపిక చేస్తారు కాబట్టి రాబ‌డి స్థాయి అన్ని ఫండ్ల స‌రాస‌రి రాబ‌డికి స‌మీపంలో ఉంటుంది. ఎఫ్‌.ఓ.ఎఫ్‌ల‌నే మ‌ల్టీ మేనేజ‌రు ఫండ్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి ఫండ్ల‌ ప్ర‌యోజ‌నాల‌కు ప్ర‌ధాన కార‌ణం విస్తార‌మైన‌ వైవిధ్య‌త (డైవ‌ర్సిఫికేష‌న్‌) క‌లిగి ఉండ‌డం.

వైవిధ్య‌త (డైవ‌ర్సిఫికేష‌న్)

ఎఫ్‌.ఓ.ఎఫ్ ల ఎంపికతో మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డి మార్గంలో మ‌రింత‌ వైవిధ్య‌తకు స్థానం క‌ల్పించిన‌ట్ట‌వుతుంది. వివిధ ఫండ్ మేనేజ‌ర్లు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను నిర్వ‌హిస్తుంటారు. ప్ర‌థ‌మ స్తాయిలోనే విభిన్న‌మైన షేర్లు, రంగాలవారీగా పెట్టుబ‌డి జ‌రుగుతుంది. వివిధర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఈ ఎఫ్‌.ఓ.ఎఫ్ ల‌లో ఎంచుకోవ‌డం ద్వారా ద్వితీయ స్థాయిలో మ‌రింత‌ వైవిధ్య‌త సాధ్య‌మ‌వుతుంది. ఇలా వైవిధ్య‌త (డైవ‌ర్సిఫికేష‌న్) ప్ర‌యోజ‌నాలు చేకూరేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

త‌క్కువ న‌ష్ట‌భయం (రిస్క్)

ఈ ఫండ్ లో రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంది. ఎందుకంటే మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్టుబ‌డి షేర్ల‌లో పెట్టుబ‌డి కంటే త‌క్కువ రిస్క్ తో కూడుకున్న‌ది. కొంత మంది నిపుణులు నిర్వ‌హిస్తున్న ఫండ్లలో పెట్టుబ‌డి చేసి, ఆ ఫండ్ల నుంచి వ‌చ్చిన లాభాల‌ను ఫండ్ ఆఫ్ ఫండ్స్ మ‌దుప‌ర్లకు పంచుతారు

ఛార్జీలు:

ఎఫ్‌.ఓ.ఎఫ్ ల‌లో మ‌దుపుచేయడం వ‌ల్ల మ‌నం పెట్టుబ‌డి చేసిన మ్యూచువ‌ల్ ఫండ్ లో ఒక‌సారి, ఫండ్ నిర్వాహ‌కులు కూడా మ‌దుపు చేసేది మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో కాబ‌ట్టి అక్క‌డ మ‌రోసారి ఛార్జీలు ప‌డ‌తాయి. అంటే రెండుసార్లు నిర్వ‌హ‌ణ‌ ఛార్జీల భారం త‌ప్ప‌దు.

ఆప్ష‌న్స్‌:

అన్ని మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల లాగానే వీటిలోనూ గ్రోత్, డివిడెండ్ ఆప్ష‌న్లు ఉంటాయి. మిగ‌తావాటిలాగే వీటికి డైరెక్ట్ , రెగ్యుల‌ర్ ప్లాన్స్ ఉంటాయి.

పెట్టుబ‌డి విధానం:

ఫండ్ నిర్వాహ‌కుల నుంచి ఆఫ‌ర్ స‌మ‌యంలో యూనిట్ ముఖ విలువకు కొనొచ్చు. లేదా మిగిలిన రోజుల్లో ఆ రోజు యూనిట్ ఎన్ఏవీ ధ‌ర‌కు కొనొచ్చు.

ప‌న్ను విధానం:

డెట్ ఫండ్ల ప‌న్ను విధానాన్నే ఎఫ్‌.ఓ.ఎఫ్‌ల‌కు అన్వ‌యించారు. కొన్ని ర‌కాల ఎఫ్‌.ఓ.ఎఫ్‌లు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపుచేసిన‌ప్ప‌టికీ ఆదాయ‌పు ప‌న్ను నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎఫ్‌.ఓ.ఎఫ్‌ల‌ను డెట్ ఫండ్ల కిందే వ‌ర్గీక‌రించారు. కాబట్టి ఎఫ్‌.ఓ.ఎఫ్‌ల‌తో ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొందాల‌నుకునేవారు వీటిని త‌మ పెట్టుబ‌డుల నుంచి త‌ప్పించ‌వ‌చ్చు. ఇక ప‌న్ను విధానం ఎలా ఉంటుందో చూద్దాం…

దీర్ఘ‌కాలిక మూలధ‌న ఆదాయం:

ఫండ్ల‌లో మూడుసంవ‌త్స‌రాలు పైన చేసిన పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే ఆదాయాన్ని దీర్ఘ‌కాల‌ మూల‌ధ‌న ఆదాయం గా ప‌రిగ‌ణిస్తారు. దీర్ఘ‌కాల‌ మూల‌ధ‌న ఆదాయం పై ఇండెక్సేష‌న్ తో క‌లిపి 20శాతం ప‌న్ను చెల్లించాలి.

స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న ఆదాయం:

ఈ ఫండ్ల‌లో మూడుసంవ‌త్స‌రాల కంటే త‌క్కువ కాలం చేసే పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే ఆదాయాన్నిస్వ‌ల్ప‌కాల‌ మూల‌ధ‌న ఆదాయం గా ప‌రిగ‌ణిస్తారు. స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి పై ఆయా వ్య‌క్తుల ఆదాయ‌పు ప‌న్ను శ్లాబుల‌ను బ‌ట్టి ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

రిస్క్ త‌క్కువ తీసుకునే మ‌దుప‌ర్ల‌కు ఇవి స‌రిప‌డ‌తాయి. అయితే ఛార్జీలు కొంచెం ఎక్కువ‌ ఉండ‌టం మూలంగా ఆ ప్ర‌భావం వ‌చ్చే రాబ‌డి పై ఉంటుంది. వివిధ ర‌కాల మ్యూచువ‌ల్‌ఫండ్ల‌లో మ‌దుపుచేసే వారు ఫండ్ ఆఫ్ ఫండ్స్ ను ఎంచుకోవ‌చ్చు. ఎందుకంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ లో మ‌దుపుచేయ‌డం ద్వారా చాలా ర‌కాల ఫండ్ల‌లో మ‌దుపుచేసిన‌ట్లవుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly