పిల్లలకు ఫండ్ల కానుక!

సరైన నిధిని ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచీ జాగ్రత్త తీసుకోవడమే మనం వారికిచ్చే విలువైన బహుమతి

పిల్లలకు ఫండ్ల కానుక!

పిల్లల అవసరాలను తీర్చేందుకు వారి చిన్నప్పటి నుంచే సరైన ప్రణాళికలతో సిద్ధం కావాలి. వారి భవిష్యత్తు అవసరాలు అన్నీ తీర్చేలా పొదుపు నిధి ఏర్పాటు చేయాలి. సంపాదించిన మొత్తంలో కచ్చితంగా కొంత పొదుపు చేయాలి. ఆ తర్వాత మిగిలిన దాన్నే ఖర్చు చేయాలనే సూత్రాన్ని విస్మరించకూడదు. కచ్చితమైన పొదుపు లక్ష్యం లేకపోతే… వృథా ఖర్చులకు డబ్బంతా వెళ్లిపోతుంది. కొన్నిసార్లు సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువైనా ఆశ్చర్యం లేదు. పిల్లల పుట్టిన రోజులకు ఖరీదైన విందులు, వారికి అంతగా అవసరం రాని ఖరీదైన వస్తువులు కొనడమే వారికి మంచి బహుమతి ఇచ్చినట్లు కాదు. వారు భవిష్యుత్తులో ఏ ఇబ్బందీ పడకుండా… సరైన నిధిని ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచీ జాగ్రత్త తీసుకోవడమే మనం వారికిచ్చే విలువైన బహుమతి. ఆర్థిక ప్రణాళికలో పిల్లల చదువులు, వారి వివాహం ఒక్కటే కీలకం కాదు. దీంతోపాటు అత్యవసర నిధి, సొంతిల్లు, పదవీ విరమణ ప్రణాళికలాంటి వాటికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే అనుకున్న సమయంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి సులభం అవుతుంది.

ముందుగా బీమాతో…

ఆర్థిక విషయాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయని అంశం బీమా. కుటుంబంలో ఆర్జించే వ్యక్తి పేరుమీద కచ్చితంగా బీమా పాలసీ ఉండాలి. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వివాహం, వారి ఇతర రోజువారీ ఆర్థిక లక్ష్యాలను కాపాడే విధంగా ఇది ఉండాలి. వారు తమంతట తాముగా ఆర్థికంగా నిలదొక్కుకునేంత వరకూ ఈ బీమా మొత్తం వారికి తోడుండాలి. దీనికోసం ఎంత మొత్తం బీమా తీసుకోవాలన్నది వ్యక్తులను బట్టి మారుతుంటుంది. ఈ లక్ష్యాలన్నీ పరిగణనలోనికి తీసుకొని, ఆ మేరకు బీమా తీసుకోవడం ఎప్పుడూ ఆచరణీయం.

రాబడికి హామీ ఉన్నా…

పొదుపు, పెట్టుబడులు అనగానే చాలామంది తమ డబ్బు సురక్షితంగా ఉండాలనే ఆలోచిస్తుంటారు. అందుకే, ఎక్కువగా రికరింగ్‌ డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు మొగ్గు చూపిస్తారు. ఇవి గతంలో 8-10% వరకూ రాబడి అందించాయి. అయితే, ప్రస్తుతం ఇవి 7-8% మించి వడ్డీనివ్వడం లేదు. వీటికన్నా మంచి బాండ్లు అధిక రాబడినిచ్చాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గుతున్న దశలో మంచి నాణ్యమైన బాండ్లలో మదుపు చేయడం ద్వారా అధిక రాబడితోపాటు, పెట్టుబడి వృద్ధికీ అవకాశం ఉంటుంది. అయితే, వీటిపై వచ్చే రాబడి పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు వీలు కల్పించకపోవచ్చు.

15 శాతం పైగానే…

పెరుగుతున్న చదువుల ఖర్చులను సమర్థంగా ఎదుర్కోవాలంటే… కాస్త నష్టభయం ఉన్నప్పటికీ అధిక రాబడినిచ్చే చోట మదుపు చేయడమే మార్గం. ఇందుకోసం ఈక్విటీల్లో మదుపు చేసేందుకు ప్రయత్నించొచ్చు. 1979 నుంచి ఇప్పటి వరకూ పరిశీలిస్తే… ఈక్విటీల వార్షిక సగటు వృద్ధి రేటు (సీఏజీఆర్‌) దాదాపు 12-15 శాతం వరకూ ఉంది. బంగారంలో ఇది 6-7 శాతం. (రూపాయి విలువ తగ్గడం వల్ల బంగారం విలువ డాలర్లతో పోలిస్తే రూపాయిల్లో అధికంగా కనిపిస్తోంది) గత 10-20 ఏళ్ల కాలంలో మంచి మ్యూచువల్‌ ఫండ్ల సీఏజీఆర్‌ 15-18 శాతం వరకూ ఉంది. స్థిరాస్తిలో ఎఫ్‌డీలు, ఆర్‌డీలకన్నా అధికంగానే రాబడి వచ్చినా… దీనికి కచ్చితమైన కొలమానం లేదు.

  • ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం! 20 ఏళ్ల క్రితం రూ.10,000 పెట్టుబడి పెట్టారనుకుందాం. ఈ మొత్తాన్ని 9శాతం వడ్డీ వచ్చేలా ఎఫ్‌డీలో జమ చేస్తే ఇప్పటికి అవి రూ.56,000 అయ్యేవి. బంగారం కొంటే దాని విలువ రూ.80,000. మంచి షేర్లు కొని ఉంటే… ఇప్పుడు దాదాపు రూ.1,78,500 చేతికి వచ్చేవి. ఇక మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెడితే… ఈ మొత్తం దాదాపు రూ. 2,70,500 వరకూ అయ్యేది. చూశారుగా… సంప్రదాయ పెట్టుబడులకన్నా… ఈక్విటీలు, ఫండ్లలో మదుపు చేయడం వల్ల ఎంత అధిక రాబడి వచ్చిందో.
  • గత రాబడులు భవిష్యత్తులోనూ పునరావృతం అవుతాయనే హామీ ఉండదనే పరిమితిని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి.

అవగాహనతో…

షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేప్పుడు వాటి గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. మంచి నాణ్యమైన ఫండ్లు, షేర్లు ఎంచుకోవాలి. అప్పుడే డబ్బు వృద్ధి చెందేందుకు వీలవుతుంది. దీర్ఘకాలంపాటు అధిక రాబడులు అందితేనే ఆర్థిక లక్ష్యాలను సులువుగా సాధించగలం. అయితే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే… షేర్లు, స్థిరాస్తులను అధిక ధరల వద్ద కొన్నప్పుడు నష్టభయం కూడా కాస్త అధికంగానే ఉంటుంది.

  • పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే వారికి అవసరమైన ఖర్చులను సమకూర్చడానికి మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు ప్రారంభించాలి. వీటి ద్వారా పరోక్షంగా షేర్లలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. మార్కెట్‌ను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం కూడా అంతగా ఉండదు. అంతేకాకుండా, క్రమశిక్షణతో మదుపు చేసే అలవాటూ అవుతుంది. పాటించాల్సిన నియమం ఏమిటంటే… లక్ష్యాన్ని చేరుకునే వరకూ పెట్టుబడులు ఆపొద్దు.

సమతౌల్యంగా…

మదుపు చేసేప్పుడు గమనించాల్సిన ముఖ్య విషయం… పెట్టుబడుల్లో సమతౌల్యం పాటించడం. నష్టభయం ఉన్న చోట రాబడికీ అవకాశం ఉంటుంది. భవిష్యత్తు కోసం మదుపు చేసేప్పుడు ఒకే పథకం ఎంచుకోవడం అంత మంచిది కాదనే చెప్పాలి. సురక్షిత పథకాల్లో రికరింగ్‌ డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, బాండ్లు, పీపీఎఫ్‌లాంటి వాటితోపాటు, ఎన్‌పీఎస్‌, బంగారం, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. వ్యక్తుల ఆర్థిక స్తోమతలు వేర్వేరుగా ఉంటాయి. అవసరాలూ, లక్షాలూ భిన్నంగా ఉంటాయి. కాబట్టి, వ్యక్తుల నష్టభయం భరించే సామర్థ్యం, అందుబాటులో ఉన్న వ్యవధి ఆధారంగా ఏ పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.

  • స్వల్పకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టాలనుకునేప్పుడు నష్టభయం ఉన్నవాటికి దూరంగా ఉండాలి. ఇలాంటప్పుడు ఆటుపోట్లు తక్కువగా ఉండే రికరింగ్‌ డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పరిశీలించాలి. వీటిలో పెట్టుబడికి తక్కువ నష్టభయం ఉంటుంది. స్థిరాదాయానికీ హామీ ఉంటుంది.
  • దీర్ఘకాలిక వ్యవధి ఉన్నప్పుడు కాస్త నష్టభయం ఉన్నప్పటికీ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, స్థిరాస్తుల్లో మదుపు చేసేందుకు ప్రయత్నించాలి. దీర్ఘకాలంలో ఇవి ఏ ఇతర పెట్టుబడి పథకాలతో పోల్చి చూసినా… మంచి రాబడిని ఇచ్చిన చరిత్ర ఉంది.

గమనించాల్సిన విషయం ఏమిటంటే… గతంలో మంచి రాబడి ఇచ్చిన పథకాలు… భవిష్యత్తులోనూ కచ్చితంగా అలాగే రాబడులు ఇస్తాయని ఆశించలేం. అయితే, దీర్ఘకాలం కొనసాగించినప్పుడు అధిక లాభాలనే అందిస్తాయని అనుకోవచ్చు.

ఖర్చుల లెక్కలు…

పిల్లల చదువుల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కాబట్టి, కేవలం ఇప్పటి లెక్కల ప్రకారమే పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం ఒక డిగ్రీ విద్యాభ్యాసానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందనుకుందాం. విద్యా ద్రవ్యోల్బణం ఏటా 8 శాతం చొప్పున ఉందని భావిస్తే… 20 ఏళ్ల తర్వాత దాపు రూ.19 లక్షల నుంచి రూ.24 లక్షల వరకూ కావాల్సి వస్తుంది. అందుకే, మున్ముందు పెరిగే ఖర్చులకు అనుగుణంగా ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly