దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు ఏ పెట్టుబ‌డులు ఎంచుకోవాలి?

ప్రారంభంలో త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి క్ర‌మంగా న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండే పెట్టుబ‌డులును చేర్చుకుంటూ వెళ్లాలి.

దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు ఏ పెట్టుబ‌డులు ఎంచుకోవాలి?

స్వ‌ల్ప‌కాలిక డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలో డ‌బ్బులు ఉంచుకోవ‌డం ద్వారా ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావంతో అస‌లు విలువ త‌గ్గుతుంది. దీర్ఘ‌కాలంలో మంచి వృద్ధిని సాధించ‌డం ద్వారా మూల‌ధ‌న వృధ్ధిని పొంది ఆర్థిక ల‌క్ష్యాన్ని సాధించాల‌ని కోరుకుకేవారు దానికి అనుగుణంగా వృద్ధి చెందేందుకు వీలుండే ఈక్విటీ పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి. వీటిలో గ్రోత్ ఆప్ష‌న్ ను ఎంపిక చేసుకోవ‌డం మంచిది. డివెండు ఆప్ష‌న్ ఉండే ప‌థ‌కాల‌ను కూడా ఎంచుకోకూడ‌దు. ఎందుకంటే ఎప్ప‌టిక‌ప్పుడు అవి ఆదాయాన్ని మ‌దుప‌ర్ల‌కు పంచుతుంటాయి. డివిడెండ్ ప‌థ‌కాల ద్వారా వ‌చ్చే రాబ‌డిని తిరిగి మ‌దుపుచేసే అల‌వాటు ఉంటే అది వృద్ధి చెందుతుంది. మార్కెట్లో ఉండే అస్థిరతను తొలగించలేం గానీ ఈక్విటీ వంటి న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండే పెట్టుబడులను దీర్ఘ‌కాలం పాటు క్ర‌మంగా మ‌దుపు చేయ‌డం ద్వారా దాని ప్రభావాన్నిత‌గ్గించుకోవ‌చ్చు. ఈ పెట్టుబడులు స్వల్పకాలంలో హెచ్చుత‌గ్గుల‌కు గురికావొచ్చు కానీ దీర్ఘకాలంలో పెట్టుబడుల పై అస్థిరత త‌గ్గుతుంది.

దీర్ఘ‌కాలం పాటు పెట్టుబ‌డిలు చేసేవారు మ‌ధ్య‌లో స‌మీక్షించుకోవాలి. త‌ద్వారా ఏవైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుంటుంది. దీని ద్వారా స‌రిగా రాణించ‌ని లేదా రాణించేందుకు అవ‌కాశం లేని పెట్టుబ‌డుల‌ను తొలిగించ‌వ‌చ్చు.

దీర్ఘకాల లక్ష్యాల కోసం పెట్టుబడి ప్రారంభించే ముందు, అవసరమైన అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. క‌నీసం 6 నెలల జీవన ఖర్చులు అత్యవసర నిధిగా ఉండాలి. దీర్ఘ‌కాలిక లక్ష్యం స‌మీపించే స‌మ‌యంలో హెచ్చుత‌గ్గుల‌ను త‌గ్గించుకోవ‌డానికి, నిధుల‌ను సుల‌భంగా పొందేందుకు వీలుగా ఉండే ఖాతాలోకి బ‌దిలీ చేయాలి.

దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు ఈక్విటీ , స్వ‌ల్ప‌కాల ల‌క్ష్యాల‌కు డెట్ రెండింటిని ఎంచుకోవాలి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి అనుగుణంగా పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ఎంపిక చేసుకుని పోర్టుఫోలియో నిర్మించుకోవాలి. అస్థిరత‌ను అధిగ‌మించే విధంగా పోర్టుఫోలియో ఆస్తి కేటాయింపును కలిగి ఉండాలి. కొంత భాగం సురక్షితమైన డెట్ పెట్టుబడులలో, కొంత భాగం వృద్ధి ఆధారిత ఈక్విటీ ప‌థ‌కాల‌లో పెట్టాలి.

కొత్త‌గా పెట్టుబ‌డులు చేసే వారు, ప్రారంభంలో త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి క్ర‌మంగా న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండే పెట్టుబ‌డులును చేర్చుకుంటూ వెళ్లాలి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం ఎంత ఉంద‌నేది అంచ‌నా వేసుకోవాలి. దీనికి పెట్టుబ‌డి స‌ల‌హాదారుని సంప్ర‌దించ‌డం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly