'హల్వా వేడుక' ఏంటి? ఎందుకు చేస్తారు?

నేడు లాంఛనంగా మొదలైన బడ్జెట్‌ ప్రతుల ముద్రణ

'హల్వా వేడుక'  ఏంటి? ఎందుకు చేస్తారు?

బడ్జెట్‌ 2020 ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుకను నేడు నార్త్‌ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ తయారు చేసిన హల్వాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు.

‘హల్వా వేడుక’ ఎందుకు.?

ప్రతిసారి బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో 'హల్వా వేడుక ’ నిర్వహిస్తారు. బడ్జెట్‌ సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్‌ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించరు. ఆర్థికశాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది ఈ క్రతువులో పాల్గొంటారు. బడ్జెట్‌ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయం బేస్‌మెంట్‌లో జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉండి పోతారు. ఈ ముద్రణ మొదలు కావడానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు. . బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు. బంధువులకు కూడా ఫోన్‌ చేసుకొనే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్‌ చేసుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly