వడ్డీ రేట్లను సవరించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

సవరించిన కొత్త వడ్డీ రేట్లు జులై 22 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది

వడ్డీ రేట్లను సవరించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు జులై 22 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై సంవత్సరానికి 3.50 శాతం నుంచి 7.30 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఏడు రోజుల నుంచి 20 రోజుల కాలపరిమితి గల డిపాజిట్లపై ప్రస్తుతం అందిస్తున్న 4.25 శాతం వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. 30 రోజుల నుంచి 6 నెలల వరకు, 6 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు, అలాగే దీర్ఘకాలిక పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ వెబ్‌సైట్ లో తెలిపింది.

30 నుంచి 45 రోజుల కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. గతంలో సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ రేటును అందించేది. అలాగే 46 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.25 శాతం నుంచి 6.00 శాతానికి బ్యాంకు తగ్గించింది.

ఒక సంవత్సరం మెచ్యూరిటీ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. జూలై 22 న చేసిన సవరణ అనంతరం, సాధారణ ప్రజలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7.10 శాతం చొప్పున వడ్డీని అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తోంది.

ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ వడ్డీ సవరణ అనంతరం బ్యాంకు 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. గతంలో ఇది 7.3 శాతంగా ఉంది.

ఐదు నుంచి పది సంవత్సరాల మెచ్యూరిటీ టర్మ్ డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లను పెంచింది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండు నుంచి మూడు సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్ల పై 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. గతంలో ఇది 7.4 శాతంగా ఉంది.

అలాగే మూడు నుంచి ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్ల పై వడ్డీ రేటును 7.25 శాతంగానే ఉంచింది. దీనిలో ఎలాంటి మార్పులు చేయలేదు.

అదే విధంగా ఐదు నుంచి పది సంవత్సరాల మెచ్యూరిటీ టర్మ్ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లను పెంచింది. ఈ దీర్ఘకాలిక డిపాజిట్లపై బ్యాంక్ 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఇతర బ్యాంకులు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లు ఈ నెలలోనే తమ ఎఫ్‌డీ రేట్లను సవరించిన విషయం తెలిసిందే.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly