హెచ్డీఎఫ్సీ లైఫ్ నుంచి మరో కొత్త పాలసీ..

ఇది ఒక నాన్ పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్

హెచ్డీఎఫ్సీ లైఫ్ నుంచి మరో కొత్త పాలసీ..

జీవిత బీమా పాలసీని తీసుకోవటానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ఒకవేళ ప్రమాదవశాత్తు మీరు మరణించినట్లైతే, మీ కుటుంబం ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి జీవిత బీమా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీవిత బీమా హామీ మొత్తంతో పాటు, మెచ్యూరిటీ తరువాత కచ్చితమైన ఆదాయం కూడా లభిస్తే?

సరిగ్గా ఇలాంటి బీమా ప్లాను నే ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రారంభించింది. దాని పేరు “సంచయ్ ప్లస్”, ఇది ఒక నాన్ పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్.

ఈ ప్లాన్ మీకు నాలుగు రకాల ఆప్షన్లను అందిస్తుంది. వాటిలో:

  1. గ్యారెంటెడ్ మెచ్యూరిటీ
  2. గ్యారెంటెడ్ ఇన్కమ్
  3. లైఫ్ లాంగ్ ఇన్కమ్
  4. లాంగ్ టర్మ్ ఇన్కమ్
  1. గ్యారెంటెడ్ మెచ్యూరిటీ ఆప్షన్ - ఈ ఆప్షన్ లో మీరు మెచ్యూరిటీ సమయంలో హామీ ఇచ్చిన మొత్తాన్ని పొందవచ్చు. ఇది మీరు చెల్లించిన వార్షిక ప్రీమియంకు 2.45 రెట్ల వరకు ఉంటుంది.

ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి రూ. 12.50 లక్షల హామీ మొత్తం కలిగిన జీవిత బీమా పాలసీని కొనుగోలు చేశాడని అనుకుందాం. దానికి గాను అతను సంవత్సరానికి రూ. లక్ష చొప్పున 10 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించినట్లైతే, మెచ్యూరిటీ సమయం (20 సంవత్సరాలు) తరువాత అతను రూ. 24 లక్షలను పొందుతాడు.

ఒకవేళ పాలసీ పీరియడ్ లో పాలసీదారుడు మరణించినట్లైతే, రూ. 12.50 లక్షలు (హామీ మొత్తం) + బోనస్ ను కుటుంబ సభ్యులు లేదా నామినీ పొందుతారు. ప్రీమియం చెల్లించే కాలవ్యవధి (ప్రీమియం పేయింగ్ టర్మ్) వరకు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించినట్లైతే, దీని పై రాబడి సుమారు 5.72 శాతంగా ఉండవచ్చు.

  1. గ్యారెంటెడ్ ఇన్కమ్ ఆప్షన్ - ఈ ఆప్షన్ ను ఎంచుకున్న పాలసీదారులు మెచ్యూరిటీ తర్వాత రెగ్యులర్‌గా ఆదాయాన్ని పొందొచ్చు. ఎంత కాలం పాటు రెగ్యులర్ గా ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవచ్చు.

ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి రూ. 12.50 లక్షల హామీ మొత్తం కలిగిన జీవిత బీమా పాలసీని కొనుగోలు చేశాడని అనుకుందాం. దానికి గాను అతను సంవత్సరానికి రూ. లక్ష చొప్పున 12 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించినట్లైతే, మెచ్యూరిటీ సమయం (13 సంవత్సరాలు) తరువాత అతను 12 సంవత్సరాల పాటు (14వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వరకు) సంవత్సరానికి రూ. 2.25 లక్షలను పొందుతాడు.

ఒకవేళ పాలసీ పీరియడ్ లో పాలసీదారుడు మరణించినట్లైతే, రూ. 16,11,162 + బోనస్ ను కుటుంబ సభ్యులు లేదా నామినీ పొందుతారు. ప్రీమియం చెల్లించే కాలవ్యవధి (ప్రీమియం పేయింగ్ టర్మ్) వరకు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించినట్లైతే, దీని పై రాబడి సుమారు 6.43 శాతంగా ఉండవచ్చు.

hdfc.png
  1. లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఆప్షన్ - మీరు పేఅవుట్ పీరియడ్ వరకు ప్రీమియం చెల్లించినట్లైతే, మెచ్యూరిటీ తరువాత 25 నుంచి 30 సంవత్సరాల పాటు రెగ్యులర్‌గా ఆదాయాన్ని పొందే అవకాశాన్ని ఈ ఆప్షన్ అందిస్తుంది. ఇది సీనియర్ సిటిజన్స్ కు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి రూ. 12.50 లక్షల హామీ మొత్తం కలిగిన జీవిత బీమా పాలసీని కొనుగోలు చేశాడని అనుకుందాం. దానికి గాను అతను సంవత్సరానికి రూ. లక్ష చొప్పున 10 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించినట్లైతే, మెచ్యూరిటీ సమయం (11 సంవత్సరాలు) తరువాత అతను 25 సంవత్సరాల పాటు (12వ సంవత్సరం నుంచి 36వ సంవత్సరం వరకు) సంవత్సరానికి రూ. 1.05 లక్షలను పొందుతాడు. దానితో పాటు 36వ సంవత్సరంలో ఒకేసారి రూ. 10 లక్షలను పొందుతాడు.

ఒకవేళ పాలసీ పీరియడ్ లో పాలసీదారుడు మరణించినట్లైతే, రూ. 12.50 లక్షలు (హామీ మొత్తం) + బోనస్ ను కుటుంబ సభ్యులు లేదా నామినీ పొందుతారు. ప్రీమియం చెల్లించే కాలవ్యవధి (ప్రీమియం పేయింగ్ టర్మ్) వరకు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించినట్లైతే, దీని పై రాబడి సుమారు 6.70 శాతంగా ఉండవచ్చు.

  1. లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఆప్షన్ - ఈ ఆప్షన్ మీకు 99 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు (గరిష్టంగా 39 సంవత్సల వరకు మాత్రమే) రెగ్యులర్‌గా ఆదాయాన్ని అందిస్తుంది.

ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి రూ. 10.50 లక్షల హామీ మొత్తం కలిగిన జీవిత బీమా పాలసీని కొనుగోలు చేశాడని అనుకుందాం. దానికి గాను అతను సంవత్సరానికి రూ. లక్ష చొప్పున 10 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించినట్లైతే, మెచ్యూరిటీ సమయం (11 సంవత్సరాలు) తరువాత అతనికి 99 సంవత్సరాలు వచ్చే వరకు (గరిష్టంగా పాలసీ కాల పరిమితి 39 సంవత్సల వరకు మాత్రమే) సంవత్సరానికి రూ. 1 లక్ష పొందుతాడు. దానితో పాటు 99వ సంవత్సరంలో(పాలసీ కాల పరిమితి గరిష్టంగా 39 సంవత్సల వరకు) ఒకేసారి రూ. 10 లక్షలను పొందుతాడు.

ఒకవేళ పాలసీ పీరియడ్ లో పాలసీదారుడు మరణించినట్లైతే, రూ. 11,06,900 + బోనస్ ను కుటుంబ సభ్యులు లేదా నామినీ పొందుతారు. ప్రీమియం చెల్లించే కాలవ్యవధి (ప్రీమియం పేయింగ్ టర్మ్) వరకు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించినట్లైతే, దీని పై రాబడి సుమారు
6.70 శాతంగా ఉండవచ్చు.

ఈ జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడం ద్వారా ఆదాయ పన్ను ప్రయోజనాలను పొందడంతో పాటు, పాలసీ ఆధారంగా రుణం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దానికి కొన్ని నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది.

చివరి మాట:
ఇటువంటి పాలసీలను తీసుకోవడం ద్వారా మీరు ఎక్కువ ప్రీమియంను చెల్లించి తక్కువ హామీ మొత్తాన్ని పొందుతారు. దానితో పాటు రాబడులు కూడా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీకు జీవిత బీమా కావాలని అనుకుంటే, టర్మ్ ప్లాన్ లను ఆన్లైన్లో ఎంచుకోవడం మంచిది. అలాగే, మీ ఆర్ధిక లక్ష్యాల కోసం పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్లు, ఎన్పీఎస్(పదవీ విరమణ కోసం) లాంటివి ఎంచుకోవచ్చు. అదే స్వల్ప కాలం కోసం అయితే రికరింగ్ డిపాజిట్ లలో పెట్టుబడి పెట్టవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly