అద్దెకుండేవారు టీడీఎస్ ఇలా మినహాయించుకోవాలి!

నెల‌కు రూ.50వేల‌కు మించి అద్దెచెల్లించేవారు టీడీఎస్ మిన‌హాయించుకొని ఎలా క‌ట్టాలో చూద్దాం.

అద్దెకుండేవారు టీడీఎస్ ఇలా మినహాయించుకోవాలి!

నెల‌కు రూ.50వేల‌కు మించి అద్దె చెల్లించేవారు… అద్దెలో టీడీఎస్ మిన‌హాయించుకొని ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు చెల్లించాలి. 2017 జూన్ 1 నుంచి ఈ నిబంధ‌న వ‌ర్తించేలా ఆర్థిక చ‌ట్టంలో స‌వ‌ర‌ణ చేశారు.

అద్దె చెల్లించేవారి సౌక‌ర్యార్థం కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల‌ బోర్డు(సీబీడీటీ) జూన్ 8 తేదీతో కూడిన‌ నోటిఫికేష‌న్ ద్వారా కొత్త ఫారంల‌ను ప‌రిచ‌యం చేసింది.

అద్దెలో మిన‌హాయించుకున్న ప‌న్నును ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు డిపాజిట్ చేసేందుకు కొత్త ఫారంల‌ను ఉప‌యోగించాలి. యాజ‌మానికి ఇచ్చేందుకు టీడీఎస్ చెల్లించినట్టుగా స‌ర్టిఫికెట్ ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ జారీచేస్తుంది.

ఒక వేళ మీరు అద్దె చెల్లిస్తుంటే ఈ విష‌యాల‌ను గుర్తుంచుకోవాలి…

 • నెల‌కు రూ.50వేల‌కు మించి అద్దె చెల్లిస్తుంటే ప‌న్ను మిన‌హాయించుకోవాలి.
 • యాజ‌మాని పాన్ సంఖ్య ఇస్తే ఒక నెల‌ అద్దెలో 5శాతం టీడీఎస్ కింద మిన‌హాయించాలి.
 • ఒక వేళ యాజ‌మాని పాన్ సంఖ్య ఇవ్వ‌క‌పోతే… ఎక్కువ మొత్తంలో టీడీఎస్ మిన‌హాయించాలి. అయితే ఇది గ‌డ‌చిన ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి నెల‌లో చెల్లించిన మొత్తం అద్దెను మించ‌రాదు.
 • మామూలుగా ఎప్పుడు అద్దె చెల్లిస్తే అప్పుడే టీడీఎస్ క‌ట్టాలి. అయితే ఈ సంద‌ర్భంలో సంవ‌త్స‌రానికి ఒక సారి లేదా అద్దె ఇల్లు ఖాళీ చేసి వెళ్లేట‌ప్పుడు క‌ట్టాలి.
 • అద్దెకుండేవారిపై భారం త‌గ్గించేందుకు ట్యాక్స్ డిడ‌క్ష‌న్ ఖాతా సంఖ్య‌(టాన్‌) పొందాల్సిన అవ‌స‌రం లేదు.

టీడీఎస్ 30 రోజుల్లోగా క‌ట్టాలి

 • అద్దెలో టీడీఎస్ మిన‌హాయించుకున్న 30రోజుల్లోగా ఆదాయ‌పు ప‌న్ను శాఖ వ‌ద్ద‌ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
 • 26QC ఫారంను ఆన్‌లైన్‌లో ఫైలింగ్ చేసి డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఇ-ట్యాక్స్ చెల్లింపు వెబ్‌సైట్‌లో ఈ ఫారం త్వ‌ర‌లో అందుబాటులోనికి వ‌స్తుంది.
 • 26QC ఫారంను నింపేట‌ప్పుడు…అద్దెకుండేవారి వివ‌రాలు, య‌జ‌మాని వివ‌రాలైన పేరు, పాన్ సంఖ్య‌, చిరునామా, మొబైల్ నంబ‌రు, ఇ-మెయిల్ అడ్ర‌స్ లాంటివి న‌మోదుచేయాలి.
 • 26QC ఫారంలో నింపాల్సిన ఇత‌ర వివ‌రాలు: అద్దెకుండేవారి సంఖ్య‌, అద్దెకున్న కాలవ్య‌వ‌ధి, చెల్లించిన అద్దె విలువ‌, టీడీఎస్ గా మిన‌హాయించుకున్న సొమ్ము, తేదీ, వ‌డ్డీ, ఫీజు, చెల్లింపు విధానం లాంటి వివ‌రాల‌న్నీ రాయాల్సి ఉంటుంది.

యాజ‌మానికి ఫారం 16 ఇవ్వాలి

 • పన్ను చెల్లించి, ఫారం 26QC స‌మ‌ర్పించాక‌, టీడీఎస్ మిన‌హాయించుకున్న‌ట్టు ధ్రువీక‌రించే ఫారం 16ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప‌న్ను చెల్లింపుదారుకు అవ‌కాశం వ‌స్తుంది.
 • ఈ ఫారం 16ను యాజ‌మానికి 15రోజుల్లోగా ఇవ్వాలి.
 • ఈ ఫారం 16లో ప‌న్ను చెల్లించిన‌వారి పేరు, చిరునామా, పాన్ సంఖ్య‌. యాజ‌మాని పేరు, చిరునామా, పాన్ సంఖ్య త‌దిత‌ర వివ‌రాలు ఉంటాయి. దీంతో పాటు ఎంత ప‌న్ను మిన‌హాయించుకున్నారు, ఎంత డిపాజిట్ చేశారు, ప‌న్ను చెల్లింపు తేదీ త‌దిత‌ర వివ‌రాలు ఉంటాయి.

టీడీఎస్ డిపాజిట్ చేయ‌క‌పోతే జ‌రిమానా

 • టీడీఎస్ మిన‌హాయించుకోక‌పోయినా, స‌రైన స‌మ‌యంలో టీడీఎస్‌ను డిపాజిట్ చేయ‌క‌పోయినా జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది.
 • టీడీఎస్ మిన‌హాయించ‌క‌పోతే నెల‌కు 1శాతం జ‌రిమానా ప‌డుతుంది.
 • మిన‌హాయించుకున్నాక ప‌న్నును డిపాజిట్ చేయ‌క‌పోతే 1.5శాతం జ‌రిమానా ప‌డుతుంది.
 • టీడీఎస్ రిట‌ర్నుల‌ను ఆల‌స్యంగా దాఖ‌లుచేస్తే రోజుకు రూ.200 పెనాల్టీ ప‌డుతుంది. ఇది కాకుండా మొత్తం రూ.10వేల నుంచి రూ.1ల‌క్ష దాకా పెనాల్టీ ప‌డ‌వ‌చ్చు.
 • పెనాల్టీ కాకుండా ప‌న్ను ఎగ‌వేత‌దారులకు కారాగార శిక్ష ప‌డేందుకు అవ‌కాశం ఉంది.
 • 3 నెల‌ల‌కు త‌క్కువ కాకుండా ఏడేళ్ల‌కు మించ‌కుండా కారాగార శిక్ష ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

(Source: LiveMint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly