ఫిక్సిడ్ మెచ్యూరిటీ ప్లాన్లలో మ‌దుపు చేయోచ్చా?

ఫిక్సిడ్ మెచ్యూరిటీ ప్లాన్లలో మ‌దుప‌ర్లు ఇండెక్షేష‌న్ ద్వారా ప‌న్ను ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు

ఫిక్సిడ్ మెచ్యూరిటీ ప్లాన్లలో మ‌దుపు చేయోచ్చా?

ఫిక్సిడ్ మెచ్యూరిటీ ప్లాన్‌లు (ఎఫ్ఎమ్‌పీ) నిర్దిష్ట కాలపరిమితి తో కూడిన క్లోజెడ్ ఎండెడ్‌ డెట్ ఫండ్లు. ఈ ఫండ్ నిర్వాహ‌కులు స్వ‌ల్ప న‌ష్ట‌భ‌యం ఉన్నపెట్టుబ‌డులైన స్థిరాదాయ ప‌థ‌కాలు మొద‌లైన వాటిలో మ‌దుపు చేస్తాయి. ఎఫ్ఎమ్‌పీల‌ కాలపరిమితికి అనుగుణంగానే ఆయా పెట్టుబ‌డుల కాలపరిమితి కూడా ఉంటుంది. వీటిలో పెట్టుబడి పై నష్టం తక్కువ ఉంటుంది. పిక్సిడ్ మెచ్యూరిటీ ప్లాన్ ల ప్రధాన ఉద్దేశ్యం నిర్ణీత కాలానికి స్థిరమైన రాబడిని ఆర్జించ‌డం. ఈ ప్లాన్ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి పెట్టుబడిదారులను రక్షిస్తుంది. ఫండ్ హౌస్ ఒక నిర్దిష్ట కాలంపాటు కొత్త ఫండ్ ఆఫర్ తో వస్తుంది. ఆ స‌మ‌యంలో మ‌దుప‌ర్లు పెట్టుబడులు పెట్టవచ్చు. ఇవి నిర్ణీత కాల‌ప‌రిమితిని క‌లిగి ఉంటాయి. వీటి కాల‌ప‌రిమితి 30 రోజుల నుంచి అయిదు సంవత్సరాలు వరకు ఉంటుంది. ఫిక్సిడ్ మెచ్యూరిటీ ప్లాన్ లు ప్రధానంగా వాణిజ్య పత్రాలు (సీపీ), సర్టిఫికేట్ ఆఫ్‌ డిపాజిట్ల (సీడీ), కార్పోరేట్ బాండ్లు, మనీ మార్కెట్ సాధనాలు, ప్రభుత్వ జారీ సెక్యూరిటీలు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్ సి డి) వంటి స్థిరమైన ఆదాయం అందించే సాధ‌నాల్లో పెట్టుబడి పెడ‌తాయి. ఇవి క్లోజ్ ఎండెడ్ ఫండ్లు కాబ‌ట్టి కొత్త ఫండ్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే పెట్టుబ‌డులు చేసే అవ‌కాశ‌ముంటుంది. అదేవిధంగా మెచ్యూరిటీ కంటే ముందు విత్‌డ్రా చేసేందుకు వీలుండ‌దు. అయితే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో విక్ర‌యించేందుకు వీలుంటుంది.

ఎఫ్ఎంపీలు సాధారణంగా సర్టిఫికెట్ అఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, మనీ మార్కెట్ పధకాలు, AAA కార్పొరేట్ బాండ్లు లాంటి పథకాల్లో మదుపు చేస్తాయి. ఈ పథ‌కాల కాలవ్యవధి ముగిసే వరకు ఎఫ్ఎంపీలు వాటిలో మదుపు చేస్తాయి. దీని కారణంగా కాల పరిమితి ముగిసే ముందు పెట్టుబడి ని వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. డీమ్యాట్ ఖాతా ద్వారా యూనిట్ల‌ను ఎక్స్ఛేంజీలో విక్ర‌యించే స‌దుపాయం ఉంది. కాక‌పోతే వీటికి లిక్విడిటీ త‌క్కువ‌గా ఉంటుంది.

ఫిక్సిడ్ డిపాజిట్ల తో పోలిస్తే ఎఫ్ఎంపీ లు పన్ను పరంగా మేలైన‌వి. ముఖ్యంగా 30 శాతం పన్ను స్లాబ్ లో ఉన్న వారికి ప‌న్ను ఆదా అవుతుంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌చ్చే ఆదాయం, డిపాజిట్‌దారుడి ఆదాయానికి క‌లిపి మొత్తం ఏ శ్లాబులోకి వ‌స్తుందో అంత ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు. ఎఫ్ఎంపీ ల‌లో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం వీటిని కొన‌సాగిస్తే దీర్ఘ‌కాలిక మూలధ‌న రాబ‌డి ప‌రిగ‌ణిస్తారు. దీర్ఘ‌కాలిక మూలధ‌న రాబ‌డిపై ఇండెక్సేష‌న్ వల్ల పన్ను తగ్గే అవకాశం ఉంది. చాలా వరకు ఎఫ్ఎంపీ లు కనీసం 3 ఏళ్ళ కాల పరిమితితో ఉంటాయి. 3 ఏళ్ళ వరకు డబ్బు అవసరం ఉండ‌ద‌ని భావిస్తే వీటిలో మదుపు చేయవచ్చు.

ఇండెక్సేన్‌తో క‌లిపి 20 శాతం ప‌న్ను ప‌డుతుంది. ఇండెక్సేష‌న్ అంటే ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మిన‌హాయించిన త‌ర్వాత వ‌చ్చే రాబ‌డిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. అంటే మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఎఫ్ఎమ్‌పీల‌లో పెట్టుబ‌డులు చేసిన‌వారికి ద్ర‌వ్యోల్బ‌ణ స‌ర్దుబాటు చేసిన త‌రువాత‌ వ‌చ్చిన రాబ‌డిపై ప‌న్ను ప‌డుతుంది. అన్ని స్థిరాదాయ పెట్టుబ‌డుల్లో ఉన్న‌ట్లే ఎఫ్ఎమ్‌పీల్లో కూడా క్రెడిట్ రిస్క్ ఉంటుంది. మ‌దుప‌ర్లు వీటిలో పెట్టుబ‌డులు పెట్టేముందు, సెక్యూరిటీల‌ రేటింగ్ తెలుసుకునేందుకు ఆఫ‌ర్ డాక్యుమెంట్‌ను ప‌రిశీలించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly