మ‌దుప‌ర్లు పాటించాల్సిన నియ‌మాలు

పెట్టుబ‌డి చేసేముందు కొన్ని ప్రాథ‌మిక విష‌యాల‌ను పాటించ‌డం ద్వారా న‌ష్టం రాకుండా నివారించ‌వ‌చ్చు.

మ‌దుప‌ర్లు పాటించాల్సిన నియ‌మాలు

ఆర్ధిక విషయాల గురించి శ్ర‌ధ్ద వ‌హించే మ‌దుప‌ర్లు త‌మ ఆర్థిక భద్రతకు సంబంధించిన విష‌యాల్లో నియ‌మాలు పాటిస్తారు. న‌ష్ట‌భ‌యం త‌గ్గించుకునేందుకు పొదుపులను వేర్వేరు తరగతుల ఆస్తులకు కేటాయిస్తారు. అయితే ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించినా, ఒక్కోసారి పెట్టుబ‌డి నిర్ణయాలు పోర్ట్ఫోలియో పై ప్ర‌భావం చూపించ‌వ‌చ్చు. పెట్టుబడి సంబంధిత విష‌యాల‌ను మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి.

సాధారణంగా వ్యక్తి వయసు, ఆదాయం, పెట్టుబడులతో ఉన్న అనుభవం,రాబడులను అర్థం చేసుకోవడం, సదరు పెట్టుబడి పథకాలపై అవగాహన, సరైన నిర్ణయం తీసుకోగల నేర్పును బట్టి ఉంటుంది. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి స‌రిపోయే పెట్టుబ‌డి సాధ‌నాన్ని ఎంచుకోవాలి. త‌క్కువ న‌ష్ట భ‌యం ఉన్న వారు స్థిరాదాయ ప‌థ‌కాల్లో మ‌దుపుచేయ‌డం మంచిది. నష్టాన్ని త‌ట్టుకునే వారు ఈక్విటీ సంబంధిత ప‌థ‌కాల్లో మ‌దుపుచేయోచ్చు. ఈ ప‌థ‌కాల ఎంపిక‌లో స‌మ‌తుల్య‌త‌ను
పాటించ‌డం ద్వారా మ‌దుప‌ర్లు ల‌బ్ధిని పొంద‌వ‌చ్చు. స‌రైన పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకోక‌పోతే న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

పెట్టుబ‌డుల విష‌యంలో మ‌దుప‌ర్ల వ‌య‌సు ప‌రిగ‌ణలోకి తీసుకోవాలి. న‌ష్టాన్ని భ‌రించ‌గ‌ల సామ‌ర్థ్యం వ‌య‌సుతో ముడిప‌డి ఉంటుంది. యుక్త వ‌య‌సులో ఉండే వారు కొంచెం న‌ష్ట‌భ‌యం ఎక్కువున్న వాటిలో మ‌దుపుచేసినా ప‌ర‌వాలేదు. ఎందుకంటే ఒక వేళ న‌ష్టం వ‌చ్చినా తిరిగి స‌ంపాదించేందుకు వారికి అవ‌కాశం, వ‌య‌సు ఉంటాయి. అదే ప‌ద‌వీవిర‌మ‌ణ పొందిన‌ వారు లేదా మ‌ధ్య‌వ‌య‌స్కులు న‌ష్ట‌భ‌యం త‌క్కువున్న సాధానాలు ఎంచుకోవ‌డం మంచిది. వీరికి న‌ష్టం వ‌స్తే తిరిగి సంపాదించుకునే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది.

మదుపుచేసే ముందు కుటుంబ ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. మ‌న‌పై ఆధార‌ప‌డే వారు ఉంటే న‌ష్ట భ‌యం త‌క్కువ‌గా ఉన్న సాధ‌నాల‌ను ఎంచుకోవాలి. పెళ్లి కాక ముందు యువ‌కులుగా ఉన్న‌పుడు , ఆర్థిక అవ‌స‌ర‌రాలు త‌క్కువ‌గా ఉన్న‌పుడు కొంత న‌ష్ట‌భ‌యం క‌లిగిన‌పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపుచేసినా ప‌ర‌వాలేదు. పెట్టుబడి లక్ష్యాలు, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాన్ని సాధించే కాలవ్యవధి పెట్టుబడిదారుపై ప్రభావం చూపించే అంశాలు. ఈక్విటీ త‌ర‌హా ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి కాలవ్యవధి ఎక్కువగా ఉంటే న‌ష్ట‌భ‌యం క్ర‌మంగా త‌గ్గుతుంది. దీర్ఘ‌కాలంలో పెట్టుబడుల్లోఒడిదుడుకులను సమన్వయపర్చుకోవచ్చు.

అన్నింటి కంటే ముఖ్యంగా పెట్టుబ‌డి చేసే ముందు మదుప‌ర్ల‌కు ఆయా సాధ‌నాల‌పై అవ‌గాహ‌న చాలా అవ‌స‌రం. పెట్టుబ‌డుల పై స‌రైన అవ‌గాహ‌న ఉంటే స‌మ‌యానికి స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చు. దీంతో న‌ష్టం వ‌చ్చే సంద‌ర్భాల్లో స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రించేందుకు అవకాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly