వాహ‌న పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

పాలసీ వ్యవధి తీరాక పునరుద్దరణ చేసుకునేప్పుడు కొన్ని విషయాలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలి

వాహ‌న పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

మోటారు వాహనాల చట్టం ప్రకారం రోడ్డు మీద తిరిగే ప్రతి వాహనానికీ కచ్చితంగా బీమా పాలసీ ఉండాల్సిందే. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మన మీద ఆర్ధిక భారం పడకుండా వాహన బీమా ఆదుకుంటుంది. అయితే, పాలసీ ని పునరుద్ధరించుకునే ప్రతి సారీ మనకు అనుకూలమైన, అన్ని విధాలా ప్రయోజనాన్ని ఇస్తున్న సంస్థ నుంచి బీమా తీసుకుంటున్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. దానికి ముందు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

కొత్తగా వాహనం కొన్నప్పుడు అన్ని వివరాలను పూర్తిగా పరిశీలించకుండానే పాలసీ తీసుకుంటాం. తొందరలో కాస్త ప్రీమియం అధికంగా చెల్లించే సందర్భాలూ ఉంటాయి. కానీ, పాలసీ వ్యవధి తీరాక పునరుద్దరణ చేసుకునేప్పుడు కొన్ని విషయాలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలి. మీ వాహన బీమా గడువు దగ్గరకు వస్తున్నా సమయంలో అన్ని సంస్థల పాలసీలను పరిశీలించండి. ఏ పాలసీ ఏ విధమైన రక్షణ ఇస్తోంది? రాయితీలు ఏమున్నాయి? పరిమితులు ఏమున్నాయి? ప్రయోజనాలేమిటి? మినహాయింపులు తదితరాలను పోల్చి చూసుకోవాలి. దీని వల్ల మర్కెట్ లో ఉన్న వివిధ పాలసీల గురించి తెలుసుకోవడం తో పాటు, మీ బీమా సంస్థ మీకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించింది, వీటిని వదిలేసింది అన్న విషయాలను తెలుసుకోవచ్చు. ఇందులో అధిక లాభాలు ఉన్న సంస్థ నుంచి బీమా పాలసీ ని కొనుగోలు చేయవచ్చు.

పాలసీ వ్యవధి ముగియడానికి గడువు సమీపించే నెల రోజుల ముందు నుంచే బీమా సంస్థలు మిమ్మల్ని సంప్రదించడం ప్రారంభిస్తాయి. కొత్త సంస్థ మీరు పాలసీ తీసుకోవాలనీ, పాత సంస్థ మిమ్మల్ని వదులుకోవద్దనీ చూస్తుంటాయి. కాబట్టి, ఇప్పటికే పాలసీ ఉన్న బీమా సంస్థ కు మీరు తెలుసుకున్న విషయాలు తెలియజేయండి. ఎంత మేరకు రాయితీలు ఇవ్వగలరో ఆరా తీయండి. ఒకవేళ మీకు ఒక్క క్లెయిమ్ కూడా లేకపోతే నో క్లెయిమ్ బోనస్ తో పాటు పలు రాయితీలు ఇవ్వడం వల్ల ప్రీమియం తగ్గే అవకాశాలు ఉంటాయి.

కేవలం తక్కువ ప్రీమియంకి పాలసీ ఇవ్వడం, ఏదో చిన్న ప్రయోజనాలు చూపించడం వల్ల పాల‌సీ ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారిస్తే ఉపయోగం ఉండదు. మిమ్మల్ని పాలసీ తీసుకునేలా ప్రోత్సహించేందుకు అప్పటికప్పుడు కొన్ని మాటలు చెప్పవచ్చు. ఇందుకోసం దాని ఆర్ధిక పరిస్థితిని గమనించడం, క్లెయిమ్ చరిత్ర ను పరిశీలించడం లాంటివి చేయాలి. సామజిక మాధ్యమాలైన పేస్ బుక్, ట్విట్టర్ లో సంస్థ పేజీలను పరిశీలించండి. ఇప్పటికే పాలసీ తీసుకున్న వారి అభిప్రాయాలను చూడడం వల్ల అవగాహన ఏర్పడుతుంది.

మీరు పాలసీ తీసుకోబోయే సంస్థకు 24*7 సేవలు అందించే విధంగా సేవ కేంద్రం ఉందా లేదా చూసుకోండి. అత్యవసరం ఎప్పుడు ఏ రూపం లో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఏదైనా వివరాలు కావాల్సి వచ్చినప్పుడు తెలియజేయడానికి సంస్థ నుంచి ఎవరూ ఉండకపోతే ఇబ్బందే. కొన్ని సంస్థలు ఆన్లైన్ లో సేవలు అందిస్తుంటాయి, అలాగే కొన్ని మొబైల్ అప్లికేషన్ల రూపం లో కూడా ఉంటాయి. ఇలాంటి ఏర్పాట్లు ఉన్న సంస్థలు ఏవో చుడండి. ఎందుకంటే, రోడ్డు మీద బండి ఆగిపోయినప్పుడు వెంటనే ఆ వివరాలను, ఫోటోలను సంబంధిత అప్లికేషన్ లో నమోదు చేసే వీలు ఉంటే పాలసీదారులకు అనుకూలంగా ఉంటుంది. దీనితో పాటు క్లెయిమ్ సందర్భాల్లో మనకు ఇచ్చే పరిహారం ఏ విధంగా ఇస్తారో కూడా కనుక్కోవాలి.

పాలసీ పునరుద్ధరణ సరైన సమయం లో జరగాలి. ఆలస్యం అయితే ఇబ్బందులు, ఇతర నిబంధనలు తప్పవు. వీలైనంత ముందుగానే పాలసీ ని పునరుద్ధరించుకోవాలి. సాధారణంగా మీరు ముందు ప్రీమియం చెల్లించడం లో తప్పు లేదు, ఎందుకంటే గత పాలసీ ముగిశాకనే కొత్త పాలసీ మొదలు అవుతుంది. బీమా పాలసీ కు సంబంధించిన అన్ని పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. వీలయితే ఈమెయిల్ లో ఉంచినట్లయితే అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉంటాయి. క్లెయిమ్ పరంగా ఇబ్బందులు ఉంటే కంపెనీ వారు మీకు సహాయం చేస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly