వివిధ పరిస్థితుల్లో హెచ్ఆర్ఏ ను క్లెయిమ్ చేసుకోవడం ఎలా?

ఆర్థిక సంవత్సరం మధ్యలో ఇల్లు మారేవారికి, అలాగే ఇంటి నుండి దూరంగా వెళ్లి ఉద్యోగం చేసే యువతకు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు

వివిధ పరిస్థితుల్లో హెచ్ఆర్ఏ ను క్లెయిమ్ చేసుకోవడం ఎలా?

ఉద్యోగుల వేతనంలో హౌస్ రెంట్ అలవెన్సు (హెచ్ఆర్ఏ) అనేది ఒక భాగం. హెచ్ఆర్ఏ మినహాయింపు పొందేందుకు, మీ ఇంటి యజమాని నుంచి అద్దె రసీదులు లేదా అద్దె ఒప్పందాన్ని తీసుకుని, దానిని మీరు పనిచేస్తున్న సంస్థకు సమర్పించాలి. ఒకవేళ మీరు సంవత్సరానికి రూ. లక్ష కంటే ఎక్కువ అద్దెను చెల్లిస్తున్నట్లైతే, ఇంటి యజమాని పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) ని నమోదు చేయడం తప్పనిసరి. అయినప్పటికీ, హెచ్ఆర్ఏ పై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి అంత సులువైన విషయం కాదు. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఇల్లు మారేవారికి, అలాగే ఇంటి నుండి దూరంగా వెళ్లి ఉద్యోగం చేసే యువతకు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు. హెచ్ఆర్ఏ పై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునేటప్పుడు, ఉద్యోగం చేసే యువత ఎదుర్కొనే మూడు సందర్భాలను కింద తెలియచేయడం జరిగింది.

  1. నెలవారీ అద్దె రూ. 8,333 కంటే ఎక్కువ ఉండి, వార్షిక అద్దె చెల్లింపు మాత్రం రూ. లక్ష కంటే తక్కువ ఉన్నప్పుడు మీరు ఇంటి యజమాని పాన్ ను నమోదు చేయాలా?

మీరు తల్లిదండ్రులతో నివసిస్తూ, ఆర్ధిక సంవత్సరం మధ్యలో ఉద్యోగ రీత్యా వేరొక నగరానికి వెళ్లి స్వంతంగా నివసిస్తూ ఉన్నారనుకుంటే, అప్పుడు మీరు నెలకు రూ. 8,333 కంటే ఎక్కువ అద్దె చెల్లించాలి.

సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) ప్రకటన ప్రకారం, ఒకవేళ ఉద్యోగి చెల్లించే అద్దె సంవత్సరానికి రూ. లక్ష కంటే ఎక్కువ ఉంటే, ఉద్యోగి తాను ఉంటున్న ఇంటి యజమాని పాన్ ను సంస్థకు సమర్పించడం తప్పనిసరి. అదే వార్షిక అద్దె రూ. లక్ష మించకపోతే, అప్పుడు ఇంటి యజమాని పాన్ ను సమర్పించాల్సిన అవసరం లేదని tax2win.in సీఈఓ అభిషేక్ సోని తెలిపారు.

  1. స్నేహితులతో కలిసి నివసిస్తున్నప్పుడు

ఒకవేళ మీరు స్నేహితులతో నివసిస్తూ, అద్దె ను షేర్ చేసుకుంటున్నట్లైతే, స్పష్టంగా నిర్వచించిన అద్దె ఒప్పందం మీకు సహాయం చేస్తుంది. దీనికోసం, మీరు అద్దె ఒప్పందాన్ని పొందండి, దానిలో మీతో పాటు నివసిస్తున్న అందరి పేర్లను, అందరు కలిసి చెల్లిస్తున్న అద్దె మొత్తాన్ని కూడా నమోదు చేయండి. ఒకవేళ ఇలాంటి ఒప్పందం లేకపోతే, మీరు చెల్లిస్తున్న అద్దె మొత్తాన్ని పేర్కొనే ఒక డిక్లరేషన్ ను ఇంటి యజమాని నుంచి పొందండి. ఇది మీకు సహాయం చేస్తుంది.

హెచ్ఆర్ఏ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అద్దె రసీదులు, అద్దె ఒప్పందాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ మీరు స్నేహితులతో ఉంటూ, అద్దెను షేర్ చేసుకుంటున్నట్లైతే, మీతో పాటు నివసిస్తున్న అందరి స్నేహితుల పేర్లను అద్దె ఒప్పందంలో, అద్దె రసీదులలో కూడా నమోదు చేయడం మంచిది. అలాగే మీరు చెక్కు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అద్దె చెల్లించడం మంచిది, ఎందుకంటే ఇది రుజువుగా పనిచేస్తుందని సోని తెలిపారు.

  1. ఉద్యోగం కోసం వేరొక ప్రదేశానికి మారడం, అలాగే ఒక ఆర్ధిక సంవత్సరంలో రెండు లేదా మూడుసార్లు ఇల్లు మారినప్పుడు

ఆర్ధిక సంవత్సరం చివరిలో సమిష్టిగా అద్దె రశీదులను పొందడానికి బదులుగా, ప్రతి నెలా వాటిని పొందడం ఇలాంటి సందర్భంలో మీకు సహాయపడుతుంది. ఇలాంటి సందర్భంలో ఉద్యోగి ఇద్దరు ఇంటి యజమానులకు అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వార్షిక అద్దె రూ. లక్ష కంటే ఎక్కువ చెల్లిస్తున్నట్లైతే, ఇద్దరి పాన్ లను కలిగి ఉండడం మంచిది. హెచ్ఆర్ఏ ను క్లెయిమ్ చేసుకోడానికి, అద్దె రసీదులు, అద్దె ఒప్పందాన్ని కలిగి ఉండడం తప్పనిసరి. ముందుగా చెప్పినట్లుగా, చెక్కు ద్వారా లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా అద్దె చెల్లింపు చేయడం మంచిది.

ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు ఢిల్లీలో 6 నెలల పాటు నివసించి, నెలకు రూ. 10,000 చొప్పున అద్దె చెల్లించి, అనంతరం పూనేలో మరో 6 నెలల పాటు నివసించి, నెలకు రూ. 5000 అద్దె చెల్లించారని అనుకుందాం, దీని అర్ధం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం అద్దె రూ. 90,000 (రూ. 60,000 + రూ. 30,000). అంటే మీరు చెల్లించే అద్దె రూ. లక్ష కంటే తక్కువ కావున మీరు యజమాని పాన్ ను సమర్పించాల్సిన అవసరం లేదు.

అదే, మీరు ఒక ఆర్ధిక సంవత్సరంలో ఢిల్లీలో 6 నెలల పాటు నివసించి, నెలకు రూ .15,000 చొప్పున అద్దె చెల్లించి,అనంతరం మిగిలిన ఆరు నెలలు పూణేలో నివసించి, నెలకు రూ. 10,000 అద్దె చెల్లించారని అనుకుందాం, దీని అర్ధం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం అద్దె రూ. 1.5 లక్షలు (రూ. 90,000 + రూ. 60,000). అంటే మీరు చెల్లించే అద్దె రూ. లక్ష కంటే ఎక్కువ కావున మీరు ఇద్దరు యజమానుల పాన్ ను సమర్పించడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly