క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగుప‌రుచుకుందాం...

రుణాల మంజూరుకు క్రెడిట్ స్కోరు ప్రామాణికం. స్కోరు మెరుగుద‌ల‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లేమిటో చూద్దాం

క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగుప‌రుచుకుందాం...

సొంత ఇంటి క‌ల సాకారానికి సామాన్యులు చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ ఉండ‌దు. ఎవ‌రి సంపాదన, ఆర్థిక సామర్థ్యాన్ని బ‌ట్టి ఇల్లు కొనడమో, కట్టించుకోవడమో చేస్తుంటారు. చేతిలో త‌గినంత‌ డబ్బు లేకపోయినా రుణం తీసుకొని మ‌రీ ఇల్లు కొనేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. గృహ రుణం తీసుకునేందుకు ప్ర‌య‌త్నించేవారికి బ్యాంకుల నుంచి ఎదుర‌య్యే ప్ర‌థ‌మ ప‌రీక్ష‌ క్రెడిట్‌ స్కోర్ లెక్క‌లు. ఎందుకంటే ఈ క్రెడిట్ స్కోరునే ప్రామాణికంగా బ్యాంకులు ప‌రిగ‌ణిస్తాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ స్కోర్‌ను మరింతగా మెరుగుపరుచుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

రుణ చ‌రిత్ర పై శోధ‌న‌

దరఖాస్తుచేయగానే రుణం రావ‌డం అంత సుల‌భం కాదు. రుణ దరఖాస్తును బ్యాంకులు క్షుణ్ణంగా ప‌రిశీలిస్తాయి. ప్రస్తుతం క్రెడిట్‌బ్యూరోల వద్ద అందరి రుణ చరిత్ర ఉంటోంది. అందులో ఇంతకుముందు ఆ వ్యక్తి చేసిన రుణ దరఖాస్తులు, రుణ చెల్లింపుల్లో తప్పులు వంటివి ఉంటాయి. దాని ఆధారంగానే బ్యాంకులు ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. ఒక్కోసారి తెలియకుండానే రుణ చరిత్ర మీద ఊహించని చెడు ప్రభావం ఉంటుంది. అప్పుడు ఒక క్రమ పద్ధతిలో రుణ చరిత్ర నివేదికను మార్చుకోవడం, క్రెడిట్‌ స్కోర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నించాలి.

నివేదిక‌లోని పొర‌పాట్లు- స‌రిదిద్దుకునే చ‌ర్య‌లు

ఒక్కోసారి రుణ సంస్థలు అప్పు మొత్తం తీర్చేసిన తర్వాత కూడా దాని గురించి క్రెడిట్‌ బ్యూరోకు సమాచారం అందించి ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని రుణ చరిత్ర నివేదికలను చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు ఆ విషయాన్ని రుణ సంస్థ ద్వారా క్రెడిట్‌ బ్యూరోకు చెప్పించి అప్‌డేట్‌ చేయించాలి. ఇంకా వేరే ఎవరో ఖాతాను మన నివేదికతో అనుసంధానించి ఉండొచ్చు. అలాంటప్పుడు క్రెడిట్‌ బ్యూరోకు అన్ని ఆధారాలు అందజేసి మీ నివేదికలో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులను వాడటం ద్వారా బిల్లులను సకాలంలో చెల్లించడంలో జాప్యం జరగొచ్చు. క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లింపుల్లో చిన్న చిన్న లోపాల కారణంగా క్రెడిట్‌ స్కోర్‌ తక్కువ అవుతుంది. అందువల్ల తప్పదు అనుకుంటే ఒకటే క్రెడిట్‌ కార్డు వాడాలి. బిల్లు చెల్లింపులను గడువుతేదీలోపు చెల్లించాలి.

ప్ర‌యోగాలు వ‌ద్దు

క్రెడిట్‌ స్కోర్‌ సరిగా ఉండదని భావించేవారు దాన్ని మెరుగుప‌రుచుకునేందుకు ప్ర‌యోగాలు చేస్తుంటారు. అప్పుడు వ్యక్తిగత రుణం తీసుకుని చెల్లించేయడం వల్ల క్రెడిట్‌ స్కోర్‌ పెంచుకోవచ్చని ఎవ‌రో తెలియ‌న‌వారు సలహా ఇవ్వ‌వ‌చ్చు. ఇది కేవలం అపోహ మాత్రమే. మీ సంపాదన, ఆర్థిక సామర్థ్యం వంటి పలు అంశాల ఆధారంగా బ్యాంకులు రుణం ఇవ్వడం గురించి ఆలోచిస్తాయి. అందులో క్రెడిట్‌ స్కోర్ కేవ‌లం ఒక అంశం మాత్రమే. అందుకే అనవసరంగా రుణం తీసుకోకపోవడమే మంచిది.

చింత వ‌ద్దు … ప‌రిష్కారం దిశ‌గా ఆలోచ‌న సాగించేయి!

మీకు ప్రాముఖ్యత తెలియని కారణంగా క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందని చింతించాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో చెల్లించకుండా ఉండిపోయిన క్రెడిట్‌ కార్డు బిల్లులను , ఈఎమ్‌ఐలను వీలైనంత తొందరగా చెల్లించేయాలి. చెల్లింపు గడువులోపే భవిష్యత్తు ఈఎమ్‌ఐలను క్రమం తప్పకుండా చెల్లించాలి. ఒక్కోసారి గడువులోపు రుణం చెల్లించనందువల్ల మీ క్రెడిట్‌స్కోర్‌ పై ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు కొత్త రుణాలను తీసుకోక‌పోవ‌డం మంచిది. ప్రస్తుత బాకీల‌ను తీర్చడంపైనే దృష్టి కేంద్రీకరించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly