క్రెడిట్ కార్డులు ఎంత వరకు ఉపయోగకరం?

కావాల్సిన వస్తువులను సులభంగా కొనుగోలు చేయొచ్చనే విశ్వాసాన్ని క్రెడిట్ కార్డులు అందిస్తాయి

క్రెడిట్ కార్డులు ఎంత వరకు ఉపయోగకరం?

ప్రజల జీవన విధానంలో చాలా మార్పు వచ్చింది. ప్రజలు వారికి నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడానికి, వారాంతంలో రెస్టారెంట్లు, సినిమాలకు వెళ్ళడానికి కొంచం కూడా సంకోచించడం లేదు. కానీ, కొన్నిసార్లు ఇవన్నీ నెలవారీ బడ్జెట్లో సరిపోకపోవచ్చు. దానికి క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, హ్యాండ్ లోన్స్ మొదలైనవి ప్రత్యామ్నాయంగా మారతాయి.

క్రెడిట్ కార్డులు చాలా రకాలుగా సహాయపడతాయి. వాటిని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, అలాగే కావాల్సిన వస్తువులను సులభంగా కొనుగోలు చేయొచ్చనే విశ్వాసాన్ని అందిస్తాయి. అలాగే క్రెడిట్ కార్డులకు 50 రోజుల వడ్డీ రహిత సమయం ఉండడం, పూర్తి మొత్తానికి బదులుగా కనీస మొత్తం చెల్లించే అవకాశం, మిగిలిన బకాయి మొత్తాన్ని వచ్చే నెలకు బదలాయించుకోవడం, బ్యాలెన్స్ బదిలీ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కో-బ్రాండింగ్, డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్స్ వంటి వివిధ ఫీచర్స్ తో క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డులతో ఉన్న నిజమైన ప్రయోజనం ఏమిటంటే, బయటికి వెళ్ళేటప్పుడు మీతో పాటు పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

తక్కువ ఖర్చులతో ఎక్కువ ప్రయోజనం పొందడానికి కింద తెలిపిన పాయింట్లు మీకు సహాయపడతాయి :

  • మీ పని, ఆదాయం ఆధారంగా క్రెడిట్ కార్డును నిర్వహిస్తున్నారని నిర్ధారించుకోండి.
  • ఎక్కువ క్రెడిట్ కార్డులు మీ నెలవారీ బడ్జెట్ పై ప్రతికూల ప్రభావం చూపి, ఎక్కువ ఖర్చు చేసే విధంగా మిమ్మల్ని ప్రలోభపెడతాయి.
  • క్రెడిట్ కార్డు మొత్తం క్రెడిట్ పరిమితిలో గరిష్టంగా 35 నుంచి 40 శాతం వరకు మాత్రమే వినియోగించడం మంచిది.
  • వడ్డీ రహిత కాలవ్యవధిని సద్వినియోగం చేసుకోవడానికి గడువు తేదీకి ముందే బిల్లు మొత్తాన్ని చెల్లించాలి.
  • అధిక వ్యయం చేయకుండా ఉండడానికి ముందుగానే కొనుగోళ్ల జాబితాను రూపొందించండి.
  • మీరు కార్డును ఉపయోగించినా, ఉపయోగించకపోయినా ప్రతి కార్డుకు వార్షిక రుసుము చెల్లించాలి.
  • ఒక కార్డు నుంచి మరొక కార్డుకు బ్యాలెన్స్ బదిలీ చేసినట్లయితే, అదనంగా ప్రాసెస్ ఛార్జీలను చెల్లించాలి.
  • ఏ కారణం చేతనైనా, చెల్లించాల్సిన మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోతే వడ్డీ, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒకవేళ పెనాల్టీ ఛార్జీలు రూ. 1000 అనుకుంటే, అది మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది.

ఒకవేళ మీ వయస్సు 30 సంవత్సరాలు అనుకుంటే, మీరు 10 సంవత్సరాలకు గాను రూ. 1000 పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయానికి మీరు రూ. 2160 (@ 8 శాతం రాబడి), రూ. 2600 (@ 10 శాతం రాబడి), రూ. 3100 (@ 12 శాతం రాబడి) పొందుతారు.

అదేవిధంగా, కింది పట్టికలో మీ పెట్టుబడి రూ. 1,000 కాలక్రమేణా ఎలా పెరుగుతుందో గమనించవచ్చు.

returnsP.png

ముగింపు :

కేవలం ఒక్క క్రెడిట్ కార్డును కలిగి ఉండటం, దానిని పరిమితంగా ఉపయోగించడం, క్రెడిట్ కార్డు బిల్లులను గడువు సమయంలోగా చెల్లించడం మిమ్మల్ని తెలివిగల, బాధ్యతాయుతమైన వ్యక్తిగా చేస్తుంది.

మీరు తీసుకునే రుణ వడ్డీ రేటుపై చెడ్డ క్రెడిట్ స్కోరు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మీరు ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయని ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకోవడం అంత మంచి విషయం కాకపోవచ్చు.

పైన తెలిపిన విధంగా అనవసర ఖర్చులను నివారించడం, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భవిష్యత్తులో ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly