ట్రావెల్ కార్డును ఎంచుకుంటున్నారా?
ట్రావెల్ కార్డు ప్రయాణానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది.
ప్రయాణాలు చేసేవారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్రావెల్ కార్డును తయారు చేశారు. ఇది కూడా ఒక క్రెడిట్ కార్డులానే ఉంటుంది. అయితే సాధారణ క్రెడిట్ కార్డులో రివార్డులను క్యాష్‌బ్యాక్ లేదా పాయింట్ల రూపంలో ఇస్తుంది. ఈ పాయింట్లను గిఫ్ట్ కార్డులు, వ్యాపారాల వద్ద డిస్కౌంటుల రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు. ట్రావెల్ క్రెడిట్ కార్డు ఇందుకు భిన్నింగా ప్రయాణానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కార్డులు రెండు రకాలుగా లభ్యమవుతాయి. ఒకటి కో-బ్రాండెడ్, మరొకటి నాన్ కో- బ్రాండెడ్. సాధారణంగా కో-బ్రాండెడ్ ట్రావెల్ కార్డులో అధికంగా రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లను భాగస్వామ్య ట్రావెల్ బ్రాండ్లు వద్ద మాత్రమే ఉపయోగించాలి. మీరు ఒకే ట్రావెల్ బ్రాండ్‌కి కట్టుబడి ఉంటే ఈ కార్డును తీసుకోవడం మంచిది. నాన్ కో-బ్రాండెండ్ ట్రావెల్ కార్డులు ప్రయాణ ఖర్చులపై అధిక ప్రయోజనాలను అందిస్తాయి. రివార్డు పాయింట్లను సంపాదించేందుకు ఒక మంచి ఎంపిక. ఈ పాయింట్లను భాగస్వామ్య బ్రాండ్లలో మాత్రమే కాకుండా ఇతర ఎయిర్‌లైన్స్, హోటల్స్‌లోనూ రీడీమ్ చేసుకోవచ్చు. ఈ కార్డులు పాయింట్లను గానీ ప్రయాణమైళ్ళను గానీ ఆఫర్ చేస్తాయి. వీటిని ప్రయాణ రిజర్వేషన్లకు గానీ, ప్రయాణానికి సంబందించి ఇతర అంశాలకు గానీ ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా నీర్ణీత సమయంలో, నిర్థిష్ట మొత్తాన్ని ఖర్చుపెట్టిన వారికి మాత్రమే రివార్డు పాయింట్లు లేదా మైళ్ళను సంపాదించవచ్చు. రివార్డు పాయింట్లను లేదా మైళ్ళను, ఎయిర్‌లైన్స్, భాగస్వామ్య హోటల్స్, కొన్ని వర్గాల వ్యాపార సంస్థల వద్ద కొనుగోళ్ళు చేయడం ద్వారా సంపాదించవచ్చు.
ఎలా ఎంచుకోవాలి?
మీకు ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి సులభంగా ట్రావెల్ కార్డును పొందవచ్చు. అయితే అన్నిసార్లు ఇది మంచి ఎంపిక కాకపోవచ్చు. మీ ప్రయాణ అలవాట్లను పరిగణలోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి. కార్డు తీసుకునేందుకు అయ్యే ఖర్చులు, వార్షిక రుసుములు తనిఖీ చేసుకోవాలి. నో-ఫ్రిల్ కార్డులు తప్ప మిగిలిన కార్డులు జాయినింగ్ ఫీజు, వార్షిక రుసములతో వస్తాయి. మీరు కార్డును తీసుకునే ముందు కార్డుకు చెల్లించే రుసములకు తగినట్లుగా ప్రయోజనాలు పొందగలుగతారా… అనేది చూసుకోవాలి. మీరు ప్రయాణాలకు ఎక్కువ ఖర్చు చేసేవారైతే వార్షిక రుసుములను మించి రివార్డు పాయింట్లు పొందితే మీకు ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే రివార్డు పాయింట్ల కంటే చెల్లించే రుసములు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కార్డును తీసుకునే ముందు కార్డును ఉపయోగించి ఎంత వరకు ఖర్చుచేస్తే బోనస్ పాయింట్లు వస్తాయి, ఎంత సమయంలోపల ఖర్చు చేయాలి అనే విషయాలను పరిగణలోకి తీసుకోండి.
మీరు మామూలుగా ప్రయాణించినప్పడు అయిన ఖర్చుకంటే కార్డును ఉపయోగించి చేసే ప్రయాణ ఖర్చు ఎక్కువగా ఉందని అనిపిస్తే, కార్డును తీసుకోవడం మంచిది కాదు. క్రెడిట్ కార్డును విదేశాలలో ఉపయోగించేందుకు అయ్యే విదేశీ ద్రవ్య మార్క్ప్ ఫీజు, విదేశీ లావాదేవీల రుసుములు, నగదు విత్‌డ్రా రుసుములు తెలుసుకోవాలి. విదేశీ లావాదేవీల మొత్తం విలువపై 1.5 శాతం నుంచి 3.5 శాతం వరకు చార్జీలు వర్తిస్తాయి. విత్‌డ్రాలకు ప్రామాణిక విత్‌డ్రా రేటుతో పాటుగా అదనంగా 1 నుంచి 4 శాతం రుసుములు ఉంటాయి.
కార్డుతో చేసే ఖర్చు, వార్షిక రుసుములు, క్యాష్ బ్యాక్ రివార్డు పాయింట్లను, కార్డును ఉపయోగించకుండా ప్రయాణం చేస్తే అయ్యే ఖర్చును పోల్చి చూడాలి. విదేశీ లావాదేవీలకు ఫీజు వర్తించని ట్రావెల్ కార్డును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే విదేశీ లావాదేవీలకు ఎక్కువ రివార్డు పాయింట్లు లభిస్తాయి. అందువల్ల వీటి ద్వారా లభించే రివార్డు పాయింట్ల కంటే వాటికయ్యే రుసుములు ఎక్కువగా ఉంటే ప్రయోజనం తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
ప్రయాణికులకు ట్రావెల్ కార్డులు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తుంటాయి. కానీ వినియోగదారులు కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ ప్రయాణ అవసరాలకు ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది అని చూసుకోవాలి. మీరు తరుచుగా ప్రయాణం చేసేవారు కాకపోతే, ప్రయాణ రివార్డుల పట్ల ఆసక్తి లేకపోతే కార్డును తీసుకోకపోవడమే మంచిది. ట్రావెల్ కార్డులు తీసుకునేందుకు, నిర్వహణ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల వాటికి అయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకోవాలి. ట్రావెల్ కార్డును తీసుకునేప్పుడు దానికి అయ్యే ఖర్చు, దాని వల్ల కలిగే ప్రయోజనాలను పోల్చి చూడాలి. మీ కార్డును ఉపయోగించి చేసిన ప్రయాణ ఖర్చులను సరైన సమయంలో చెల్లించలేకపోతే కార్డుల నుంచి దూరంగా ఉండడం మంచిది. దీనికి బదులుగా చార్జీలు లేని క్రెడిట్ కార్డును తీసుకుని సరైన పద్ధతిలో ఉపయోగించండి.
Comments
0