క్రెడిట్ కార్డు దుర్వినియోగ‌మైందా? ప‌రిష్కారం ఇదిగో!

క్రెడిట్ కార్డు మోసాల‌కు గురైనవారు బాధ‌ప‌డుతూ కూర్చోకుండా.. ఆ సమస్యను పరిష్కరించుకోవడం, భవిష్యత్తులో సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు దుర్వినియోగ‌మైందా? ప‌రిష్కారం ఇదిగో!

క్రెడిట్ కార్డుల వాడ‌కం ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. క్రెడిట్ కార్డు మోసాల‌కు గుర‌వుతున్న‌వారి సంఖ్య నానాటికీ పెరుగుతుందే త‌ప్ప త‌ర‌గ‌డం లేదు. మోసాల‌పై ఎంత అవ‌గాహ‌న పెరిగినా ఎక్క‌డో ఓ చోట త‌ప్పిదం జ‌రుగుతూనే ఉంటుంది. క్రెడిట్ కార్డు మోసాల‌కు పాల్ప‌డే వాళ్లు కొంగొత్త‌ సాంకేతిక‌లను ఔపోస‌న ప‌ట్టి మ‌రీ రంగంలోకి దిగుతున్నారు . బ్యాంకులు వినియోగ‌దారుల ర‌క్ష‌ణ కోసం చాలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ నేర‌గాళ్లు కొత్త మార్గాల‌ను అన్వేషిస్తూ స‌మ‌స్య‌ను మ‌రింత జ‌టిల‌త‌రం చేస్తున్నారు. క్రెడిట్ కార్డు దుర్వినియోగం జ‌రిగిన‌ప్పుడు వినియోగ‌దారులు ఏం చేయాలో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు దుర్వినియోగం అయితే ఇలా చేయండి

బ్లాక్ చేయించండి

క్రెడిట్ కార్డు దుర్వినియోగమైంద‌న్న‌ విష‌యాన్ని ఫోన్ ద్వారా వెంట‌నే బ్యాంకుకు తెలియ‌ప‌ర‌చాలి. ఈ-మెయిల్ లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. మీ కార్డును చివ‌ర‌గా ఎక్క‌డ,ఎందుకు ఉప‌యోగించారు, ఎంత మొత్తానికి క్రెడిట్ కార్డులో లావాదేవీ జ‌రిపారు అనే విష‌యాన్ని బ్యాంకు సిబ్బందికి వెల్ల‌డించాలి.

ఎస్ఎమ్ఎస్ ద్వారా

క్రెడిట్ కార్డు కంపెనీ ఓ ప్ర‌త్యేక ఫోన్ నంబ‌రును కేటాయిస్తుంది. క్రెడిట్ కార్డు దుర్వినియోగానికి గురైతే ఈ నంబ‌రుకు సంక్షిప్త సందేశం పంప‌డం ద్వారా కార్డును బ్లాక్ చేసే వీలు క‌ల్పిస్తున్నారు. క్రెడిట్ కార్డును జారీ చేసిన కంపెనీ వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన మ‌న‌ ఫోన్ నంబ‌రు నుంచే ఈ సంక్షిప్త సందేశం పంపాలి. అప్పుడే కార్డు బ్లాక్ అవుతుంది.

వెబ్‌సైట్లో అభ్య‌ర్థ‌న‌

చాలా బ్యాంకులు వెబ్‌సైట్లో క్రెడిట్ కార్డు బ్లాక్ చేయించేందుకు అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. దాంతో పాటు బ్లాక్ చేయాల్సిన కార్డు వివ‌రాల‌ను కంపెనీ అధికారికి మెయిల్ ఐడీకి ఈ-మెయిల్ చేయాలి. వివాద‌స్ప‌ద లావాదేవీకి సంబంధించి జ‌రిగిన చెల్లింపులు తిరిగి పొందాలంటే జ‌రిగిన విష‌యానికి సంబంధించిన రుజువుల‌ను క్రెడిట్ కార్డు కంపెనీకి అందించాలి. ఒక‌వేళ ఆ లావాదేవీ కార్డుదారుడి ప్ర‌మేయం లేకుండా జ‌రిగిన‌ట్లు రుజువైతే స‌ద‌రు మొత్తాన్ని కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. ఇంట‌ర్నెట్ , మొబైల్ బ్యాంకింగ్ చేసేవారికి కార్డు బ్లాక్ చేసే అవ‌కాశం అందులోనే ఉంటుంది.

ఫిర్యాదు త‌ర్వాత ఏం జ‌రుగుతుంది?

బ్యాంకును, ఫిర్యాదు స‌మ‌స్య లోతు, మోసం జ‌రిగిన ప్రాంతాన్ని బ‌ట్టి ప‌రిష్కారం పొందేందుకు వారం నుంచి కొన్ని నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఆర్‌బీఐ నియమ నిబంధ‌న‌ల ప్ర‌కారం బ్యాంకులు నెల రోజుల్లోపు స‌మ‌స్యను ప‌రిష్క‌రించాలి.

న‌గ‌దును తిరిగి పొందుతామా?

మ‌నం ఉన్న న‌గ‌రం ఒక‌టి, లావాదేవీ మ‌రో న‌గ‌రంలో జ‌రిగి ఉంటే న‌గ‌దును తిరిగి పొందేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌. అందుకు త‌గిన భౌతిక ఆధారం ఏదైనా ఉంటే మీ వాద‌న‌కు బ‌లం చేకూరుతుంది.  క్రెడిట్ కార్డు ద్వారా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్‌) వ‌ద్ద‌ జ‌రిపిన‌ లావాదేవీ సుర‌క్షిత‌మైన‌ది కాకపోయి ఉంటే బ్యాంకు 7 రోజుల్లోపు న‌గ‌దును తిరిగి చెల్లిస్తుంది. పీవోఎస్ భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిన బాధ్య‌త బ్యాంకుల‌దే.

బ్యాంకులు స‌రైన రీతిలో స్పందించ‌న‌ప్పుడు…

క్రెడిట్ కార్డు మోసాల‌కు గురైన విష‌యాన్ని వెల్ల‌డించినా… స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌డంలో బ్యాంకులు జాప్యం చేస్త‌న్న‌ట్లుగా వినియోగ‌దారులు భావిస్తే బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదు చేయాలి. బ్యాంక్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా మోసం జ‌రిగి ఉంటే వినియోగ‌దారునికి న్యాయం జరిగే అవ‌కాశం ఎక్కువ‌.  అంబుడ్స్‌మెన్‌కు మెయిల్ , ఫ్యాక్స్, ఉత్త‌రం ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. మొద‌టి ద‌శ‌లో మీ స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే ఆర్‌బీఐ అప్పిలేట్ అథారిటీ దృష్టికి తీసుకుపోయే అవ‌కాశం ఉంటుంది.

క్రిమిన‌ల్ కోర్టు:

క్రిమిన‌ల్ కోర్టుకు వెళ్ల‌డం లేదా సైబ‌ర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌డం చివ‌రి అవ‌కాశంగా ప‌రిగ‌ణించాలి.

పై అన్ని ద‌శ‌లు దాటినా మీరు సంతృప్తి చెంద‌క‌పోతే మీకు జ‌రిగిన మోసాన్ని సంబంధిత సామాజిక అనుసంధాన వేదిక‌ల‌(ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌) పేజీల ద్వారా చ‌ర్చించ‌వ‌చ్చు. ఇది ప్ర‌స్తుతం అన్నింటికంటే స్పంద‌న ల‌భిస్తుంద‌న్న మాధ్య‌మంగా ఉంటోంది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ల‌లో వినియోగ‌దారులు చేసే వ్యాఖ్య‌లను బ్యాంకులు సీరియ‌స్‌గా తీసుకుంటున్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly