పండుగ బోస‌స్ వ‌చ్చిందా...

బోన‌స్‌ను కేవ‌లం వినోదం, ఖ‌ర్చులు కోసం మాత్ర‌మే కాకుండా కొంత భాగాన్ని ఆర్థిక ల‌క్ష్యాల కోసం కేటాయించ‌డం మంచిది

పండుగ బోస‌స్ వ‌చ్చిందా...

దీపావ‌ళి పండుగ వ‌చ్చేసింది. స్వీట్స్‌తో పాటు మ‌రో ట్రీట్‌గా వ‌స్తుంది. అదే పండుగ బోన‌స్‌. దీంతో ఆర్థికంగా కొంత బ‌రోసా దొరుకుతుంది. బోన‌స్ అనేది జీతంలో ఒక భాగ‌మ‌ని గుర్తించుకోండి. ఈ మొత్తాన్ని పూర్తిగా వినోదం కోస‌మే ఖ‌ర్చుచేయ‌కుండా కొంత భాగాన్ని ఆర్థిక ల‌క్ష్యాల వైపు మ‌ళ్ళించ‌డం మంచిది. అధిక వ‌డ్డీతో కూడిన రుణాల‌ను చెల్లించ‌డం ద్వారా కొంత ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గృహ కొనుగోలుకు డౌన్‌పేమెంట్ స‌మ‌కూర్చుకునేందుకు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

బోన‌స్‌ను ఏ విధంగా ఉప‌యోగించ్చు…అనేది ఇప్పుడు చూద్దాం…
అవ‌స‌రానికి మించి కొంత మొత్తం మ‌న వ‌ద్ద అధికంగా ఉన్నా ఆమొత్తాన్ని ఆర్థిక ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డి పెట్టేందుకు దొరికిన గొప్ప అవ‌కాశంగా భావించాలి. మీ బోన‌స్‌లో కొంత భాగాన్ని ఏ ఆర్థిక ల‌క్ష్యం చేరుకునేందుకు త‌క్కువ స‌మ‌యం ఉందో… దాని కోసం కేటాయించాల‌ని స్రుజ‌న్ ఫైనాన్స్ అడ్వైజ‌ర్స్ ఎల్ఎల్‌పీ వ్య‌వ‌స్థాప‌కుడు, భాగ‌స్వామి దీపాలి సేన్ తెలిపారు.

బకాయిలు చెల్లించండి:
ఏమైనా చెల్లించ‌వ‌ల‌సిన రుణాల వాయిదాలు పెండింగ్‌లో ఉంటే వాటిని చెల్లించ‌డం ద్వారా మీ బోస‌న్‌ను స‌రైన విధంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. ప్ర‌త్యేకించి అధిక వ‌డ్డీతో కూడిన రుణాల‌ను ముందుగా చెల్లించాలి. మీరు తీసుకున్న రుణాల‌న్నింటిని వాటి వ‌డ్డీ రేట్ల క్ర‌మంలో అమ‌ర్చి, అధిక వ‌డ్డీతో కూడిన రుణాల‌ను చెల్లించ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు, క్రెడిట్ కార్డుతో తీసుకున్న రుణాల‌కు వ‌డ్డీ రేటు అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల మొద‌ట‌గా క్రెడిట్ కార్డు బ‌కాయిల‌ను చెల్లించ‌వ‌చ్చు. ఆ త‌రువాత ఇత‌ర రుణాల‌ను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ చెల్లించ‌వ‌చ్చు. ఇది మీ క్రెడిట్ సామ‌ర్ధ్యాన్ని పెంచుతుంది. మీ రుణాలు చెల్లించిన తర్వాత, మిగిలు మొత్తాన్ని ఇత‌ర ఖ‌ర్చులు లేదా పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు.

భవిష్యత్తు కోసం పెట్టుబడులు:
కావ‌ల‌సిన దానికంటే ఎక్కువ మొత్తం మీ వ‌ద్ద ఉన్న‌ప్పుడు, ఆ మొత్తాన్ని భ‌విష్య‌త్తు ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డి పెట్టేందుకు ల‌భించిన గొప్ప అవ‌కాశంగా భావించ‌వ‌చ్చు. బోన‌స్‌లో కొంత భాగాన్ని త‌క్కువ స‌మ‌యంలో పూర్తిచేయ‌వ‌ల‌సిన ఆర్థిక ల‌క్ష్యాల కోసం కేటాయించ‌డం మంచిందని దీపాలి సేన్ అన్నారు.

మీ పెట్టుబ‌డి, ఎంచుకునే ల‌క్ష్యానికి అనుగుణంగా ఉండాలి. మీ ల‌క్ష్యాల‌ను స్వ‌ల్ప, దీర్ఘ కాలిక ల‌క్ష్యాలుగా విభ‌జించి అందుకు త‌గిన‌ట్లుగానే పెట్టుబ‌డిని కూడా భాగాలుగా చేసుకోవాలి. మీ బోన‌స్‌లో 30 నుంచి 40 శాతం స్వ‌ల్ప కాలిక పెట్టుబ‌డులు(విదేశీ యాత్ర‌, రెండు లేదా మూడు సంవ‌త్సారాల‌లో ఇంటి కొనుగోలు కోసం డౌన్‌పేమెంట్ సిద్ధం చేసుకునేందుకు)కు ఉప‌యోగించ‌డం మంచిది. స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల కోసం డెట్ ఫండ్లు మంచి ఎంపిక‌. ఇవి అధిక ద్ర‌వ్య‌తతో పాటు, స్థిర‌మైన రాబ‌డిని అందిస్తాయి. ప‌ద‌వీ విర‌మ‌ణ లేదా పిల్ల‌ల విద్య వంటి దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం డైవ‌ర్సిఫైడ్ ఈక్వీటీ ఫోర్ట్‌ఫోలియోలో మ‌దుపు చేయ‌వ‌చ్చు. ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్లు దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని అందిస్తాయి. సంప‌ద వృద్ధికి ఆద‌ర్శ‌ వంత‌మైన పెట్టుబ‌డి మార్గ‌మ‌ని జైన్ తెలిపారు.

భ‌విష్య‌త్తు కోసం అత్య‌వ‌స‌ర నిధి:
ప‌రిస్థితులు ఎప్పుడూ ఎలా ఉంటాయో మ‌నం అంచనా వేయ‌లేము. ఆర్థికంగా ఎదుర‌య్యే ఒడిదుడుకుల‌కు మనం ఎల్ల‌ప్పుడు సిద్ధంగా ఉండాలి. అక‌స్మాత్తుగా ఉద్యోగం కోల్పోయినా లేదా కుటుంబ స‌భ్యుడు అనారోగ్యానికి గురైన మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ప‌డ‌చ్చు. అందువ‌ల్ల అత్య‌వ‌స‌ర‌నిధి ఏర్పాటు చేసుకోవ‌డం చాలా ముఖ్యం. ఇందులో క‌నీసం ఆరు మాస‌ముల ఖ‌ర్చుల‌కు స‌రిపోయే మొత్తం ఉండేలా చూసుకోవాలి. ఒక‌వేళ మీకు అత్య‌వ‌స‌ర నిధి లేక‌పోతే మీ బోన‌స్‌ను ఉప‌యోగించి నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక‌వేళ మీకు ఇప్ప‌టికే అత్య‌వ‌స‌ర నిధి ఉంటే, బోన‌స్‌లో కొంత భాగాన్నిటాప్ అప్ కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఇంటి డౌన్‌పేమెంట్ వంటి కోసం మీరు ఇప్ప‌టికే పొదుపు చేస్తుంటే వాటికి అద‌న‌పు నిధిని చేకూర్చేందుకు బోన‌స్ స‌హాయ‌ప‌డుతుంది. మీ రెగ్యుల‌ర్ అవ‌స‌రాలు, ఖ‌ర్చుల కోసం బోన‌స్‌ను డిజైన్ చేయ‌లేద‌ని గుర్తించుకోవాలి.

బ‌హుమ‌తులు:
పండుగ‌ల వేళ బ‌హుమ‌తులు ఇవ్వ‌డం మ‌న సాంప్ర‌దాయంలో ఒక భాగం. మీకు ఇష్ట‌మైన వారికి, స్నేహితుల‌కు, బంధువుల‌కు బ‌హుమ‌తులు ప్ర‌ధానం చేసేందుకు మీ బోన‌స్‌లో కొంత భాగాన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు. ఒక‌సారి ఆర్థికంగా భ‌ద్ర‌త ఏర్పాటు చేసుకున్న త‌రువాత విరాళం ఇచ్చేందుకు కూడా మీ బోన‌స్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. పండుగ సంద‌ర్భంగా ఎవ‌రికైనా స‌హాయ‌ప‌డాల‌కుంటే, మీకు న‌చ్చిన స్వ‌చ్ఛంద సంస్థ‌ను ఎంచుకుని విరాళం ఇవ్వ‌డం ద్వారా ఇత‌రుల‌కు స‌హాయ‌ప‌డ‌వ‌చ్చు. న‌గ‌దు రూపంలో కాక‌పోయినా, బ‌ట్ట‌లు కొని పంచ‌డం, లేదా ఆహారం ఏర్పాట్లు చేయ‌వ‌చ్చు.

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly