పన్ను మిన‌హాయింపులో హెచ్ఆర్ఏను ఇలా లెక్కిస్తారు

వేత‌నంలో భాగంగా అందుకునే ఇంటి అద్దె అల‌వెన్సుపై ప‌న్ను ఎలా ఆదా చేసుకోవ‌చ్చో తెలుసుకుందాం

పన్ను మిన‌హాయింపులో  హెచ్ఆర్ఏను ఇలా లెక్కిస్తారు

వేత‌న జీవుల‌కు ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇచ్చే ఒక ముఖ్య‌మైన ప‌న్ను మిన‌హాయింపు హెచ్ఆర్ఏ. దీన్నే ఇంటి అద్దె భ‌త్యం లేదా హౌజ్ రెంట్ అల‌వెన్సు అంటున్నాం. హెచ్ఆర్ఏ గురించి కొన్ని విష‌యాలు… అద్దె ఇంట్లో నివ‌సిస్తే హెచ్ఆర్ఏ కింద ప‌న్ను ఆదా కోసం క్లెయిం చేసుకోవ‌చ్చు, సొంత ఇల్లు ఉంటే హెచ్ఆర్ఏ క్లెయిం వ‌ర్తించ‌దు, త‌ల్లిదండ్రుల‌తో క‌లిసుంటే వారికి అద్దె చెల్లించిన‌ట్టుగా ర‌శీదులు లేదా లావాదేవీ చూపించి హెచ్ఆర్ఏ క్లెయిం చేసుకోవ‌చ్చు. అయితే త‌ల్లిదండ్రులు వారి ఆదాయంలో దీన్ని చూపించుకోవాల్సి ఉంటుంది, సంవ‌త్స‌రానికి అద్దె రూ.1ల‌క్ష కంటే ఎక్కువ‌గా చెల్లిస్తున్న‌ట్ట‌యితే ఇంటి యాజ‌మాని పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాలి. ఒక వేళ వారికి పాన్ లేక‌పోతే పేరు, చిరునామాతో డిక్ల‌రేష‌న్ తీసుకోవాల్సి ఉంటుంది.

హెచ్ఆర్ఏను ఇలా లెక్కిస్తారు…
ఇంటి అద్దె భ‌త్యంగా అందుకున్న మొత్తంలో ఈ మూడు అంశాల్లో ఏది త‌క్కువ‌గా ఉంటే దానికి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

  • మూల వేత‌నంలో 50శాతం(మెట్రో న‌గ‌రాల్లో), 40శాతం(మెట్రోయేత‌ర న‌గ‌రాల్లో)
  • సంస్థ నుంచి అందుకున్న వాస్త‌వ హెచ్ఆర్ఏ
  • చెల్లించిన వాస్త‌వ అద్దెలోంచి 10శాతం మూల వేత‌నం తీసివేయ‌గా వ‌చ్చే మొత్తం

ఉదాహ‌ర‌ణ‌కు-

కిర‌ణ్ నెలకు రూ.30వేల మూల వేత‌నం పొందుతున్నాడు. హైద‌రాబాద్‌లోని అద్దె ఇంటికోసం రూ.15వేలు క‌డుతున్నాడు. తాను ఉద్యోగం చేసే సంస్థ ఇంటి అద్దె భ‌త్యం రూ.20వేలు చెల్లిస్తుంది. ఇప్పుడు లెక్క చూద్దాం…

  • మూల‌వేత‌నంలో 40శాతం అంటే… ఏడాదికి రూ.1,44,000 ( నెల‌కు రూ.12వేలు * 12 నెల‌లు)
  • సంస్థ నుంచి అందుకున్న హెచ్ఆర్ఏ… రూ.2,40,000 ( నెల‌కు రూ.20వేలు * 12 నెల‌లు)
  • వాస్త‌వ అద్దెలోంచి 10శాతం మూల వేత‌నం తీసివేస్తే… రూ.1,44,000

కాబ‌ట్టి ఈ రూ.1,44,000 ఈ మూడింటిలో త‌క్కువ‌. దీనికి ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. మిగ‌తా రూ.96వేలు వేత‌నంలో ఆదాయంగా ప‌రిగ‌ణించి ప‌న్ను వ‌ర్తింప‌జేస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly