గృహ రుణ వ‌డ్డీ రేటు వ్య‌త్యాసం 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు ఉందా?

తాజా త‌గ్గింపుతో వార్షికంగా 8 శాతం ఉన్న‌ ఎస్‌బీఐ ఒక సంవ‌త్స‌రం ఎమ్‌సీఎల్ఆర్, వార్షికంగా 7.90 శాతానికి త‌గ్గింది

గృహ రుణ వ‌డ్డీ రేటు వ్య‌త్యాసం 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు ఉందా?

దేశీయ‌ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌-బేసెడ్ లెండింగ్ రేటు(ఎమ్‌సీఎల్ఆర్‌)ను 10 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించింది. త‌గ్గించిన రుణ రేట్లు నేటి నుంచి అమ‌లులోకి రానున్నాయి. 1 బేస్ పాయింట్ 0.01 శాతానికి స‌మానం. దేశీయ అతిపెద్ద బ్యాంక్ ప్ర‌స్తుత ఎమ్‌సీఎల్ఆర్ 7.9 శాతంగా ఉంది. ఈ పున‌రుద్ధ‌ర‌ణ వ‌ల్ల ఎమ్‌సీఎల్ఆర్‌తో అనుసంధాన‌మైన కొన్ని పాత గృహ రుణ వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయి. లేదా ఎస్‌బీఐ త‌న వినియోగ‌దారుల‌కు అందిస్తున్న కొత్త గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌తో స‌మానంగా ఉంటుంది.

ఈ సంవ‌త్స‌రం అక్టోబ‌రు నుంచి కొత్త రీటైల్ రుణాల‌న్నింటినీ ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్‌కు అనుసంధానం చేసిన సంగ‌తి తెలిసిందే. రెపో రేటును, త‌న ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్‌గా ఎస్‌బీఐ వినియోగించుకుంటుంది. కొత్త ఎక్స్‌ట‌ర్న‌ల్ బెంచ్‌మార్క్ ప్ర‌కారం, రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు గృహ రుణాల‌కు 8.2 శాతం చొప్పున‌, రూ.30 ల‌క్ష‌ల నుంచి రూ.75 ల‌క్ష‌ల లోపు గృహ‌ రుణాల‌కు 8.45 శాతం చొప్పున‌, రూ.75 ల‌క్ష‌లకు పైబ‌డిన గృహ‌రుణాల‌పై 8.55 శాతం చొప్పున వ‌డ్డీ రేటును ఎస్‌బీఐ వ‌ర్తింప‌జేస్తుంది.

ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ డేటా ప్ర‌కారం 2019 సంవ‌త్స‌రం ప్రారంభంలో… ఎమ్‌సీఎల్ఆర్ కంటే 10 నుంచి 60 బేసిస్ పాయింట్లు అధికంగా ఎస్‌బీఐ గృహ‌రుణ వ‌డ్డీ రేట్లు ఉండేవి. 2019 ప్రారంభంలో గృహ రుణ వ‌డ్డీ రేట్లు ప్ర‌స్తుతం ఉన్న బెంచ్‌మార్క్ రేట్ల‌కు స‌మానంగా కానీ, అంత‌కంటే త‌క్కువ‌గానీ ఉండేవి. రూ.30 ల‌క్ష‌ల లోపుల రుణం తీసుక‌న్న వారికి 8శాతం నుంచి 8.12 శాతం వ‌ర‌కు, రూ.30 ల‌క్ష‌ల నుంచి రూ.70 ల‌క్ష‌ల లోపుల రుణం తీసుకున్న వారికి రూ.8.3శాతం నుంచి 8.4 శాతం వ‌ర‌కు, రూ.75 ల‌క్ష‌ల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారికి రూ.8.4 శాతం నుంచి 8.5 శాతం వ‌ర‌కు వ‌డ్డీ రేట్లు వ‌ర్తించేవి.

కొత్త‌గా రుణాలు తీసుకునే వారికి ప్ర‌స్తుతం త‌క్కువ వ‌డ్డీ రేటుకే రుణాలు ల‌భిస్తున్నాయి. ఇప్ప‌టికే గృహ రుణం తీసుకున్న వారికి కూడా ఇప్ప‌టి వ‌డ్డీ రేట్ల‌తో పోలిస్తే, త‌క్కువ వ‌డ్డ‌కే రుణాలు తీసుకుని ఉండ‌వ‌చ్చు. అయితే కొత్త‌గా ల‌భించే గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌తో పోలిస్తే త‌క్కువ వ‌డ్డీకే రుణాలు తీసుకున్న వారి కంటే ఎక్కువ వ‌డ్డీకి రుణాలు తీసుకున్న వారి సంఖ్య అధికంగా క‌నిపిస్తుంది. వీరిలో చాలామంది గృహ ఫైనాన్స్ సంస్థ‌ల‌ నుంచి రుణం తీసుకున్న‌వారేన‌ని స్విచ్‌మీ.ఇన్(ఒక సంస్థ నుంచి మ‌రొక సంస్థ గృహ రుణాలను బ‌దిలీ చేయ‌డంలో స‌హాయ‌ప‌డే వేదిక‌) వ్య‌వ‌స్థ‌పాకుడు, సీఈఓ ఆదిత్య మిశ్రా అన్నారు.

మిశ్రా ప్ర‌కారం, త‌మ వెబ్‌సైట్‌ను సంద‌ర్శిస్తున్న వారిలో 9శాతం కంటే త‌క్కువ వ‌డ్డీ రేటుకు రుణాలు తీసుకున్న వారు 20 శాతం కాగా, మిగిలిన వారు 9 శాతం నుంచి 10 శాతం అధిక వ‌డ్డీ రేటుతో కూడిన రుణాలు తీసుకున్న‌వారున్నార‌ని తెలిపారు. ఒక‌వేళ అధిక వ‌డ్డీ రేటు చెల్లిస్తున్న వారిలో మీరు ఉంటే, గృహ రుణ బ‌దిలీకి ఇదే స‌రైన స‌మ‌యం.

గృహ రుణ చెల్లింపుల కాల‌ప‌రిమితి 10 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ ఉంటే, బ‌దిలీ నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని బ్యాంకింగ్ ప‌రిశ్ర‌మ నిపుణుల చెబుతున్నారు. దీనికి కార‌ణం ప్రారంభ సంవ‌త్స‌రాల ఈఎమ్ఐలో అధిక భాగం వ‌డ్డీ ఉంటుంది.

ఎప్పుడు మారాలి?

  • గృహ‌రుణ కాల‌ప‌రిమితి 15 సంవ‌త్స‌రాలు అంత కంటే ఎక్కువ ఉండి, ఇప్పుడు చెల్లిస్తున్న వ‌డ్డీ రేటు కంటే 25 బేసిస్ పాయింట్ల త‌క్కువ వ‌డ్డీరేటుకు రుణాలు ఆఫ‌ర్ చేస్తున్న‌ప్పుడు…
  • గృహ‌రుణ కాల‌ప‌రిమితి 10 నుంచి 15 సంవ‌త్స‌రాలు ఉండి, ఇప్పుడు చెల్లిస్తున్న వ‌డ్డీ రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల త‌క్కువ వ‌డ్డీరేటుకు రుణాలు ఆఫ‌ర్ చేస్తున్న‌ప్పుడు…
  • ఒక‌వేళ 10 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి కంటే త‌క్కువ ఉంటే, రుణ బ‌దిలీ వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుందా… అనే విష‌యాన్ని అంచ‌నా వేసుకుని…దాని ప్ర‌కారం బ‌దిలీ గురించి నిర్ణ‌యించుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly