ఆప‌ద వేళ‌... గ‌ట్టెక్కేందుకు అత్య‌వ‌స‌ర నిధి

ఆర్థిక ప్రణాళికలో భాగంగా, అనుకోని పరిస్థితులలో ఆదుకునేందుకు విడిగా కొంత మొత్తాన్ని సమకూర్చుకోవడం ఎంతో ముఖ్యం

ఆప‌ద వేళ‌... గ‌ట్టెక్కేందుకు అత్య‌వ‌స‌ర నిధి

మంచి ఉద్యోగం, నెలనెలా రాబడి ఉన్న వారికి అనారోగ్యం కారణంగానో, ప్రమాదం కారణంగానో కొంత కాలం విశ్రాంతి తీసుకోవలసి రావడం, అనుకోని కారణాల వల్ల ఉద్యోగం పోవడం వంటి పరిస్థితులను అత్యవసర పరిస్థితులగా భావించవచ్చు.

ఇలాంటి పరిస్థితులలో నెలవారీ రాబడి ఉండకపోగా ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, నెల నెలా చెల్లించవలసిన ఈఎంఐలు భారంగా మారుతాయి. చేతిలో ఉన్న మొత్తం ఖర్చయిపొతే ఎక్కువ వడ్డీకి క్రెడిట్ కార్డు ద్వారానో, బంధువులు, స్నేహితుల దగ్గరో అప్పుచేసి, ఇంకా పెద్ద మొత్తం అవసరమైతే ఏదైనా ఆస్తి లేదా బంగారం తనఖా పెట్టి ఇబ్బందులు పడాల్సి వస్తుంది… కొన్ని సందర్భాలలో భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడులను సైతం వాడవలసి రావచ్చు.

అధిగమించడం ఎలా…

ఇలాంటి ఇబ్బందులను అధిగమించాలి అంటే కొంత మొత్తాన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చెసుకోవాలి. ఈ నిధిని వీలైనంత త్వరగా, పెట్టుబడుల పెట్టే కంటే ముందే ఏర్పాటు చెసుకోవాలి. దీని ద్వారా భరోసా లభించడంతోబాటు అధిక వడ్డీ రుణాలు తీసుకోవడం , దీర్ఘ కాలిక పెట్టుబడులకు అంతరాయం కలిగించడం వంటివి నివారించవచ్చు.

ఎంత మొత్తం అవసరం

సాధారణంగా ఇలాంటి అత్యవసర పరిస్థితులు కొన్ని వారాలు లేదా నెలల పాటు ఉంటాయి. కాబట్టి మూడు నుండి ఆరు నెలల ఖర్చులకు సరిపడే మొత్తాన్నిఅత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి అనుకుంటే అందుకు తగిన మొత్తం ఉంటే మంచిది.

ఎక్కడ పెట్టుబడి చెయ్యాలి…

సాధారణంగా అవసరానికి అందుబాటులో వుంటుంది అని డబ్బు ఇంట్లో ఉంచుకోవడమో లేదా బ్యాంకు పొదుపు ఖాతాలో జమ చేయడమో చేస్తుంటాం. కానీ డబ్బు అందుబాటులో ఉండడంతోబాటు, దానిపై రాబడి ఉండడమూ ముఖ్యమే. అందుకే ఈ నిధిలో కొంత మొత్తం అంటే పది వేల వరకు నగదు రూపంలో ఇంటిలో అందుబాటులో ఉంచుకోవాలి. బ్యాంకు ఏటీఎం కి వెళ్లి డబ్బు తెచ్చే అవకాశం లేని సందర్భాలలో ఉపయోగపడుతుంది.

లిక్విడ్ ఫండ్లలో మదుపు

బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము ఏటీఎం కార్డు ద్వారా వెంటనే పొందే అవకాశం ఉన్నా రాబడి చాలా తక్కువగా ఉంటుంది. బ్యాంకు ఖాతా కంటే ఎక్కువ రాబడినిస్తూ అవసరానికి అంతే అనువుగా ఉండే బ్యాంకు ఫ్లెక్సి డిపాజిట్లు లేదా లిక్విడ్ ఫండ్లలో మదుపు చెయ్యాలి. వీటి ద్వారా ఎక్కువ రాబడి ఉంటుంది, పైగా ఒక్క రోజులో డబ్బు చేతికందే సులభత ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోనూ అత్యవసర నిధిని విత్ డ్రా చేసుకునే వీలు లేని, లాక్ఇన్ పీరియడ్ ఉన్నసాధనాలలో పెట్టుబడి పెట్టకూడదు.

ఖర్చు చెయ్యడం

అత్యవసర నిధిని కేవలం అత్యవసరాలకు మాత్రమే వాడాలి. ఆ సమయంలో వీలయినంత పొదుపుగా ఖర్చు చెయ్యాలి. పరిస్థితులలో స్థిరత్వం వచ్చే వరకు ఇంతక ముందే నిర్ణయించిన సిప్ ల ద్వారా పెట్టుబడి నిలుపు చేయవచ్చు. అలాగే బ్యాంకులను సంప్రదించి రుణాల ఈఎంఐలు కొంత కాలం ఆపే వెసులుబాటు ఉంటే ఏర్పాటు చేసుకోవాలి.
తప్పని పరిస్థితి అయితే తప్ప ఈ నిధిని వాడ కూడదు అనే నిబద్దత ఉండాలి.

తిరిగి నిధిని సమకూర్చుకోవడం

అవసరానికి ఈ నిధి వాడుకున్న తరవాత ఈ నిధి గురించి మరిచిపోకుండా వీలయినంత త్వరగా తిరిగి ఏర్పాటు చెసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly