సొంతింటి కల నిజమవ్వాలంటే ఇలా చేయండి!

రుణానికి దరఖాస్తు చేసుకునేప్పుడు తప్పనిసరిగా గమనించాల్సిన కొన్ని విషయాలున్నాయి

సొంతింటి కల నిజమవ్వాలంటే ఇలా చేయండి!

సొంతిల్లు… ఇది ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకోవడానికి గృహరుణంతో బాటలు వేసుకునేవారే చాలామంది కనిపిస్తారు. పురుషులే ఈ రుణాలు తీసుకోవాలన్న భావన పాతది… డబ్బును సమర్థంగా నిర్వహించే మహిళలూ ఇప్పుడు గృహరుణాలతో తమ సొంతింటి కలను తీర్చుకుంటున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు బ్యాంకులు, రుణ సంస్థలూ ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళలకు గృహరుణం తీసుకునేందుకు ఉన్న మార్గాలేమిటి? ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తెలుసుకుందాం. బ్యాంకు ఖాతా, రుణం తీసుకోవడం, ఇంకా ఇతర ఆర్థిక సంబంధిత విషయాలేమైనా కావచ్చు… బ్యాంకులు, రుణ సంస్థలు మహిళలను ముఖ్యమైన ఖాతాదారులుగా భావిస్తాయి. అందుకే, వారికి ప్రత్యేక వెసులుబాట్లు కూడా కల్పిస్తుంటాయి. అంతర్జాతీయంగా చూసినప్పుడు పురుషులకన్నా… మహిళల రుణగ్రహీతల సగటు 3.7శాతం తక్కువేనని ఓ నివేదిక చెబుతోంది. క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర నివేదిక, వాయిదాల చెల్లింపులులాంటి వాటిల్లో పురుషులకన్నా మహిళలే మెరుగ్గా ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి, మగవారితో పోలిస్తే… డబ్బు నిర్వహణ, అప్పులు తదితర వాటిల్లో మహిళలు ఎంతో ముందున్నట్లు తెలుసుకోవచ్చు. అంతేకాదు… అత్యవసరాలకోసం పొదుపు చేయడం, అవసరమైనప్పుడు ఆర్థిక సలహాదార్లను సంప్రదించడంలోనూ నేటి మహిళలదే పైచేయి. ఈ నేపథ్యంలో మహిళలు ప్రాథమిక దరఖాస్తుదారులుగా, లేదా సహదరఖాస్తుదారులుగా ఉండి గృహరుణం తీసుకొంటే కాస్త తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. తాము తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే విషయంలో మహిళలు చాలా నిబద్ధతతో ఉంటారన్న కారణం ఇక్కడ కీలకంగా మారుతుంది. అందుకే, బ్యాంకులు కూడా వారికి తమ వంతు ప్రోత్సాహాన్ని వడ్డీ రాయితీ రూపంలో అందిస్తుంటాయి. అయితే, రుణానికి దరఖాస్తు చేసుకునేప్పుడు మహిళలు తప్పనిసరిగా గమనించాల్సిన కొన్ని విషయాలున్నాయి.

పత్రాలు చూసుకోండి:

గృహరుణానికి దరఖాస్తు చేయాలనుకున్నప్పుడు… మీరు ముందుగా దానికి సంబంధించిన దరఖాస్తును ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేయాలి. దీనికి అనుబంధంగా వ్యక్తిగత, చిరునామా, వయసు ధ్రువీకరణ పత్రాల్లాంటివి సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు ఉద్యోగి అయితే… ఆమె తన ఆదాయ ధ్రువీకరణ కోసం రెండేళ్ల ఫారం-16, ఆదాయపు పన్ను సమర్పించిన రుజువులు, మూడు నుంచి ఆరు నెలల వేతన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ స్వయం ఉపాధి పొందుతుంటే… గత రెండేళ్ల బ్యాలెన్స్‌ షీట్‌, లాభనష్టాల పట్టికతోపాటు బ్యాంకు ఖాతా వివరాలను కూడా జత చేయాల్సి ఉంటుంది. రుణ సంస్థలు కొన్ని అదనపు పత్రాలను కూడా అడిగేందుకు అవకాశం ఉంది.

ప్రస్తుతం పలు సంస్థలు గృహరుణం కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఇక్కడ అవసరమైన పత్రాలన్నింటినీ డిజిటల్‌ రూపంలో అప్‌లోడ్‌ చేయాలి. వీటిని పరిశీలించిన రుణ సంస్థలు ఎంత మేరకు రుణం రావచ్చనే విషయాన్ని తెలియజేస్తాయి. దీన్ని బట్టి మీరు ఇంటిని వెతుక్కోవడం సులభం అవుతుంది. మీరు ఇంటిని నిర్ణయించుకున్న తర్వాత ఆ ఆస్తికి సంబంధించిన పత్రాలను రుణ సంస్థ ప్రతినిధికి అందిస్తే సరిపోతుంది. రుణం ఇచ్చేముందు సంబంధిత సంస్థలు ఈ పత్రాలను క్షుణ్నంగా పరిశీలిస్తాయి. ఆ తర్వాతే రుణం మంజూరు చేస్తాయి.

  • సాధారణంగా దరఖాస్తు చేసిన 10-12రోజుల్లో గృహరుణం మంజూరవుతుంది. అయితే, సమర్పించిన పత్రాల్లో ఏదైనా వ్యత్యాసం ఉంటే… అదనంగా మరికొంత వ్యవధి పట్టొచ్చు.

సహదరఖాస్తు కావాలనుకుంటే:

మహిళలు గృహరుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తన జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలను సహదరఖాస్తుగా పేర్కొనవచ్చు. ఉమ్మడి వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు లేదా ఉమ్మడిగా కలిసి ఉంటున్నప్పుడు అన్నదమ్ములను కూడా సహదరఖాస్తుగా పేర్కొనేందుకు వీలుంది. తక్కువ ఆదాయం ఉన్నప్పుడు కొన్నిసార్లు అనుకున్న మొత్తంలో రుణం రాకపోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఉమ్మడి రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. వివాహం అయిన మహిళలు భర్తతో కలిపి లేదా రక్త సంబంధీకులతో కలిపి ఉమ్మడి రుణానికి దరఖాస్తు చేయవచ్చు. అప్పుడు రుణ మొత్తం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… సహ రుణగ్రహీత ఆస్తిలో కూడా సహ యజమానిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఇద్దరికీ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.

ఎలాంటి బాకీలు లేకుండా:

ముందే అనుకున్నట్లు రుణ చెల్లింపుల్లో మహిళలు ఎలాంటి పొరపాట్లకూ తావీయరనే చెప్పొచ్చు. అయినప్పటికీ… మీరు తీసుకున్న రుణాలకు సంబంధించి, అన్ని వివరాలనూ మీకు అందుబాటులో ఉంచుకోండి. అధీకృత క్రెడిట్‌ బ్యూరో నుంచి ఎప్పటికప్పుడు రుణ నివేదిక, క్రెడిట్‌ స్కోరును తెలుసుకోండి. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపులో ఆలస్యం, వ్యక్తిగత, గృహరుణ వాయిదాలను సమయానికి చెల్లించకపోవడం ఇవన్నీ కూడా రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరు మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. సరైన క్రెడిట్‌ స్కోరు ఉన్నప్పుడు కావాల్సిన రుణాలు వేగంగా పొందేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు వడ్డీల్లో కూడా రాయితీ పొందే అవకాశం కలుగుతుంది.

ప్రత్యేక పథకాలు:

మహిళల కోసం ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టింది. భారత ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా మహిళల పేర్లమీదే సంబంధిత ఇళ్లను కేటాయిస్తోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేర్లమీద ఇళ్లు కొన్నప్పుడు స్టాంపు డ్యూటీలోనూ రాయితీనిస్తున్నాయి. గృహరుణం తీసుకొని ఇల్లు కొన్నప్పుడు, చెల్లించే వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుందన్నది తెలిసిందే. దంపతులిద్దరూ కలిసి, గృహరుణంతో ఇల్లు కొన్నప్పుడు… ఇద్దరూ కూడా వారి వారి వాటాల మేరకు ఈ మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది.

సాధారణంగా మన దేశంలో తక్కువ మంది మహిళల పేరు మీద ఇళ్లు ఉన్నాయి. మహిళల ఆర్థిక స్వేచ్ఛకు ఇది ఇబ్బందికరమైన అంశమే. ఈ పరిస్థితిని మార్చేందుకు అటు ప్రభుత్వంతోపాటు, ఇటు ఆర్థిక రుణ సంస్థలూ ప్రయత్నం చేస్తున్నాయి. దీనికోసం ప్రత్యేక రాయితీలు, పథకాలను అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందుకొని, గృహ యజమానులుగా మారాల్సిన తరుణమిదే.

ఏ వడ్డీ ఎంచుకోవాలి?

గృహరుణ వడ్డీ రేట్లు రెండు రకాలుగా ఉంటాయి. స్థిర, చలన విధానంలో వీటిని తీసుకోవచ్చు. స్థిర వడ్డీ విధానాన్ని ఎంచుకున్నప్పుడు ఎంత చెల్లించాలి… ఎన్నాళ్ల వరకూ చెల్లించాలి అనే విషయంలో కొంత స్పష్టత ఉంటుంది. తొలినాళ్లలో రుణానికి చెల్లించే నెలసరి వాయిదాల్లో అధిక భాగం వడ్డీ కిందే జమ అవుతుంది. కొంత మేరకే అసలులో తగ్గుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీ భాగం తగ్గి, అసలు మొత్తం తగ్గుతూ వస్తుంది. చలన వడ్డీ రేట్లతో పోలిస్తే… ఫిక్స్‌డ్‌ రుణాల వడ్డీ రేట్లు కాస్త అధికంగానే ఉంటాయి. అంతేకాకుండా… వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ఆ ప్రయోజనం అందకపోవచ్చు.

చలన వడ్డీకి రుణం తీసుకున్నప్పుడు మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా… ఈ వడ్డీ రేటులో హెచ్చుతగ్గులుంటాయి. బేస్‌, ఎంసీఎల్‌ఆర్‌ రేట్లతో ఇది ముడిపడి ఉంటుంది. ఇవి దీర్ఘకాలంలో తగ్గుతూ…పెరుగుతూ ఉంటాయి. స్థిర వడ్డీ రేటుతో పోలిస్తే… చలన వడ్డీ రేటుతో ప్రయోజనాలు ఎక్కువే. అందుకే, చాలామంది ఈ విధానంలో రుణం తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ రుణాలకు ఎలాంటి ముందస్తు చెల్లింపు రుసుములు కూడా ఉండవు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly