పెట్టుబ‌డి పెంచితే ఎంత రాబడి వస్తుంది?

ప్రతి ఏడాది పెట్టుబ‌డి పెంచడం వలన దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో ఎక్కువ మొత్తం సమకూర్చుకునే అవకాశం ఉంటుంది.

పెట్టుబ‌డి పెంచితే ఎంత  రాబడి వస్తుంది?

ఇంతకు మునుపు క‌థ‌నంలో నెలకు రూ. 5 వేలు చొప్పున వివిధ కాలపరిమితులకు మదుపు చేస్తే, 6%,8%, 10% , 12% రాబడి అంచనాతో ఎంత మొత్తం జమ అవుతుందో, మనం జమ చేసే మొత్తం ఎంతో , అలాగే రాబడిగా ఎంత మొత్తం వస్తుందో తెలుసుకున్నాము.
ఈ విధానంలో మొదటి నెల నుంచి చివరి నెల వరకు నెలవారీ మదుపు చేసే మొత్తం రూ . 5 వేలు గానే పరిగణించాము. అయితే మారుతున్న కాలానికి వయసు, ఆదాయం తోపాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎల్లకాలం ఒకే మొత్తాన్ని జమ చేయం.

అందువలన భవిష్యతు అవసరాలను దృష్టిలో ఉంచుకుని , ప్రతి సంవత్సరం మదుపు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇది ఆదాయంలో ఎంత శాతం పెంచాలన్నది ఎవరి అవసరాలను వారు గుర్తించి మదుపు పెంచాల్సి ఉంటుంది.

ప్రతి ఏడాది పెంచడం వలన దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో ఎక్కువ మొత్తం సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. దీనిద్వారా పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా సునాయాసంగా చేరుకోవచ్చు. ప్రతి సంవత్సరం నెలసరి బడ్జెట్ లో ఈ పెంపు కు కొంత మొత్తం కేటాయించడం వలన, ఇతర ఖర్చులను కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివలన మొదలు పెట్టిన మదుపు కార్యక్రమం మధ్యలో ఆగదు . కొంత మంది ఒక లక్ష్యం కోసం ఒక పధకాన్ని ఎంచుకుని మదుపు మొదలుపెడతారు. అయితే మధ్యలో వేరొక స్వల్పకాలిక లక్ష్యానికి ఈ సొమ్ముని మళ్లిస్తారు. దీనివల్ల అనుకున్న మొత్తం జమచేయక , వాయిదా వేస్తుంటారు. మళ్ళీ ఆ మదుపు మొదలుపెట్టడానికి కొంత సమయ పట్టవచ్చు. లేదా ఒక్కొక్కసారి మధ్యలోనే ఆపివేయవచ్చు. దీనివలన అనుకున్న రాబడి పొందలేము.

ఉదా : మీరు మొదటి ఏడాది ప్రతి నెలా రూ. 5 వేలతో మదుపు మొదలుపెట్టారు. మరుసటి ఏడాది నుంచి ప్రతి ఏడాది 5 శాతం చొప్పున పెంచుకుంటూ వెళతారు. అంటే రెండవ ఏడాది రూ 5,250 లతో ప్రతి నెలా మదుపు చేస్తారు. మూడవ ఏడాది రూ 5,500 లతో ప్రతి నెలా మదుపు చేస్తారు. అలా 3 ఏళ్ళు మీరు చేసే మదుపు మొత్తం రూ 1,89,150. 6 శాతం రాబడి తో జమ అయ్యే మొత్తం రూ. 2,07,038. అంటే లభించే రాబడి రూ. 18,158.
అదే ప్రతి ఏడాది 5 శాతం పెంచుకుంటూ , 10 ఏళ్ళు మీరు చేసే మదుపు మొత్తం రూ 7,54,674 . 6 శాతం రాబడి తో జమ అయ్యే మొత్తం రూ. 10,11,191. అంటే లభించే రాబడి రూ. 2,56,518.

ఈ విధముగా వివిధ కాలపరిమితులకు , వివిధ శాతాల రాబడితో ఎంత మొత్తం పొందవచ్చో కింది పట్టికలో వివరించబడింది.
వివిధ కాల‌ప‌రిమితుల‌కు 6 శాతం, 8 శాతం రాబ‌డితో…
i1.jpg

వివిధ కాల‌ప‌రిమితుల‌కు 10 శాతం, 12 శాతం రాబ‌డితో…
i2.jpg
కొన్ని పథకాలలో కచ్చితమైన రాబడి ఎంత వస్తుందో ముందే తెలుస్తుంది. ఉదా : రికరింగ్ డిపాజిట్ , ఫిక్సెడ్ డిపాజిట్ . కొన్ని పథకాలలో వడ్డీ రేట్లు స్వల్పంగా మారుతుంటాయి. కొన్ని సార్లు పెరగవచ్చు, లేదా కొన్ని సార్లు తగ్గవచ్చు. ఉదా : చిన్న పొదుపు మొత్తాల పథకాలైన పీపీఎఫ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం వంటివి. వీటి వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుతం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తూ ఉంటుంది కాబట్టి.
కొన్ని పథకాలలో కచ్చితంగా ఎంత వస్తుందో ముందే చెప్పలేము. అయితే దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తాయి. ఉదా: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.

ముగింపు:
మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ) , రాబడి, ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.
ప్రతి ఏడాది మనం చేసే మదుపును లక్ష్యాలతో సమీక్షించుకుంటూ ఉండాలి. లోటుపాట్లను సద్దుకుంటూ మదుపు చేస్తే మీ లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగలరు. కాబట్టి ఆలస్యం చేయకండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly