మనదేశంలో ఇదే మొట్టమొదటి ఇంటర్నెట్ కారు..

ఈ కారులో ఇన్‌బిల్ట్‌గా 5జీ స్మార్ట్‌ సిమ్‌ను అమర్చారు. మీ స్మార్ట్‌ఫోన్‌తో దీనిని అనుసంధానం చేసుకోవచ్చు

మనదేశంలో ఇదే మొట్టమొదటి ఇంటర్నెట్ కారు..

బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ అయిన ఎంజీ మోటార్ ‘ది హెక్టర్’ పేరుతో భారతదేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్ కారును ఆవిష్కరించింది. మే నెలలో దీనిని భారత మార్కెట్లోకి విడుదల చేసి, జూన్ నెల నుంచి అమ్మకాలను ప్రారంభించాలని సంస్థ భావిస్తుంది. ఈ కారు ధర సుమారు రూ. 17 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కారును ఆవిష్కరించడం ద్వారా భారతదేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో అధిక భాగం వాటాను కైవసం చేసుకోవాలని 95 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంజీ మోటార్ భావిస్తుంది. కట్టింగ్ ఎడ్జ్ కార్ టెక్నాలజీ, ఐస్మార్ట్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ కలిగిన ఈ కార్లను గ్లోబల్ టెక్నాలజీ ప్లేయర్స్ అయిన మైక్రోసాఫ్ట్, అడోబ్, ఎస్ఏపీ ల భాగస్వామ్యంతో సంస్థ అభివృద్ధి చేస్తుంది. రాబోయే రెండు సంవత్సరాలలో మేము నాలుగు కొత్త మోడల్స్ ను భారతదేశంలో ప్రారంభించబోతున్నామని, దానిలో భాగంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా హెక్టార్ ఎస్యూవీని, తరువాత ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చబా తెలిపారు. ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) అప్ డేట్స్ ను కూడా ఈ కారు సపోర్ట్ చేస్తుందని రాజీవ్ చబా తెలిపారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) వెర్షన్ తో పాటు, భవిష్యత్తులో 48-వోల్ట్ హైబ్రిడ్ వెర్షన్ ను కూడా హెక్టర్ లో తీసుకురానున్నట్లు రాజీవ్ తెలిపారు.

టెస్లా కార్ల మాదిరిగా, హెక్టర్ కూడా 10.4 ఇంచ్ హెడ్ యూనిట్ ( టచ్ స్క్రీన్) ని కలిగి ఉంటుంది. భారతదేశంలో ఇంత పెద్ద టచ్ స్క్రీన్ సిస్టం కలిగిన కారు మరొకటి లేదు. ఈ కారులో ఇన్‌బిల్ట్‌గా 5జీ స్మార్ట్‌ సిమ్‌ను అమర్చారు. మీ స్మార్ట్‌ఫోన్‌తో దీనిని అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే ఇది ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్‌ అసిస్టెంట్‌ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. హెలో ఎంజీ అనగానే ఇది యాక్టీవేట్ అవుతుంది. దీని సహాయంతో మీరు కారు డోర్లను మూయడం లేదా తెరవడం, కారును లాక్ చేయడం, సన్ రూఫ్ ను మూయడం లేదా తెరవడం, ఏసీ ని పెంచడం లేదా తగ్గించడం, నావిగేషన్ సిస్టంను ఆపరేట్ చేయడం వంటి వాటిని కేవలం మీ నోటి మాటతో నియంత్రించవచ్చు. ట్రాఫిక్ అప్ డేట్స్ ని కూడా ఇది మీకు అందిస్తుంది. ఒకవేళ మీరు కారులో లేకపోయినా, మీ స్మార్ట్ ఫోన్ లోని యాప్ సహాయంతో కారును లాక్ చేయడం, సన్ రూఫ్ ను మూసివేయడం లాంటివి చేయవచ్చు.

morris garage.jpg

కేవలం స్మార్ట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా, భద్రతా పరంగా కూడా ఈ కారులో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఒకవేళ మీ కారు ప్రమాదానికి గురైనట్లైతే, ఇందులోని ఈ-కాల్‌ ఎమెర్జెన్సీ సిస్టం మీ కారు లొకేషన్ తో కూడిన మెసేజ్ ను కస్టమర్‌ కేర్‌కు పంపుతుంది. మీ కారులోని ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోగానే, సంస్థ పల్స్‌ హబ్‌కు మెసేజ్ వెళ్తుంది. దానితో వారు మీకు అత్యవసర సహాయాన్ని అందిస్తారు.

ఈ కారు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాటా హారియర్‌, జీప్‌ కంపాస్‌, హ్యుందాయ్‌ టక్సన్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 500 లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly