పెట్టుబ‌డుల‌ను స‌మీక్షించుకుంటున్నారా?

పెట్టుబ‌డుల‌ను స‌మీక్షించుకోవ‌డం ద్వారా మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి అనుగుణంగా పెట్టుబ‌డులు ఉన్నాయా లేదా అనే విషయం తెలుస్తుంది.

పెట్టుబ‌డుల‌ను స‌మీక్షించుకుంటున్నారా?

స్టాక్‌మార్కెట్ క‌ద‌లిక‌ల ప్ర‌భావం మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ప‌డుతుంది. త‌ద్వారా మ‌దుప‌ర్లు నిర్దేశించుకున్న‌ పెట్టుబ‌డి ల‌క్ష్యం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డులను అప్పుడప్పుడు స‌మీక్షించుకుంటూ ఉండాలి. మార్కెట్ల ప్ర‌భావం ఈక్విటీ ఫండ్ల‌పై ఎక్కువ‌గా ఉంటుంది. స్థిరాదాయ వ‌ర్గానికి చెందిన ఫండ్ల‌పై కూడా వ‌డ్డీ రేట్ల ప్ర‌భావం ఉంటుంది. ఒక్కోసారి వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌డంతో డెట్ మార్కెట్లు వృద్ధి త‌క్కువ‌గా క‌న‌బ‌రుస్తాయి. ఇలాంట‌ప్పుడే కొంత పెట్టుబ‌డిని డెట్ నుంచి ఈక్విటీల‌కు మ‌ళ్లించాలి. అస్థిర‌త అధికంగా ఉంటే మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డిని కొంత డెట్ వ‌ర్గానికి బ‌దిలీ చేసుకునే దిశగా నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. ఈ విధ‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌ను స‌మీక్ష చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.పెట్టుబ‌డి మార్కెట్ విలువ బ‌ట్టి ఎంత శాతం రాణించిద‌నేది మ‌దుప‌ర్లు తెలుసుకోవ‌చ్చు. అంత‌గా వృద్ధి క‌న‌బ‌ర్చ‌ని పెట్టుబ‌డుల‌ను పోర్ట్‌ఫోలియో నుంచి తొల‌గించ‌డ‌మో లేదా ఇత‌ర ప‌థ‌కాల‌కు మ‌ళ్లించ‌డ‌మో చేయాలి. పోర్ట్‌ఫోలియోను స‌మీక్ష క‌నీసం ఆరు నెల‌ల‌కోసారి చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మ‌దుప‌ర్లు
మ‌రింత త‌ర‌చుగా కూడా పెట్టుబ‌డుల‌ను స‌మీక్షించుకోవ‌చ్చు. దీనికి సంబంధించి మ‌దుప‌ర్లు పెట్టుబ‌డుల‌లో ఉండే న‌ష్ట‌భ‌యం ఆధారంగా నిర్ణ‌యించుకోవ‌చ్చు. పోర్ట్‌ఫోలియోలో పెట్టుబ‌డుల మొత్తం ఒక శ్రేణికి మించి న‌ష్టాల్లో ఉంటే క‌చ్చితంగా త‌గిన మార్పులు చేసుకోవాల్సిందే. మ‌దుప‌ర్లు త‌మ అంచ‌నా లేదా క‌నీస రాబ‌డి కంటే త‌క్కువ‌గా రాణించే వాటిని గ‌మ‌నించి ఆ ప‌థ‌కం నుంచి మ‌రోదానికి మార‌వ‌చ్చు.

పెట్టుబ‌డుల‌ను స‌మీక్షించుకోవ‌డం ద్వారా మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి అనుగుణంగా పెట్టుబ‌డులు ఉన్నాయా లేదా అనే విషయం తెలుస్తుంది. త‌ద్వారా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఒక్కో స‌మీక్ష‌కు మ‌ధ్య గ‌డువు మ‌రీ ఎక్కువ కాకుండా, మ‌రీ త‌క్కువ కాకుండా చూసుకోవాలి. స‌మీక్ష క‌నీసం ఆరు నెల‌ల‌కోసారి చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. పోర్ట్‌ఫోలియోను నిర్మించుకొని దాన్ని చివరిదాకా ఉంచడం వల్ల ఎలాంటి లాభం ఉండ‌క‌పోవ‌చ్చు. అదే సమయంలో పోర్ట్‌ఫోలియోలో త‌ర‌చూ మార్పులు చేయ‌డం వల్ల కూడా లాభం ఉండ‌దు. బ్రోకరేజీ ఛార్జీలు, నిష్క్రమణ రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌ పద్ధతి ప్రకారం పోర్ట్‌ఫోలియోలో సర్దుబాటును చేసుకోవడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly