ఆరోగ్య బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురైందా?

మీ ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితుల గురించి పూర్తి వివరాలను తెలియజేయడం చాలా మంచిది

ఆరోగ్య బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురైందా?

ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, పాలసీ తీసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను బీమా సంస్థ కోరుతుంది. ముందస్తు వ్యాధుల గురించి పాలసీదారుడు బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియచేయాల్సి ఉంటుంది. పాలసీదారుడు అందించిన సమాచారం ఆధారంగా బీమా సంస్థ అనారోగ్య స్వభావాన్ని అర్థం చేసుకుని, దానిని కవర్ చేయడానికి చెల్లించాల్సిన ప్రీమియంను నిర్ణయిస్తుంది. అయితే, ఒకవేళ మీ వ్యాధులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని బీమా సంస్థకు తెలియచేయకపోతే, భవిష్యత్తులో బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన మీ ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితుల గురించి పూర్తి వివరాలను తెలియజేయడం చాలా మంచిది. నిపుణులు సూచనల ప్రకారం, పాలసీ తీసుకునే సమయంలో పాలసీదారులు తమ పూర్తి ఆరోగ్య వివరాలను బీమా సంస్థకు తెలియచేసినట్లైతే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఉదాహరణకి, చాలా బీమా సంస్థలు 45 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారిని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరకుండానే, కేవలం నమ్మకం ఆధారంగా పాలసీని జారీ చేస్తాయి. అయితే, పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీ సరైన వైద్య పరిస్థితులను లేదా ముందుగా ఉన్న వ్యాధులను బహిర్గతం చేయవలసి ఉంటుంది, లేదంటే భవిష్యత్తులో మీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన పాలసీ ఫారంను సరిగ్గా అర్థం చేసుకోని, సరైన ఆరోగ్య వివరాలతో పూరించడం చాలా ముఖ్యం.

ఒకవేళ బీమా పాలసీని కొనుగోలు చేసిన రెండు లేదా మూడు సంవత్సరాల తరువాత వైద్య సమస్యలను నిర్ధారించినట్లయితే, మీ పాలసీని జారీ చేసిన బీమా సంస్థకు మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని బహిర్గతం చేయవలసిన అవసరం లేదు. అలాగే పాలసీ పునరుద్ధరణ సమయంలో కూడా మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలియచేయాల్సిన అవసరం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒకవేళ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, మీ ఆరోగ్య సమస్య గురించి మీకు అవగాహన లేకుండా ఉండి, పాలసీ తీసుకున్నాక అది బయటపడినట్టయితే, మీ బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురి అవ్వదు.

పాలసీ పునరుద్ధరణ సమయంలో, పాలసీదారుడి ఆరోగ్య పరిస్థితుల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకున్నట్లైతే, ఆ విషయాన్ని పాలసీదారుడు బీమా సంస్థకు తెలియచేయాల్సి ఉంటుంది. దీని కారణంగా పాలసీదారుడి ప్రీమియం ధరపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఒకవేళ పాలసీదారుడు ఇప్పటికే ఉన్న హామీ మొత్తాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం కూడా పెరుగుతుంది.

బీమా పాలసీని కొనుగోలు చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత, మీరు కొత్త ఆరోగ్య సమస్యకు గురై, మీ ప్రస్తుత హామీ మొత్తాన్ని పెంచుకోవాలనుకుంటే, అప్పుడు బీమా సంస్థ దీనిని ముందస్తు అనారోగ్యంగా పరిగణలోకి తీసుకొని, పాలసీ ప్రీమియంను పెంచుతారు. అయితే, మీరు ప్రారంభంలో తీసుకున్న ఆరోగ్య బీమా కవర్ ను ఇది ప్రభావితం చేయకపోవచ్చు. అయితే, కొన్ని బీమా సంస్థలు హామీ మొత్తాన్ని పెంచడానికి అంగీకరించకపోవచ్చు లేదా ఇప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితులను మినహాయించవచ్చు.

ఉదాహరణకు, మీరు ధూమపానం చేసేవారై ఉండి, పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, ఆ విషయాన్ని బీమా సంస్థకు మీరు తెలియచేయకపోతే, క్లెయిమ్ సమయంలో ఆ విషయం బయటపడినట్లైతే, బీమా సంస్థ మీ క్లెయిమ్ ను తిరస్కరించే హక్కును కలిగి ఉంటుంది. ఒకవేళ పాలసీ తీసుకునే సమయంలో పాలసీదారుడికి ధూమపానం అలవాటు లేకుండా, తరువాతి సంవత్సరాల్లో ధూమపానాన్ని ప్రారంభించినట్లయితే, ఈ కారణంగా అతని ఆరోగ్య బీమా ప్రీమియం ప్రభావితం అవదు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly